- జోధ్‌పూర్‌లో దారుణం
- ఏళ్ల తరబడి గ్యాంగ్ రేప్, బ్లాక్‌మెయిల్
- న్యాయం జరక్క ఇద్దరు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య
- రాజస్థాన్‌లో రగిలిపోతున్న నిరసన జ్వాలలు!
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ గ్రామీణ ప్రాంతంలో అత్యంత అమానవీయమైన, హృదయవిదారకమైన ఘటన వెలుగుచూసింది. స్థానిక కామాంధుల చేతిలో ఏళ్ల తరబడి సాగిన దారుణమైన గ్యాంగ్ రేప్, అశ్లీల వీడియోల బ్లాక్‌మెయిలింగ్‌ను తట్టుకోలేక ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు బలవన్మరణానికి పాల్పడ్డారు. మొదట పెద్దకుమార్తె ఆత్మహత్య చేసుకోగా, ఆ తర్వాత ఆమె చెల్లెలిని కూడా అదే వీడియోలతో బెదిరించి లొంగదీసుకున్న నిందితులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మనస్తాపానికి గురైన చిన్నకుమార్తె కూడా ప్రాణాలు తీసుకుంది. పోలీసులు పదే పదే ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వల్లే ఈ రెండు ప్రాణాలు పోయాయనే ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిందితులను కఠినంగా శిక్షించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితుల తండ్రి , స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘోరానికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. స్థానికంగా ఈ-మిత్ర సేవా కేంద్రాన్ని నడుపుతున్న మహీపాల్ అనే వ్యక్తి మొదట పెద్దమ్మాయిని తన వలలో వేసుకుని, ఆమెకు తెలియకుండా కొన్ని అశ్లీల వీడియోలను రికార్డ్ చేశాడు. ఆ వీడియోలను చూపించి గత నాలుగేళ్లుగా ఆమెను లోబరుచుకోవడమే కాకుండా శివరాజ్, గోపాల్, విజారామ్, దినేష్, మనోజ్, పుఖ్‌రాజ్ అనే తన స్నేహితులతో కలిసి నిరంతరం గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డాడు. ఈ ఘతుకానికి తోడు ఆమె నుండి పెద్ద ఎత్తున డబ్బులు కూడా వసూలు చేస్తూ తీవ్ర వేధింపులకు గురిచేశారు. ఈ నరకాన్ని భరించలేక సదరు యువతి ఈ ఏడాది మార్చి 20వ తేదీన ఆత్మహత్య చేసుకుంది. అక్క మరణం తర్వాత చిన్న చెల్లెలు ధైర్యం చేసి ఏప్రిల్ 11న మొత్తం ఎనిమిది మంది నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం జరగకపోతే తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని అప్పుడే పోలీసులను హెచ్చరించింది. పోలీసులు కేసు (FIR) నమోదు చేసినప్పటికీ, నెల రోజులు గడిచినా నిందితులపై ఎలాంటి గట్టి చర్యలు తీసుకోలేదు.
అక్క మరణం తర్వాత కూడా ఆ కామాంధుల ఆగడాలు ఆగలేదు. ఆ తర్వాత నిందితులంతా చిన్నమ్మాయి వైపు మళ్లారు. నీ అక్క వీడియోలను ఇంటర్నెట్‌లో పెడతామంటూ ఆమెను కూడా బెదిరించి లైంగిక దాడికి పాల్పడటం మొదలుపెట్టారు. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనప్పటికీ నిందితులు నడిరోడ్డుపై తిరుగుతూ.. పోలీసులు తమను ఏమీ చేయలేరంటూ బాధితురాలిని బహిరంగంగానే బెదిరించారు. పోలీసుల చుట్టూ తిరిగినా లాభం లేకపోవడంతో, తన గొంతును వినేలా చేయడానికి శుక్రవారం నాడు ఆ యువతి స్థానికంగా ఉన్న ఒక వాటర్ ట్యాంక్ ఎక్కి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. ఆ తర్వాత ఆమె విషం తాగడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయింది.
ఈ దారుణమైన ఘటనతో రాజ్‌పుత్ కమ్యూనిటీతో పాటు స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. బాధితురాలి మృతదేహాన్ని ఉంచిన ఎండీఎం ఆసుపత్రి వెలుపల భారీ సంఖ్యలో ప్రజలు చేరి పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. మార్వాడ్ రాజ్‌పుత్ సొసైటీ అధ్యక్షుడు హనుమాన్ సింగ్ ఖంగ్తా మాట్లాడుతూ.. దర్యాప్తు పొడవునా పోలీసులు నిందితులను రక్షించడానికే ప్రయత్నించారని, వారి నిర్లక్ష్యం వల్లే ఇద్దరు అక్కాచెల్లెళ్లు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని మండిపడ్డారు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని, బాధ్యులైన పోలీస్ అధికారులపై కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు భీష్మించుకు కూర్చోవడంతో, ఎట్టకేలకు స్పందించిన ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై డిపార్ట్‌మెంటల్ ఎంక్వైరీ జరుపుతామని హామీ ఇచ్చారు. ఈ హామీ అనంతరం బాధిత కుటుంబ సభ్యులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడానికి అంగీకరించారు.
No comments:
Post a Comment