- నిఘా వర్గాల చేతికి ఫ్లోరిడా నివాస నమూనా
- అమెరికాలో ఐఆర్‌జీసీ ఉగ్రవాది అరెస్ట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) తో సంబంధాలున్న ఒక ఉగ్రవాది పన్నిన భయంకరమైన హత్య కుట్రను అమెరికా నిఘా వర్గాలు భగ్గుం చేశాయి. గత 2020లో డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ సైనిక కమాండర్ ఖాసిం సులేమాని మరణించిన సంగతి తెలిసిందే. ఆ మరణానికి ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగానే ఇవాంకా ట్రంప్‌ను హతమార్చేందుకు ఈ కుట్ర పన్నినట్లు అమెరికన్ దర్యాప్తు సంస్థల నివేదికలు వెల్లడించాయి. దీనికి ఒడిగట్టిన మొహమ్మద్ బాకర్ సాద్ దావూద్ అల్-సాది అనే 32 ఏళ్ల ఇరాకీ జాతీయుడిని మే 15న టర్కీలో అరెస్ట్ చేసి, అమెరికాకు అప్పగించారు.
అల్-సాది కేవలం ప్రతీకార నినాదాలకే పరిమితం కాకుండా, అత్యంత పక్కా ప్రణాళికతో వ్యవహరించినట్లు విచారణలో తేలింది. ఫ్లోరిడాలో ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జారెడ్ కుష్నర్‌లకు ఉన్న 24 మిలియన్ డాలర్ల విలాసవంతమైన నివాసానికి సంబంధించిన బ్లూప్రింట్ (భవన నమూనా మ్యాప్) నిందితుడి వద్ద లభ్యమవడం అమెరికా భద్రతా వర్గాలను ఉలిక్కిపడేలా చేసింది. అంతేకాకుండా, సామాజిక మాధ్యమాల్లో సదరు నివాస ప్రాంతం మ్యాప్‌ను పోస్ట్ చేస్తూ.. అమెరికన్ల ప్యాలెస్‌లు గానీ, అక్కడి సీక్రెట్ సర్వీస్ భద్రత గానీ వారిని రక్షించలేవని, ప్రతీకారం తీర్చుకోవడం కేవలం కాలానికి సంబంధించిన విషయమేనంటూ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశాడు. అమెరికా రక్షణ శాఖ నివేదికల ప్రకారం.. ఈ అల్-సాది కేవలం ఇవాంకా హత్యకే పరిమితం కాలేదు. ఇరాన్ మద్దతుగల ఉగ్రవాద సంస్థ 'హెజ్‌బొల్లా'లో కీలక సభ్యుడైన ఇతడు.. కొన్నినెలలుగా యూరప్ , నార్త్ అమెరికా అంతటా అమెరికన్, యూదు లక్ష్యాలపై జరిగిన దాదాపు 18 ఉగ్రవాద దాడులు, బాంబు పేలుళ్లు, కాల్పుల వెనుక ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. నకిలీ సర్వీస్ పాస్‌పోర్టులు, ట్రావెల్ ఏజెన్సీల ముసుగులో తిరుగుతూ ఉగ్రవాద నెట్‌వర్క్‌ను నడిపిన ఇతడిని ప్రస్తుతం బ్రూక్లిన్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో ఒంటరి జైలు గదిలో ఉంచి విచారిస్తున్నారు.
No comments:
Post a Comment