- ఇకపై స్వదేశానికి వెళ్లి అప్లై చేసుకోవడం తప్పనిసరి
- ఆందోళనలో లక్షలాదిమంది భారతీయ టెక్కీలు, విద్యార్థులు
వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత నివాసం (గ్రీన్ కార్డ్) సాధించాలనే కలలతో అక్కడ నివసిస్తున్న లక్షలాదిమంది వలసదారులకు, ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులు, విద్యార్థులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కోలుకోలేని పెద్ద షాక్ ఇచ్చింది. అమెరికాలో ఉంటూనే గ్రీన్ కార్డ్ పొందేందుకు ఇన్నాళ్లూ ఉన్న 'అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్' విధానానికి స్వస్తి పలుకుతూ.. అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ(యూఎస్‌సీఐఎస్) శుక్రవారం అత్యంత కఠినమైన నూతన వలస విధానాన్ని ప్రకటించింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అత్యధిక శాతం మంది వలసదారులు మొదట అమెరికాను విడిచిపెట్టి, తమ స్వదేశాలకు వెళ్లి అక్కడ ఉన్న యూఎస్ ఎంబసీ లేదా కాన్సులేట్ ద్వారా మాత్రమే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. అత్యంత అసాధారణమైన మినహాయింపు పరిస్థితుల్లో తప్ప, మిగిలిన అందరికీ ఈ నిబంధన వర్తిస్తుందని ట్రంప్ యంత్రాంగం స్పష్టం చేసింది.
ఇప్పటివరకు అమెరికాలో స్టూడెంట్ వీసాలు, టూరిస్ట్ వీసాలు లేదా తాత్కాలిక వర్క్ వీసాలపై (హెచ్-1బీ వంటివి) నివసిస్తున్న విదేశీయులు దేశం విడిచి వెళ్లకుండానే గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే వీలుండేది. అయితే, కొత్త విధానంలో 'అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్'ను ఒక అత్యంత అరుదైన మినహాయింపుగా మార్చేశారు. చట్టం అసలు ఉద్దేశాన్ని పునరుద్ధరించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని, తాత్కాలికంగా అమెరికాకు వచ్చేవారు తమ గడువు ముగిశాక స్వదేశానికి తిరిగి వెళ్లాలనేదే నిబంధన అని, వారి పర్యటన గ్రీన్ కార్డ్ పొందేందుకు మొదటి అడుగు కాకూడదని యూఎస్‌సీఐఎస్ స్పష్టం చేసింది. గ్రీన్ కార్డ్ దరఖాస్తు తిరస్కరణకు గురైన తర్వాత అమెరికాలోనే అక్రమంగా ఉండిపోయే ధోరణిని అడ్డుకునేందుకే ఈ కఠిన చర్యలని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రకటించింది. అయితే, ఇప్పటికే అమెరికాలో ఉంటూ అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ కోసం దరఖాస్తు చేసుకుని పీరియడ్‌లో ఉన్న సుమారు 10 లక్షల మంది వలసదారులపై దీని ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. కాకపోతే, అమెరికా ఆర్థిక రంగానికి లేదా జాతీయ ప్రయోజనాలకు ఉపయోగపడే కొన్ని ప్రత్యేక రంగాల అభ్యర్థులకు పాత పద్ధతిలోనే అనుమతించే అవకాశం ఉందని సమాచారం.
ఈ చట్ట సవరణల వల్ల అమెరికాలో రెండో అతిపెద్ద వలస సమాజంగా ఉన్న భారతీయులపై తీవ్రమైన ప్రభావం పడనుంది. తాజా గణాంకాల ప్రకారం అమెరికాలో సుమారు 32 లక్షల మంది భారతీయ వలసదారులు నివసిస్తున్నారు. ముఖ్యంగా ఉన్నత నైపుణ్యాలు కలిగిన ఐటీ ఉద్యోగులకు ఇచ్చే హెచ్-1బీ వీసాలలో 71 శాతానికి పైగా భారతీయులే పొందుతున్నారు. అంతేకాకుండా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ కోర్సుల్లో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో కూడా భారతీయులదే సింహభాగం. ప్రస్తుత ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 40 దేశాల పౌరులపై రకరకాల ఆంక్షలు విధించగా, ఈ కొత్త నిబంధన వల్ల గ్రీన్ కార్డ్ ప్రక్రియ కోసం భారతీయులు స్వదేశానికి రావలసి వస్తే, తిరిగి వారు అమెరికా వెళ్లడంపై దౌత్యపరమైన చిక్కులు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాన్సులర్ ప్రాసెస్ కోసం స్వదేశానికి వెళ్లడం అంటే, పరోక్షంగా గ్రీన్ కార్డ్ మార్గాన్ని మూసివేయడమేనని మాజీ వలస నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా చరిత్రలోనే మొదటిసారిగా 2025 తర్వాత వలసదారుల సంఖ్య భారీగా తగ్గడం ప్రారంభమైన తరుణంలో, ఈ తాజా నిర్ణయం భారతీయ ఐటీ రంగానికి మరియు విద్యార్థుల భవిష్యత్తుకు పెద్ద సవాలుగా మారనుంది.
No comments:
Post a Comment