దేశంలో అరాచకం సృష్టించేందుకు ‘ఇండియా’ కూటమి కుట్ర..
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తీవ్ర ఆగ్రహం
న్యూఢిల్లీ: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రతిపక్ష పార్టీల వైఖరిపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆదివారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశాన్ని అస్థిరపరచడానికి, దేశవ్యాప్తంగా హింసను ప్రేరేపించడానికి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు, కొన్ని దేశ వ్యతిరేక శక్తులు కలిసి ఒక పెద్ద కుట్రకు తెరలేపాయని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల బరిలో ప్రధాని నరేంద్ర మోడీని నేరుగా ఎదుర్కొనలేక, ప్రజాస్వామ్యబద్ధంగా బీజేపీని ఓడించలేక తీవ్ర రాజకీయ నిరాశతోనే ప్రతిపక్షాలు దేశంలో అశాంతిని రేకెత్తించాలని చూస్తున్నాయని సామాజిక మాధ్యమం వేదికగా మండిపడ్డారు. రాహుల్ గాంధీ చేస్తున్న ప్రకటనలు సాధారణమైనవి కావని, దేశంలో అరాచకత్వాన్ని వ్యాప్తి చేసేందుకు వేసిన వ్యూహాత్మక ప్లాన్ అని గోయల్ స్పష్టం చేశారు.అంతర్జాతీయ వేదికలపై భారతదేశ సార్వభౌమత్వాన్ని, రాజ్యాంగ సంస్థలను కించపరచడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని పీయూష్ గోయల్ ధ్వజమెత్తారు. దేశానికి మంచి జరుగుతుంటే భరించలేని ద్వేషం వారిలో కనిపిస్తోందని, భారతదేశ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవాలంటూ విదేశీ శక్తులను కోరడం వారి నిజమైన నైజాన్ని బయటపెడుతోందని అన్నారు. అయితే భారతదేశ పౌరులు ఎంతో వివేకవంతులని, దేశ వ్యతిరేక శక్తుల ఆలోచనలను వారు బాగా అర్థం చేసుకోగలరని చెప్పారు. దేశాన్ని తగలబెట్టాలనే 'ఇండియా' కూటమి కుట్రలు ఎప్పటికీ విజయవంతం కావని ఆయన తేల్చి చెప్పారు. కాగా, నీట్ యూజీ పేపర్ లీకేజీ వివాదంపై యూత్ కాంగ్రెస్ చేస్తున్న నిరసనలకు రాహుల్ గాంధీ మద్దతు తెలపడం, ప్రధాని మోడీ మౌనాన్ని ప్రశ్నిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ పట్టుబట్టడంపై స్పందనగా పీయూష్ గోయల్ ఈ ఘాటు విమర్శలు చేశారు.
No comments:
Post a Comment