Thursday, 14 May 2026

బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు


  • బాధితురాలి వయస్సు నిర్ధారణకు హైకోర్టు ఆదేశం
  •  బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా


కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, బాధితురాలి వయస్సుపై స్పష్టత రావాల్సి ఉందని అభిప్రాయపడింది. బాధితురాలు మైనర్ కాదని, కాబట్టి ఈ కేసులో పోక్సో చట్టం వర్తించదని భగీరథ్ తరపు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదించగా.. బాధితురాలి వాదన వినకుండా, వయస్సును నిర్ధారించుకోకుండా బెయిల్ అప్లికేషన్‌పై నిర్ణయం తీసుకోలేమని జస్టిస్ మాధవీ దేవి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, బాధితురాలి వయస్సును శుక్రవారం లోపు ధృవీకరించాలని పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను నేటికి వాయిదా వేశారు.



ఈ కేసు నమోదు అయినప్పటి నుంచి తెలంగాణ పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు కేంద్ర మంత్రి కుమారుడు కావడంతోనే పోలీసులు వయస్సు నిర్ధారణ పరీక్షల విషయంలో జాప్యం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు, సోషల్ మీడియాలో ఈ కేసు చుట్టూ రాజకీయ రచ్చ మొదలైంది. బాధితురాలి కుటుంబ ఉద్దేశాలను ప్రశ్నిస్తూ కొన్ని వర్గాలు ప్రచారం సాగిస్తుండగా, ప్రతిపక్ష పార్టీ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. బండి సంజయ్ నివాసంలో ఎందుకు నోటీసులు ఇవ్వలేదని, కేవలం ఆయన బంధువులకు నోటీసులిచ్చి చేతులు దులుపుకున్నారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పోలీసుల నోటీసులకు స్పందించిన భగీరథ్, విచారణకు హాజరయ్యేందుకు రెండు రోజుల సమయం కోరగా పోలీసులు నిరాకరించారు. హైకోర్టు ఆదేశాలు వెలువడే వరకు అరెస్ట్ చర్యలు చేపట్టే అవకాశం లేకపోయినప్పటికీ, ఈ వయస్సు నిర్ధారణ పరీక్ష ఫలితం ఈ కేసులో అత్యంత కీలకం కానుంది.

No comments:

Post a Comment

Featured post

యూపీ సమరం 2027

బిహార్, బెంగాల్ విజయాలతో బీజేపీలో నూతన ఉత్సాహం అఖిలేష్ ‘పీడీఏ’ వ్యూహానికి యోగి సర్కార్ పదునైన కౌంటర్! బిహార్, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక...