Monday, 18 May 2026

మోదీ ప్రభుత్వం చుట్టూ ముదురుతున్న సంక్షోభం


  • ఎన్నికల ఎదురుదెబ్బలు, దౌత్య వైఫల్యాలు, ఆర్థిక కష్టాలపై సంజయ్ కె. ఝా  విశ్లేషణ
  • ఇదే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రధాని ఉంటే బీజేపీ ఊరుకునేదా?


కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుత రాజకీయ, ఆర్థిక, దౌత్య పరిస్థితులపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సంజయ్ కె. ఝా అత్యంత ఘాటైన విమర్శలు గుప్పించారు. ఒకవేళ ఇదే స్థానంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రధానమంత్రి ఉండి.. ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 272 స్థానాల కంటే కిందకు పడిపోయి, అమెరికా ఒత్తిళ్లకు లొంగిపోయారనే ఆరోపణలు ఎదుర్కొంటూ, అంతర్జాతీయ విదేశాంగ విధానాన్ని దెబ్బతీసి, ఓట్ల దొంగతనం (ఓట్-చోరి) ఆరోపణల్లో చిక్కుకుని ఉంటే.. అలాగే దేశంలోని మెజారిటీ ప్రజలు నిరుద్యోగం, ధరల పెరుగుదలతో అల్లాడుతుంటే.. బీజేపీ సృష్టించే హంగామా , వారి దూకుడు ఏ స్థాయిలో ఉండేదో ఒక్కసారి ఊహించుకోవాలని ఆయన ప్రశ్నించారు.



ఇన్నాళ్లూ ప్రధాని మోదీ సృష్టించిన మాటల గారడీ, ప్రసంగాల హోరు దేశ ప్రజలను ఒక్కసారిగా భ్రమల లోకం నుండి తీవ్ర నిరాశ నిస్పృహల గురంలోకి నెట్టేసిందని సంజయ్ కె. ఝా విమర్శించారు. 'విశ్వగురు' ఫాంటసీలు, ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అనే గొప్పలు, అంతర్జాతీయంగా 'భారతదేశ డంకా మోగుతోంది' (డంకా-బజ్-రహా-హై) అంటూ కల్పించిన భ్రమల సామ్రాజ్యం ఒక్కసారిగా కుప్పకూలిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. నిన్నటివరకు ధగధగలాడే దుస్తుల్లో కనిపించిన ఒక అందమైన కల.. ఇప్పుడు ఒక్కసారిగా చిరిగిపోయిన అతుకుల ముక్కల భయంకర కలగా మారిపోయిందని ధ్వజమెత్తారు. దేశంలో చమురు నిల్వలను ఆదా చేసేందుకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, వంట నూనెల వినియోగాన్ని తగ్గించుకోవాలని, బంగారం కొనడం ఆపేయాలని స్వయంగా ప్రధానమంత్రే పౌరులను కోరడం దేశ ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోందని, ఆర్థిక నిపుణులు సైతం దేశం దీర్ఘకాలిక సంక్షోభం, ద్రవ్యోల్బణం (Stagflation) వైపు వెళ్తోందని హెచ్చరిస్తున్నారని పేర్కొన్నారు. పశ్చిమ ఆసియాలో యుద్ధం ఫిబ్రవరి 28 నుండే ప్రారంభమైనప్పటికీ.. రాత్రికి రాత్రే దేశంలో ఈ పరిస్థితులు ఎలా మారాయని ఆయన ప్రశ్నించారు.


ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో ప్రచారం చేస్తున్నప్పుడు ప్రధాని మోదీ ఎప్పుడూ ఇలాంటి ముంచుకొస్తున్న సంక్షోభం గురించి కనీస సంకేతాలు కూడా ఇవ్వలేదని, దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్తూ భారీ ఎత్తున నిధులు గుమ్మరిస్తూ రోడ్‌షోలు, గ్రాండ్ ర్యాలీలు నిర్వహించారని సంజయ్ కె. ఝా ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన (డెలిమిటేషన్) ను రహస్యంగా ముందుకు నెట్టేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను పిలిచారని, జాతిని ఉద్దేశించి ప్రసంగించే అత్యున్నత వేదికను సైతం తన రాజకీయ ప్రత్యర్థులను "మహిళా వ్యతిరేకులు" అని నిందించడానికే వాడుకున్నారని మండిపడ్డారు. దేశంలో కోట్లాది మంది ప్రజలు గ్యాస్ సిలిండర్ల కోసం అల్లాడుతున్న చేదు నిజాన్ని కూడా కేవలం భయాందోళనలు సృష్టించే ప్రయత్నంగానే కొట్టిపారేశారని విమర్శించారు. తన పార్టీకి ఎన్నికలలో నష్టం జరగకుండా చూసుకోవడం కోసమే ప్రధాని మోదీ ఈ బహుముఖ సంక్షోభాలను దేశం దాచిపెట్టారా అని ప్రశ్నించిన ఆయన.. దేశాన్ని ముంచెత్తుతున్న సవాళ్లపై జాతీయ స్పందనను ఆలస్యం చేయడం అసలైన 'దేశద్రోహ చర్య' (Anti-national act) కిందకు రాదా అంటూ నిలదీశారు.

No comments:

Post a Comment

Featured post

ఓస్లోలో భారత్ వర్సెస్ నార్వే మీడియా

పత్రికా స్వేచ్ఛపై ప్రశ్నించిన విదేశీ జర్నలిస్ట్‌కు భారత విదేశాంగ శాఖ గట్టి కౌంటర్ "అజ్ఞాన ఎన్జీవోల నివేదికలు చదివి మాట్లాడకండి" అం...