- మిత్రధర్మాన్ని కాలరాశారంటూ తీవ్ర ఆగ్రహం
- కాంగ్రెస్‌పై డీఎంకే నిప్పులు
తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న డీఎంకే-కాంగ్రెస్ మైత్రికి బీటలు వారాయి. రాష్ట్రంలో డీఎంకే-ఏఐఏడీఎంకేల ద్వంద్వాధిపత్యానికి తెరదించి, భారీ విజయంతో దూసుకొచ్చిన నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కళగం (TVK)కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై డీఎంకే తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. డీఎంకేతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి ఐదు స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్, ఇప్పుడు అధికారం కోసం మరో గూటికి చేరడం ఓటర్లను వంచించడమేనని డీఎంకే కోశాధికారి టీఆర్ బాలు ధ్వజమెత్తారు. కష్టకాలంలో కాంగ్రెస్‌కు అండగా నిలిచినందుకు తమకు దక్కిన ప్రతిఫలం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. సిద్ధాంతాల ముసుగులో కాంగ్రెస్ చేస్తున్న ఈ 'అవకాశవాద రాజకీయాలను' ప్రజలు గమనిస్తున్నారని, వెనుకవాకిలి ద్వారా అధికారం చేపట్టాలని చూస్తున్న బీజేపీ పద్ధతులనే కాంగ్రెస్ కూడా అనుసరిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.
మరోవైపు, 234 స్థానాలు ఉన్న అసెంబ్లీలో 108 సీట్లు సాధించిన విజయ్ పార్టీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మార్కును చేరుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు లభించడంతో టీవీకే బలం 113కు చేరింది. మ్యాజిక్ ఫిగర్‌కు మరో ఐదు స్థానాల దూరంలో ఉన్న విజయ్, ప్రస్తుతం వీసీకే (2 సీట్లు) , లెఫ్ట్ పార్టీల (4 సీట్లు) మద్దతు కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయం డీఎంకే నేతృత్వంలోని కూటమి విచ్ఛిన్నానికి దారితీయడమే కాకుండా, దక్షిణాదిలో 'ఇండియా' కూటమి భవిష్యత్తును కూడా ప్రశ్నార్థకం చేసింది. ఓటమి తమకు కొత్త కాదని, నమ్మకద్రోహాలు అంతకంటే కొత్త కాదని వ్యాఖ్యానించిన డీఎంకే, కాలమే దీనికి సమాధానం చెబుతుందని స్పష్టం చేసింది.
No comments:
Post a Comment