- సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- ఒకసారి ఆర్థిక, సామాజిక వృద్ధి సాధించాక కూడా ప్రయోజనాలు కోరడంపై ధర్మాసనం ప్రశ్నల వర్షం!
రిజర్వేషన్ల ఫలాలను అందుకొని విద్యాపరంగా, ఆర్థికంగా ఉన్నత స్థానాలకు చేరుకున్న కుటుంబాల పిల్లలకు.. ఇంకా ఓబీసీ (OBC) రిజర్వేషన్ ప్రయోజనాలను వర్తింపజేయడం ఎంతవరకు సమంజసమని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గురువారం గట్టిగా ప్రశ్నించింది. విద్యా ఉపాధి అవకాశాల ద్వారా ఒకసారి సమాజంలో ఉన్నత హోదా (సోషల్ మొబిలిటీ) లభించిన తర్వాత కూడా, వారి తదుపరి తరాలు రిజర్వేషన్ల కోసం పట్టుబడితే ఈ వ్యవస్థ నుండి దేశం ఎప్పటికీ బయటపడలేదని ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కర్ణాటకకు చెందిన ఒక సివిల్ వివాదంలో విచారణ జరుపుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రులు ఉన్నత చదువులు చదువుకొని, మంచి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటూ, భారీగా జీతాలు పొందుతున్నప్పుడు.. వారి పిల్లలు కూడా రిజర్వేషన్లు ఆశించడంపై న్యాయమూర్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక స్థాయికి చేరుకున్న వారు రిజర్వేషన్ల పరిధి నుంచి స్వచ్ఛందంగానైనా బయటకు రావాల్సిన అవసరం ఉందని జస్టిస్ నాగరత్న అభిప్రాయపడ్డారు.
కర్ణాటకలో వెనుకబడిన తరగతుల కేటగిరీ 2(ఎ) కిందికి వచ్చే 'కురుబ' సామాజిక వర్గానికి చెందిన ఒక అభ్యర్థి.. కర్ణాటక పవర్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) ఉద్యోగానికి రిజర్వేషన్ కోటాలో ఎంపికయ్యారు. అయితే, ఆ అభ్యర్థి తల్లిదండ్రులు ఇద్దరూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కావడం, వారి సంయుక్త వార్షిక ఆదాయం సుమారు 19.48 లక్షల రూపాయలుగా ఉండటంతో.. వారు 'క్రీమీ లేయర్' (సంపన్న శ్రేణి) పరిధిలోకి వస్తారంటూ జిల్లా కుల , ఆదాయ ధృవీకరణ కమిటీ అతడికి కుల ధృవీకరణ పత్రాన్ని నిరాకరించింది. దీనిని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన కర్ణాటక హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం అభ్యర్థికి అనుకూలంగా తీర్పునిచ్చినప్పటికీ, ఆ తర్వాత డివిజన్ బెంచ్ ఆ తీర్పును తిరగరాసింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్రీమీ లేయర్ గుర్తింపులో జీతాన్ని మినహాయించినప్పటికీ, కర్ణాటక రాష్ట్ర పరిధిలోని రిజర్వేషన్లకు ఆ మినహాయింపు వర్తించదని, కుటుంబ ఆదాయం నిర్ణీత పరిమితిని దాటినందున సదరు అభ్యర్థి క్రీమీ లేయర్ కిందికే వస్తారని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సదరు అభ్యర్థి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సుప్రీంకోర్టులో అభ్యర్థి తరఫున న్యాయవాది శశాంక్ రత్నూ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగులలో క్రీమీ లేయర్‌ను నిర్ణయించడానికి కేవలం జీతం ప్రాతిపదిక కాదని, తల్లిదండ్రులు గ్రూప్-ఎ లేదా గ్రూప్-బి హోదాల్లో ఉన్నారా లేదా అనే అంశమే ముఖ్యమని పేర్కొన్నారు. కేవలం జీతాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటే డ్రైవర్లు, క్లర్కులు, ప్యూన్ల పిల్లలు కూడా రిజర్వేషన్లు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. పిటిషనర్ తండ్రి ప్రాథమిక వేతనం నెలకు 53,900 రూపాయలు, తల్లి వేతనం 52,650 రూపాయలు అయినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వ స్పష్టీకరణ ప్రకారం ఈ అలవెన్సులను ఆదాయంలో భాగంగా పరిగణించకూడదని ఆయన వాదించారు. అన్నిరకాల ఆదాయాలను లెక్కిస్తే ఓబీసీ రిజర్వేషన్లకు, ఈడబ్ల్యూఎస్ (EWS) రిజర్వేషన్లకు మధ్య తేడా లేకుండాపోతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు అవసరమే అయినప్పటికీ.. ఒకసారి రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొంది తల్లిదండ్రులు ఇద్దరూ ఐఏఎస్ అధికారులుగా లేదా ఉన్నత ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడినప్పుడు, సమాజంలో వారి హోదా మారినందున ఆ మినహాయింపుల నిరాకరణను ప్రశ్నించడం సరికాదని జస్టిస్ నాగరత్న స్పష్టం చేశారు. ఈ అంశంలో వివిధ న్యాయపరమైన విభిన్న కోణాలు ఉన్నందున దీనిపై లోతైన పరిశీలన అవసరమని పేర్కొంటూ తదుపరి విచారణను వాయిదా వేశారు.
No comments:
Post a Comment