Sunday, 10 May 2026

తెలంగాణలో మొదలైన మార్పు గాలి


  • రాబోయేది బీజేపీ ప్రభుత్వమే
  • హైదరాబాద్ వేదికగా ప్రధాని మోడీ ధీమా!



తెలంగాణ గడ్డపై భారతీయ జనతా పార్టీ తన రాజకీయ పట్టును పెంచుకునే దిశగా మరో భారీ ముందడుగు వేసింది. హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ, తెలంగాణ ప్రజలు ఇప్పుడు బీజేపీ అభివృద్ధి నమూనా వైపు చూస్తున్నారని స్పష్టం చేశారు. తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించిన ప్రధాని, ఇక్కడ కనిపిస్తున్న అపారమైన జనవాహినిని చూస్తుంటే రాష్ట్రంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని అభివర్ణించారు. అస్సాం, బెంగాల్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో కుటుంబ పాలనను తిరస్కరించి ప్రజలు ఏ విధంగా బీజేపీకి పట్టం కట్టారో, అదే చరిత్ర తెలంగాణలోనూ పునరావృతం కాబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు అవినీతి, వారసత్వ రాజకీయాలు , నియంతృత్వ ధోరణులతో దేశాభివృద్ధిని అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు.


తెలంగాణ భవిష్యత్తును మార్చడమే తమ లక్ష్యమని పేర్కొన్న ప్రధాని, ఈ పర్యటనలో రాష్ట్రానికి సుమారు రూ. 9,400 కోట్ల విలువైన అభివృద్ధి ఫలాలను అందించారు. జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతం , వరంగల్‌లో పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు ద్వారా వేలాది మందికి ఉపాధి లభించడమే కాకుండా, పత్తి రైతులకు మేలు జరుగుతుందని ఆయన వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ ప్రత్యామ్నాయాలతో విసిగిపోయిన ప్రజలు, పారదర్శకమైన , సుపరిపాలన అందించే బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. కేవలం రాజకీయాలే కాకుండా దేశ ఆర్థిక స్వావలంబన గురించి కూడా మాట్లాడిన మోడీ, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.


దేశాన్ని 2047 నాటికి 'వికసిత భారత్'గా మార్చే లక్ష్యంలో భాగంగా.. ప్రజలు ఇంధన వినియోగాన్ని తగ్గించాలని, కార్‌పూలింగ్ , ప్రజా రవాణా వ్యవస్థలను ఉపయోగించాలని ప్రధాని కోరారు. విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ , అనవసరపు ఖర్చులను తగ్గించుకుని, స్వదేశీ వస్తువులకే ప్రాధాన్యం ఇవ్వాలని (ఓకల్ ఫర్ లోకల్) ఆయన విజ్ఞప్తి చేశారు. సేంద్రీయ వ్యవసాయం , స్వయం సమృద్ధి ద్వారానే భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఆయన ఆకాంక్షించారు. ఈ సభలో కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావుతో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొని, తెలంగాణలో బీజేపీ విజయానికి కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment

Featured post

హైదరాబాద్‌లో స్నేహపూర్వక భేటీ

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లిన ప్రధాని మోడీ! తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన ప్రధాని నరేంద్...