Saturday, 23 May 2026

రాజ్యసభ సీటు అమ్ముకున్న ఆప్‌


  • ఆమ్ ఆద్మీ పార్టీపై హర్భజన్ సంచలన ఆరోపణలు
  • పంజాబ్ రాజకీయాల్లో రేగిన తీవ్ర దుమారం


భారత క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు హర్భజన్ సింగ్ రాజకీయంగా చేసిన ఆరోపణలు పంజాబ్, జాతీయ రాజకీయాల్లో తీవ్ర కలకలాన్ని రేపింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) తన రాజ్యసభ సీటును భారీ మొత్తానికి అమ్ముకుందని భజ్జీ బహిరంగంగా ఆరోపించడమే కాకుండా, ఇందుకోసం ఎవరెవరు లంచాలు తీసుకున్నారో త్వరలోనే వారి పేర్లను సాక్ష్యాధారాలతో సహా బయటపెడతానని హెచ్చరించారు. ఇటీవల ఆప్ వీడి బీజేపీలో చేరిన హర్భజన్ సింగ్.. సామాజిక మాధ్యమం 'ఎక్స్'  వేదికగా ఒక నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఈ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆప్ మద్దతుతో గెలిచిన రాజ్యసభ సీటుకు ఎందుకు రాజీనామా చేయలేదని, పంజాబ్ రైతులకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీ నుంచి రూ. 25 కోట్లు తీసుకుని ఆత్మగౌరవాన్ని అమ్ముకున్నారా అంటూ నెటిజన్‌ భజ్జీని విమర్శించారు. దీనికి హర్భజన్ సింగ్ అంతే తీవ్రంగా సమాధానమిస్తూ.. పంజాబ్ రాజ్యసభ సీటును ఆప్ ఎంతకు అమ్ముకుందో ముందు మీ నాయకులనే అడగాలని, వారు చెప్పకపోతే ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంతెంత  తీసుకున్నారో తానే స్వయంగా ఆధారాలతో సహా లాలా (అరవింద్ కేజ్రీవాల్ ను ఉద్దేశించి) ముఠా గుట్టు రట్టు చేస్తానని సవాల్ విసిరారు. కేవలం పంజాబ్‌ను లూటీ చేయడానికి, ఇక్కడి అక్రమ సంపాదనను ఢిల్లీ పెద్దలకు చేరవేయడానికే కొందరిని మంత్రులుగా, ఉన్నతాధికారులుగా నియమించారని ఆయన మండిపడ్డారు. మీరు పంజాబ్‌ను పూర్తిగా దోచుకుని తిన్నారంటూ ఆప్ అగ్రనాయకత్వంపై విరుచుకుపడ్డారు. ఈ పరిణామంపై పంజాబ్‌లోని ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ ,బీజేపీలు  స్పందించాయి. ఆప్ స్వచ్ఛమైన రాజకీయాల ముసుగు ఇప్పుడు పూర్తిగా తొలగిపోయిందని,  సొంత పార్టీ ఎంపీయే ఇలాంటి ఆరోపణలు చేయడం వారి నైజాన్ని నిరూపిస్తోందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ వ్యవహారంపై తక్షణమే ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశాయి. అయితే, హర్భజన్ సింగ్ చేసిన ఈ ఆరోపణలను ఆప్‌ గా ఖండించింది. సీటు దక్కలేదనే తీవ్ర అసంతృప్తితోనే ఆయన ఇలాంటి నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, పార్టీ ఎల్లప్పుడూ పారదర్శకతకే ప్రాధాన్యం ఇస్తుందని ఆప్ నేతలు సమర్థించుకున్నారు.



No comments:

Post a Comment

Featured post

ఇవాంకా ట్రంప్‌ను హతమార్చేందుకు కుట్ర

   నిఘా వర్గాల చేతికి ఫ్లోరిడా నివాస నమూనా అమెరికాలో ఐఆర్‌జీసీ ఉగ్రవాది అరెస్ట్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ను...