Friday, 15 May 2026

బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ వీడిందా?


  •  ఆ ద్వీపం కింద దాగివున్న వింత రాతి నిర్మాణాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు
  • శతాబ్దాల నాటి భూగర్భ రహస్యం బట్టబయలు



అట్లాంటిక్ మహాసముద్రంలో దశాబ్దాలుగా భూగర్భ శాస్త్రవేత్తలను వేధిస్తోన్న అతిపెద్ద పజిల్స్‌లో ఒకదానికి ఎట్టకేలకు అమెరికా శాస్త్రవేత్తలు సమాధానం కనుగొన్నారు. బెర్ముడా ద్వీపకల్పంలో అగ్నిపర్వతాలు పేలడం ఆగిపోయి దాదాపు 3 కోట్ల సంవత్సరాలు గడుస్తున్నా.. ఆ ప్రాంతం చుట్టుపక్కల ఉన్న సముద్ర గర్భం కంటే సుమారు 1,600 అడుగుల ఎత్తులో (పైకి ఉబ్బినట్లు) ఎలా స్థిరంగా నిలిచి ఉందనేది ఇప్పటివరకు ఎవరికీ అర్థం కాలేదు. అయితే, కార్నెగీ సైన్స్‌కు చెందిన సీస్మోలజిస్ట్ విలియం ఫ్రేజర్ , యేల్ యూనివర్సిటీకి చెందిన జెఫ్రీ పార్క్ నేతృత్వంలోని పరిశోధక బృందం, ఆ ద్వీపానికి అత్యంత లోతులో దాగివున్న ఒక వింతైన భూగర్భ రాతి నిర్మాణమే ఇందుకు కారణమని సరికొత్త పరిశోధన ద్వారా వెల్లడించింది. భూమిపై మరెక్కడా లేని విధంగా అత్యంత అరుదైన రీతిలో ఈ నిర్మాణం ఉందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.


సాధారణంగా హవాయి వంటి అగ్నిపర్వత ద్వీపాలు భూమి లోపలి పొరల (మ్యాంటిల్) నుంచి పైకి తన్నుకొచ్చే వేడి బండరాళ్ల ప్రవాహం (మ్యాంటిల్ ప్లూమ్) వల్ల ఏర్పడతాయి. ఈ వేడి పదార్థం పైకి నెట్టడం వల్ల సముద్ర గర్భం పైకి ఉబ్బుతుంది. కాలక్రమేణా టెక్టోనిక్ ప్లేట్లు కదలడం, అగ్నిపర్వతాల తీవ్రత తగ్గడంతో ఆ ఉబ్బిన భాగాలు మళ్లీ సముద్రగర్భంలోకి కుంగిపోతాయి. కానీ, బెర్ముడా విషయంలో అలా జరగలేదు. ఈ రహస్యాన్ని ఛేదించేందుకు ఫ్రేజర్, పార్క్‌లు ప్రపంచవ్యాప్తంగా సంభవించిన పెద్ద భూకంపాల తాలూకు భూకంప తరంగాలను (సీస్మిక్ వేవ్స్) ఉపయోగించుకున్నారు. ఈ తరంగాలు భూమి లోపల ప్రయాణించేటప్పుడు అక్కడ ఉండే రాళ్ల సాంద్రతను బట్టి వాటి వేగం మారుతుంది. బెర్ముడాలోని సీస్మిక్ స్టేషన్ నుంచి సేకరించిన డేటాను విశ్లేషించడం ద్వారా, ద్వీపానికి 20 మైళ్ల లోతు వరకు ఉన్న భూగర్భ పొరల చిత్రాన్ని శాస్త్రవేత్తలు సృష్టించారు.


ఈ పరిశోధనలో సైంటిస్టులకు ఊహించని నిజం ఒకటి వెలుగుచూసింది. సముద్రపు పైపొర (క్రస్ట్) కింద దాదాపు 12 మైళ్లకు పైగా మందం కలిగిన ఒక భారీ రాతి పొర ఉన్నట్లు వారు గుర్తించారు. ఈ రాయి చుట్టుపక్కల ఉండే మ్యాంటిల్ పొర కంటే చాలా తక్కువ సాంద్రత కలిగి ఉండటంతో పాటు విపరీతమైన ప్లవన శక్తి ని కలిగి ఉంది. అంటే, కింద నుంచి ఏదో వేడి ద్రవం బేర్ముడాను పైకి నెట్టడం లేదు, దానికి బదులుగా ఈ తేలికపాటి రాతి పొర ఒక 'లైఫ్ జాకెట్' లేదా 'పడవ' (రాఫ్ట్) లాగా పనిచేస్తూ బేర్ముడా ద్వీపాన్ని, ఆ సముద్ర గర్భాన్ని కిందికి కుంగిపోకుండా పైనే తేలేలా ఉంచుతోందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కోట్ల సంవత్సరాల కిందట బెర్ముడాలో అగ్నిపర్వతాలు యాక్టివ్‌గా ఉన్నప్పుడు, కార్బన్ ఎక్కువగా ఉన్న ద్రవరూప శిలలు భూమి పైపొరల్లోకి చొచ్చుకువచ్చి అక్కడే చల్లబడి గడ్డకట్టడం వల్ల ఈ 'అండర్‌ప్లేటింగ్' అనే రాతి పొర ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు. ఈ పదార్థం వందల కోట్ల సంవత్సరాల కిందట, భూమిపై 'పాంజియా' అనే ఒకే ఒక్క మహాఖండం ఉన్న కాలంలో భూమి లోతుల్లో రూపాంతరం చెంది ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.


ఈ పరిశోధన ప్రాధాన్యాన్ని వివరిస్తూ విలియం ఫ్రేజర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బెర్ముడాలోని భౌగోళిక లక్షణాలు భూగర్భ శాస్త్రంలోని సాంప్రదాయ 'మ్యాంటిల్ ప్లూమ్' సిద్ధాంతానికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయని, ఇంత దట్టమైన అండర్‌ప్లేటింగ్ రాతి పొరను తాము మరెక్కడా చూడలేదని ఆయన చెప్పారు. భూమి లోపలి పొరల్లో శాస్త్రవేత్తలకు ఇంకా అర్థంకాని ఎన్నో సరికొత్త ప్రక్రియలు జరుగుతున్నాయనడానికి ఇదొక నిదర్శనమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ద్వీపాల కింద కూడా ఇలాంటి నిర్మాణాలు ఏవైనా ఉన్నాయా, లేక బెర్ముడా ప్రపంచంలోనే ఏకైక వింతైన ద్వీపమా అనే కోణంలో తాము మరిన్ని పరిశోధనలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 


నోట్‌: ఈ సంచలన పరిశోధనకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రముఖ అంతర్జాతీయ సైన్స్ జర్నల్ 'జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్' లో ప్రచురితమయ్యాయి.

No comments:

Post a Comment

Featured post

డొనాల్డ్ ట్రంప్, షీ జిన్‌పింగ్ ద్వైపాక్షిక చర్చల్లో మగవారే మహారాజులు

  అమెరికా-చైనా సదస్సు ఫోటోలపై ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసన 'మెరిటోక్రసీకి చరమగీతం' అంటూ గీతా గోపీనాథ్ సంచలన వ్యాఖ్యలు బీజింగ...