- బాలీవుడ్ 'ధక్ ధక్ గర్ల్' మాధురీ దీక్షిత్ బర్త్‌డే స్పెషల్
- వెండితెరపై ఎప్పటికీ నిలిచిపోయే ఐకానిక్ నృత్యాల అద్భుత ప్రయాణం!
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తన అమోఘమైన నటనతో, అంతకంటే మిన్నయిన నృత్య ప్రతిభతో దశాబ్దాలుగా కోట్ల మంది గుండెల్లో 'ధక్ ధక్ గర్ల్'గా నిలిచిపోయిన బాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ మాధురీ దీక్షిత్ శుక్రవారం తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. నటిగా ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించినప్పటికీ, ఒక కథక్ నృత్యకారిణిగా ఆమె పండించిన హావభావాలు, లయబద్ధమైన అడుగులు భారతీయ సినిమా చరిత్రలోనే ప్రత్యేక ముద్ర వేశాయి. మాధురి పుట్టినరోజు సందర్భంగా ఆమె సినీ కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచిన, ప్రేక్షకులను ఇప్పటికీ ఉర్రూతలూగించే టైమ్‌లెస్ నృత్య ప్రదర్శనలపై ఒక ప్రత్యేక కథనం.
ఆమె నృత్య ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటే అందరికీ మొదటగా గుర్తొచ్చే పాట 'తేజాబ్' సినిమాలోని "ఏక్ దో తీన్". ఈ ఒక్క పాటతో మాధురి రాత్రికి రాత్రే దేశవ్యాప్త సంచలనంగా మారారు. సరోజ్ ఖాన్ కొరియోగ్రఫీలో ఆమె చేసిన డ్యాన్స్ స్టెప్పులు అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. ఆ తర్వాత 'బేటా' చిత్రంలో ఆమె ప్రదర్శించిన నృత్యం, హావభావాలు ఆమెకు 'ధక్ ధక్ గర్ల్' అనే శాశ్వత గుర్తింపును తెచ్చిపెట్టాయి. అలాగే 'ఖల్ నాయక్' చిత్రంలోని "చోలీ కే పీచే క్యా హై" పాటలో మాధురి చూపించిన అభినయం, ఎనర్జీ వెండితెరపై ఒక మాయాజాలాన్నే సృష్టించాయి.
కేవలం కమర్షియల్ హంగులే కాకుండా, క్లాసికల్ నృత్యంలోనూ తనకు సాటిలెవరూ లేరని మాధురి నిరూపించుకున్నారు. ముఖ్యంగా సంజయ్ లీలా భన్సాలీ దృశ్యకావ్యం 'దేవదాస్' చిత్రంలో ఐశ్వర్య రాయ్‌తో కలిసి ఆమె చేసిన "డోలా రే డోలా" , పండిట్ బిర్జు మహారాజ్ కొరియోగ్రఫీ చేసిన "కాహే ఛేడే మోహే" పాటలు భారతీయ క్లాసికల్ డ్యాన్స్‌కు నిలువెత్తు నిదర్శనాలుగా నిలిచాయి. ఆ తర్వాత సినిమాలకు కొంతకాలం విరామం ఇచ్చి తిరిగి రీ-ఎంట్రీ ఇచ్చిన 'ఆజా నాచ్లే' టైటిల్ సాంగ్‌లో కూడా ఆమె అదే పాత వేగాన్ని, హుందాతనాన్ని ప్రదర్శించి అభిమానులను ఫిదా చేశారు. కాలం మారుతున్నా, కొత్త తరం నటీమణులు వస్తున్నా.. మాధురీ దీక్షిత్ నృత్యానికి ఉండే గ్రేస్, ఆకర్షణ ఎప్పటికీ అజరామరమేనని ఈ ఐకానిక్ సాంగ్స్ నిరూపిస్తూనే ఉంటాయి.
No comments:
Post a Comment