Thursday, 21 May 2026

దక్షిణ కొరియాలో 'ఇండియన్ వార్ మెమోరియల్' ప్రారంభం


  • కొరియా యుద్ధ వీరులకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఘన నివాళి
  • భారత ఆర్మీ 'మెరూన్ ఏంజిల్స్' మానవతా సేవలకు అంతర్జాతీయ గౌరవం!



కొరియా యుద్ధం ముగిసి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఆనాటి యుద్ధంలో శాంతి స్థాపనకు, గాయపడిన వారికి వైద్య సేవలు అందించడంలో భారత సైన్యం చేసిన అసమాన త్యాగాలను స్మరిస్తూ దక్షిణ కొరియాలోని సియోల్ (ఇమ్జింగాక్ పార్క్) లో సరికొత్త 'ఇండియన్ వార్ మెమోరియల్' (భారత యుద్ధ స్మారకం) గురువారం నాడు ఘనంగా ప్రారంభమైంది. నాలుగు రోజుల వియత్నాం, దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కొరియా దేశభక్తులు-రక్షణ వ్యవహారాల మంత్రి క్వాన్ ఓ-ఇయుల్‌తో కలిసి ఈ స్మారక చిహ్నాన్ని సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మంత్రులు స్మారకం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి, వీరమరణం పొందిన సైనికులకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.



ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఈ యుద్ధ స్మారకం కేవలం రాళ్లతో కట్టిన కట్టడం కాదని, ఇది ధైర్యసాహసాలు, కరుణ, త్యాగాలకు నిలువెత్తు రూపమని కొనియాడారు. ఏడు దశాబ్దాల క్రితం కొరియా ద్వీపకల్పం యుద్ధ జ్వాలల్లో చిక్కుకున్నప్పుడు, భారతదేశం మానవత్వం పట్ల తన బాధ్యతను అత్యున్నత రీతిలో నెరవేర్చిందని గుర్తుచేశారు. భారత సైన్యానికి చెందిన '60 పారా ఫీల్డ్ అంబులెన్స్' (60 Para Field Ambulance) విభాగం క్రాస్‌ఫైర్ జరుగుతున్న కఠిన పరిస్థితుల్లోనూ ప్రాణాలకు తెగించి వేలాది మంది సైనికులకు, పౌరులకు వైద్య సేవలు అందించిందని ప్రశంసించారు. లెఫ్టినెంట్ కల్నల్ (డాక్టర్) ఎ.జి. రంగరాజ్ (మహావీర చక్ర) నాయకత్వంలో పనిచేసిన ఈ సాహస వైద్య బృందాన్ని, అక్కడి ప్రజలు , సైనికులు ప్రేమతో 'మెరూన్ ఏంజిల్స్' (Maroon Angels) అని పిలుచుకునేవారని రాజ్‌నాథ్ సింగ్ గుర్తుచేశారు. ఈ సందర్భంగా మే 2026 నెలకు గాను కల్నల్ రంగరాజ్‌కు ప్రకటించిన 'కొరియా యుద్ధ వీరుడు' (Korean War Hero) ధృవీకరణ పత్రాన్ని ఆయన మేనకోడలు కల్పనా ప్రసాద్‌కు కొరియా ప్రభుత్వం అందజేసింది.



యుద్ధం ముగిసిన తర్వాత కూడా శాంతి స్థాపనలో భాగంగా 'కస్టోడియన్ ఫోర్స్ ఆఫ్ ఇండియా' (CFI) నేతృత్వంలో సుమారు 22,000 మంది యుద్ధ ఖైదీలను శాంతియుతంగా తమ స్వదేశాలకు పంపించడంలో భారత్ పోషించిన నిష్పాక్షికమైన, మానవతా పాత్రను దక్షిణ కొరియా మంత్రి క్వాన్ ఓ-ఇయుల్ కొనియాడారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య కొరియా యుద్ధ వీరులను గౌరవించడం , పరస్పర బంధాలను బలోపేతం చేయడంపై ఒక అవగాహనా ఒప్పందం (MoU) కుదిరింది. అంతకుముందు రోజు మే 20న కొరియా రక్షణ మంత్రి అన్ గ్యు-బాక్‌తో రాజ్‌నాథ్ సింగ్ జరిపిన ద్వైపాక్షిక చర్చలలో రక్షణ రంగ భాగస్వామ్యం, సైబర్ భద్రత, కృత్రిమ మేధస్సు (AI) , ఇండో-పసిఫిక్ ప్రాంతీయ భద్రత వంటి కీలక అంశాలపై ఒప్పందాలు జరిగాయి. పూర్వీకులు చిందించిన రక్తం, చేసిన త్యాగాల పునాదులపైనే నేడు భారత్-దక్షిణ కొరియాల మధ్య 'ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం' అత్యంత బలంగా నిర్మితమైందని రక్షణ మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.





No comments:

Post a Comment

Featured post

అమెరికా శత్రువుల ఆట కట్టించిన ప్రెసిడెంట్ ట్రంప్

   వైట్ హౌస్ సంచలన ప్రకటన..  ఖమేనీ, మదురో, కాస్ట్రోలను టార్గెట్ చేస్తూ 'న్యాయం జరిగి తీరుతుంది' అని హెచ్చరిక! అమెరికా , ఇరాన్ మధ్య ద...