'ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం'గా బంధం బలోపేతం..
రక్షణ రంగంలో ఉమ్మడి ఆయుధ ఉత్పత్తి,
2029 నాటికి 20 బిలియన్ యూరోల వాణిజ్యమే లక్ష్యం
మోదీ-మెలోని చారిత్రాత్మక చర్చలు!
రాజకీయ ఉద్రిక్తతలు , అంతర్జాతీయ సంక్షోభాలు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ప్రస్తుత తరుణంలో, భారతదేశం ,టలీ దేశాలు తమ దౌత్య సంబంధాలను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాయి. ఇటలీ రాజధాని రోమ్‌లో బుధవారం నాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనిల మధ్య జరిగిన విస్తృతస్థాయి చర్చలు సరికొత్త మైలురాయిని లిఖించాయి. ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక సంబంధాలను 'ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం' (Special Strategic Partnership) స్థాయికి పెంచుతూ ఇరు నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే రెండు దేశాల మధ్య వార్షిక ద్విపాక్షిక వాణిజ్యాన్ని 2029 నాటికి 20 బిలియన్ యూరోలకు (సుమారు రూ. 1.8 లక్షల కోట్లు) విస్తరించాలని ప్రతిజ్ఞ చేశారు. ప్రధాని మోదీ తన నాలుగు దేశాల ఐరోపా పర్యటనలో భాగంగా చివరి విడతగా రోమ్ చేరుకుని ఈ చర్చల్లో పాల్గొన్నారు.
ఈ చరిత్రాత్మక భేటీలో అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశం రక్షణ రంగం. ఇరు దేశాలు ఉమ్మడిగా సైనిక హార్డ్‌వేర్, హెలికాప్టర్లు, నౌకాదళ ప్లాట్‌ఫారమ్‌లు, సముద్ర ఆయుధాలు , ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ వ్యవస్థలను సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి, ఉత్పత్తి చేయడానికి (Co-development and Co-production) వీలుగా ఒక 'డిఫెన్స్ ఇండస్ట్రియల్ రోడ్‌మ్యాప్'ను ఖరారు చేశాయి. దీనితో పాటు సముద్ర భద్రత, సమాచార మార్పిడిని పెంచేందుకు 'మెరైన్ సెక్యూరిటీ డైలాగ్'ను ప్రారంభించాలని నిర్ణయించారు. కేవలం రక్షణ రంగమే కాకుండా ఉన్నత విద్యాభ్యాసం, క్రిటికల్ మినరల్స్, అంతరిక్ష పరిశోధనలు, వ్యవసాయం, కృత్రిమ మేధ (AI), క్వాంటం కంప్యూటింగ్, సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ , సముద్ర రవాణా వంటి విభిన్న రంగాలకు సంబంధించి 10 కీలక అవగాహన ఒప్పందాలపై (MoUs) ఇరుపక్షాలు సంతకాలు చేశాయి. ముఖ్యంగా భారతీయ నర్సులు ఇటలీలో సులభంగా ఉపాధి పొందేందుకు వీలు కల్పించే వలస ఒప్పందంపై కూడా ఇరు దేశాలు ఒక ఉమ్మడి ప్రకటన చేశాయి.
అంతర్జాతీయ సవాళ్లపై ఇరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. పశ్చిమాసియా (Middle East) లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఇద్దరు ప్రధాన మంత్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై చూపిస్తున్న ప్రభావాన్ని ప్రస్తావిస్తూ.. కేవలం చర్చలు, దౌత్య నీతి (Dialogue and Diplomacy) ద్వారానే సమస్యలకు పరిష్కారం సాధ్యమని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ (Strait of Hormuz) గుండా అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛను పునరుద్ధరించాలని ఇరు దేశాలు డిమాండ్ చేశాయి. అలాగే ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా మిలిటరీ దూకుడును పరోక్షంగా ప్రస్తావిస్తూ, అక్కడ అంతర్జాతీయ నిబంధనల ప్రకారం నౌకాయాన స్వేచ్ఛ ఉండటం అత్యంత కీలకమని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని నొక్కిచెప్పారు. ఈ బంధం ఇప్పుడు తన పూర్తి సామర్థ్యాన్ని చాటుకునే స్థాయికి చేరిందని ఆమె కొనియాడారు.
భారత్-ఇటలీ జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ 2025-29 అమలును పర్యవేక్షించడానికి , ప్రత్యేక భాగస్వామ్యానికి వ్యూహాత్మక మార్గదర్శకత్వం అందించడానికి ఇరు దేశాల విదేశాంగ మంత్రుల నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకారం కుదిరింది. స్టార్టప్‌లు, పరిశోధనా కేంద్రాలను అనుసంధానించడానికి 'భారత్-ఇటలీ ఇన్నోవేషన్ సెంటర్'ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. గ్లోబల్ కనెక్టివిటీని మార్చే సామర్థ్యం ఉన్న 'ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్' (IMEC) ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ఇరు నేతలు కట్టుబడి ఉన్నామని చెప్పారు. దీనికోసం 2026 లోనే మొదటి ఐమెక్ (IMEC) మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించి కాంక్రీట్ అడుగులు వేయాలని నిర్ణయించారు. ఆఫ్రికా ఖండంలో మూడో దేశాల భాగస్వామ్యంతో ఉమ్మడి ప్రాజెక్టులు చేపట్టేందుకు కూడా అంగీకారం కుదిరింది.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇరు దేశాలు గట్టి నినాదం వినిపించాయి. మానవాళికి పెద్ద ముప్పుగా మారిన ఉగ్రవాదాన్ని, సరిహద్దు ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లోనూ తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC 1267) నిషేధిత జాబితాలోని ఉగ్రవాద సంస్థలపై ఉమ్మడి పోరాటం చేయాలని, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) మార్గదర్శకాల ప్రకారం ఉగ్రవాద ఆర్థిక నెట్‌వర్క్‌లను మరియు సురక్షిత స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే భారత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), ఇటలీకి చెందిన 'గార్డియా డి ఫైనాంజా' మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. బాధ్యతాయుతమైన ప్రజాస్వామ్య దేశాలు కేవలం ఉగ్రవాదాన్ని ఖండించడమే కాకుండా, దాని ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి గట్టి చర్యలు తీసుకుంటాయని భారత్, ఇటలీలు ప్రపంచానికి స్పష్టమైన సందేశాన్ని పంపాయి.




No comments:
Post a Comment