- రూ. 9,400 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
- హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ!
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నేడు (ఆదివారం) తెలుగు రాష్ట్రం తెలంగాణతో పాటు పొరుగున ఉన్న కర్ణాటకలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా హైదరాబాద్ వేదికగా సుమారు రూ. 9,400 కోట్ల విలువైన ప్రతిష్టాత్మక అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు బెంగళూరులోని 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' 45వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగించనున్న ప్రధాని, మధ్యాహ్నం 3 గంటల సమయంలో హైదరాబాద్ చేరుకుంటారు. ఇక్కడ రహదారులు, రైల్వేలు, టెక్స్‌టైల్స్, ఇంధన, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన కీలక ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. మరీ ముఖ్యంగా 1,500 పడకల సామర్థ్యంతో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన 'సింధు క్యాన్సర్ ఆసుపత్రి'ని ప్రధాని ప్రారంభించనుండటం ఆరోగ్య రంగంలో ఒక మైలురాయిగా నిలవనుంది.
తెలంగాణ అభివృద్ధికి సంబంధించి పలు కీలక ప్రాజెక్టులకు ప్రధాని మోడీ పునాది వేయనున్నారు. సుమారు రూ. 3,175 కోట్లతో గుడెబెల్లూర్ నుంచి మహబూబ్ నగర్ వరకు జాతీయ రహదారి-167 విస్తరణ పనులు, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో రూ. 2,350 కోట్లతో నిర్మించనున్న భారీ పారిశ్రామిక వాడ ఇందులో ప్రధానమైనవి. అలాగే వరంగల్‌లో దేశంలోనే తొలి పూర్తిస్థాయి 'పీఎం మిత్ర' మెగా టెక్స్‌టైల్ పార్కును ఆయన ప్రారంభించనున్నారు. రైల్వే రంగానికి సంబంధించి కాజీపేట-విజయవాడ సెక్షన్లలో మల్టీ ట్రాకింగ్ పనులు, మల్కాపూర్‌లో ఇండియన్ ఆయిల్ టెర్మినల్ ప్రాజెక్టులను ప్రధాని ప్రజలకు అంకితం చేయనున్నారు. పర్యటన ముగింపులో సాయంత్రం హైదరాబాద్‌లో నిర్వహించనున్న భారీ రాజకీయ బహిరంగ సభలో మోడీ ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనపై ప్రజలు విసిగిపోయారని, తెలంగాణ ప్రజల మొదటి ప్రాధాన్యం ఇప్పుడు బీజేపీయేనని ఆయన తన సోషల్ మీడియా వేదికగా ధీమా వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment