- మీడియా నన్ను తప్పుగా వాడుకుంది
- నా విమర్శ తప్పుడు డిగ్రీలు ఉన్నవారిపైనే తప్ప నిరుద్యోగ యువతపై కాదు
సుప్రీంకోర్టు విచారణల సందర్భంగా నిరుద్యోగ యువతను , సామాజిక కార్యకర్తలను 'బొద్దింకలు', 'పరాన్నజీవులు' (Parasites) అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించినట్లు సామాజిక మాధ్యమాలు, మీడియాలో వచ్చిన నివేదికలపై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా స్పందించారు. ఆ వార్తలలో ఏమాత్రం సత్యం లేదని, మీడియాలోని ఒక విభాగం తన నోటిమాటలను పూర్తిగా తప్పుగా అర్థం చేసుకుని, తప్పుగా ప్రచారం చేసిందని ఆయన శనివారం (మే 16న) జారీ చేసిన ఒక అధికారిక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. దేశ సర్వోన్నత న్యాయస్థానాధిపతి స్థానంలో ఉండి రాజ్యాంగబద్ధంగా పౌరుల హక్కులను కాపాడాల్సిన తానే దేశ యువతను విమర్శించినట్లు చూపించడం పూర్తిగా నిరాధారమని సీజేఐ కొట్టిపారేశారు.
ఈ వివాదంపై స్పష్టతనిస్తూ.. శుక్రవారం ఒక పనికిరాని (Frivolous) పిటిషన్‌పై విచారణ జరుగుతున్న సమయంలో తాను చేసిన వ్యాఖ్యల సందర్భాన్ని జస్టిస్ సూర్యకాంత్ వివరించారు. లీగల్ ప్రొఫెషన్ (న్యాయవాద వృత్తి) లోకి నకిలీ , దొంగ డిగ్రీల (Fake and Bogus Degrees) తో ప్రవేశిస్తున్న వారిని మాత్రమే తాను ప్రత్యేకంగా విమర్శించానని ఆయన స్పష్టం చేశారు. అటువంటి నకిలీ వ్యక్తులు మీడియా, సోషల్ మీడియా , ఇతర పవిత్రమైన వృత్తుల్లోకి కూడా చొరబడ్డారని, సమాజానికి చెడు చేస్తున్న అలాంటి వారిని మాత్రమే తాను పరాన్నజీవులతో పోల్చానని తెలిపారు. దేశ యువతను తాను విమర్శించాననడం ముమ్మాటికీ అవాస్తవమని, భారతదేశ ప్రస్తుత . భవిష్యత్తు మానవ వనరుల పట్ల తనకు ఎంతో గర్వముందని, భారతీయ యువత తనకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. దేశ యువతకు తనపై ఎంతో గౌరవం ఉందని, తాను కూడా వారిని 'వికసిత భారత్' (అభివృద్ధి చెందిన భారతదేశం) బలమైన స్తంభాలుగా భావిస్తున్నానని సీజేఐ స్పష్టం చేశారు.
ఈ వివాదం అసలు ఎక్కడ మొదలైందంటే.. దిల్లీ హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ హోదా దక్కలేదని ఒక లాయర్ దాఖలు చేసిన పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది. సదరు న్యాయవాది సామాజిక మాధ్యమాల్లో కోర్టులను ఉద్దేశించి చేసిన పోస్టులు , ప్రవర్తనను పరిశీలించిన ధర్మాసనం.. "వ్యవస్థపై దాడి చేసే పరాన్నజీవులతో మీరు చేతులు కలపాలనుకుంటున్నారా?" అని ప్రశ్నించింది. ఆ సమయంలోనే, "ఉపాధి దొరకక, వృత్తిలో రాణించలేక కొందరు బొద్దింకల లాంటి యువకులు మీడియా, సోషల్ మీడియా, ఆర్‌టీఐ (RTI) కార్యకర్తలుగా మారి అందరిపై దాడులు (ట్రోలింగ్) చేయడం మొదలుపెడుతున్నారు" అని కోర్టు వ్యాఖ్యానించినట్లు లైవ్ లా (Live Law) వంటి సంస్థలు నివేదించాయి. దిల్లీ పరిధిలో నల్లకోట్లు వేసుకుని తిరుగుతున్న వేలాది మంది లాయర్ల డిగ్రీలపై తీవ్ర అనుమానాలు ఉన్నాయని, దీనిపై సీబీఐ (CBI) విచారణకు ఆదేశించే యోచనలో ఉన్నామని, బార్ కౌన్సిల్ ఓట్ల రాజకీయాల వల్ల చర్యలు తీసుకోవడం లేదని కూడా ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. అయితే, ఈ మౌఖిక వ్యాఖ్యలను (Oral Observations) మీడియా సందర్భం లేకుండా కేవలం నిరుద్యోగ యువతపై చేసిన విమర్శగా చిత్రీకరించడంతో దేశవ్యాప్తంగా మేధావులు, జర్నలిస్టులు, విపక్ష నేతల నుండి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే ప్రధాన న్యాయమూర్తి రంగంలోకి దిగి, తన వ్యాఖ్యల అసలు ఉద్దేశం నకిలీ సర్టిఫికెట్ల మాఫియాను హెచ్చరించడమేనని క్లారిటీ ఇచ్చారు.
No comments:
Post a Comment