- 2020-2023 మధ్య ప్రపంచవ్యాప్తంగా 2.2 కోట్లకు పైగా 'అదనపు మరణాలు'
- డబ్ల్యూహెచ్ వో నివేదికలో షాకింగ్ నిజాలు!
ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన అసలైన మారణహోమంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అత్యంత దిగ్భ్రాంతికరమైన నివేదికను విడుదల చేసింది. కేవలం అధికారికంగా నమోదైన కరోనా మరణాలే కాకుండా, ఈ మహమ్మారి వల్ల పరోక్షంగా సంభవించిన నష్టాన్ని లెక్కిస్తూ డబ్ల్యూహెచ్ వో కీలక అంచనాలను వెల్లడించింది. దీని ప్రకారం.. 2020 జనవరి నుంచి 2023 డిసెంబర్ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 22.1 మిలియన్ల (2.21 కోట్లు) 'అదనపు మరణాలు' (Excess Deaths) సంభవించాయని ఈ నివేదిక అంచనా వేసింది. అధికారిక గణాంకాల కంటే ఈ వైరస్ సృష్టించిన మానవ నష్టం ఎంతటి తీవ్రమైనదో ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.
అసలు 'అదనపు మరణాలు' అంటే ఏమిటి?
వైద్య నిపుణుల ప్రకారం.. ఒక సాధారణ కాలంలో సాధారణ పరిస్థితుల నడుమ దేశంలో ఎంతమంది చనిపోతారో, దానికి మించి విపత్కర పరిస్థితుల్లో నమోదైన అదనపు మరణాల సంఖ్యనే 'ఎక్సెస్ డెత్స్' అంటారు. ప్రముఖ వైద్య జర్నల్ 'బీఎమ్‌జే' (BMJ) పరిశోధన ప్రకారం ఇందులో పలు అంశాలు ఉంటాయి. కరోనా ఇన్ఫెక్షన్ వల్ల నేరుగా చనిపోయిన వారు, కోవిడ్ ఉధృతి వల్ల ఆసుపత్రులు నిండిపోయి వైద్యం అందక చనిపోయిన వారు, లాక్‌డౌన్ , ఇతర కారణాల వల్ల క్యాన్సర్ లేదా గుండె జబ్బుల వంటి ఇతర తీవ్రమైన వ్యాధులకు సకాలంలో చికిత్స లేదా నిర్ధారణ పరీక్షలు అందక మరణించిన వారంతా ఈ జాబితా కిందకే వస్తారు. ప్రజారోగ్య అత్యవసర పరిస్థితుల్లో ఒక సంక్షోభం అసలైన తీవ్రతను అంచనా వేయడానికి ఈ 'అదనపు మరణాల' డేటానే అత్యంత ప్రామాణికమైనదిగా నిపుణులు భావిస్తారు.
గ్లోబల్ హెల్త్ డేటా సేకరణలో ఘోర వైఫల్యాలు
ఈ నివేదిక ద్వారా ప్రపంచవ్యాప్తంగా మరణాల నమోదు వ్యవస్థల్లో ఉన్న పటిష్టత లోపాలు కూడా బట్టబయలయ్యాయి. ప్రపంచంలోని కేవలం మూడో వంతు (1/3) దేశాలు మాత్రమే డబ్ల్యూహెచ్ వో ప్రమాణాల ప్రకారం నాణ్యమైన మరణాల నివేదికలను సమర్పిస్తున్నాయి. దాదాపు సగం దేశాల్లో అసలు నమ్మదగిన మరణాల నమోదు వ్యవస్థలే లేవు లేదా అత్యంత నాసిరకం డేటా అందుబాటులో ఉంది. 2025 చివరి నాటికి కూడా కేవలం 18 శాతం దేశాలు మాత్రమే ఏడాది లోపు మరణాల డేటాను డబ్ల్యూహెచ్ వోకు సమర్పించాయి. అలాగే ప్రపంచంలోని మూడో వంతు దేశాలు అసలు మరణానికి గల కచ్చితమైన కారణాన్ని ఎప్పుడూ నివేదించలేదు. ఉదాహరణకు 2023లో ప్రపంచవ్యాప్తంగా నమోదైన 6.1 కోట్ల మరణాలలో కేవలం మూడో వంతు వాటికి మాత్రమే మరణానికి గల కారణం నమోదైంది. కేవలం ఐదో వంతు మరణాలకు మాత్రమే అంతర్జాతీయ వ్యాధుల వర్గీకరణ (ICD) కోడ్ ఆధారాలు ఉన్నాయి.
కరోనా మరణాలుగా ఎందుకు నమోదు కాలేదు?
మహమ్మారి పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు చాలా మరణాలు అధికారికంగా కోవిడ్ మరణాలుగా రికార్డు కాకపోవడానికి పలు కారణాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. కరోనా ప్రారంభ దశల్లో టెస్టింగ్ కిట్ల కొరత ఉండటం, ఆసుపత్రులకు రాకుండా ఇళ్లలోనే చాలామంది ప్రాణాలు కోల్పోవడం, గ్రామీణ ప్రాంతాల్లో రికార్డుల నిర్వహణ సరిగ్గా లేకపోవడం ,దేశాల మధ్య నివేదికల ప్రమాణాలలో తేడాలు ఉండటం దీనికి కారణం. అలాగే కోవిడ్ రోగుల రద్దీ వల్ల కిడ్నీ, బీపీ, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రెగ్యులర్ చెకప్‌లు , అత్యవసర వైద్య సేవలు నిలిచిపోవడంతో వేలాదిమంది పరోక్షంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ కాలంలో క్యాన్సర్ స్క్రీనింగ్, చిన్నపిల్లల వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌లు, గుండె జబ్బుల చికిత్సలు , మానసిక ఆరోగ్య సేవలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిణామాల వల్ల వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ఆర్థికంగా వెనుకబడిన పేద వర్గాల ప్రజలు అత్యధికంగా ప్రాణాలు కోల్పోయారు.
ఈ డేటా ఎందుకు ముఖ్యం?
ప్రస్తుతానికి కరోనా అత్యవసర తీవ్రత తగ్గినప్పటికీ, వైరస్ ఇంకా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిలోనే ఉంది. భవిష్యత్తులో రాబోయే మహమ్మారులను ఎదుర్కోవడానికి, ప్రజారోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి , వ్యాధుల నిఘా వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడానికి ఈ అదనపు మరణాల గణాంకాలు ప్రభుత్వాలకు, పరిశోధకులకు దిక్సూచిలా ఉపయోగపడతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. హై-రిస్క్ గ్రూపులలో ఉన్నవారు ఇప్పటికీ బూస్టర్ డోస్ వ్యాక్సిన్లు వేసుకోవాలని, శ్వాసకోశ పరిశుభ్రత పాటించాలని, కొత్త వేరియంట్లపై నిరంతరం నిఘా ఉంచాలని డబ్ల్యూహెచ్ వో హెచ్చరిస్తోంది.
No comments:
Post a Comment