- తూర్పు భారతదేశాన్ని ప్రగతిపథంలో నడిపించే వ్యూహాత్మక, సాంస్కృతిక , ఆర్థిక విప్లవం!
'అంగ-బంగ-కళింగ' అనేది కేవలం ప్రాచీన భారతదేశ కవిత్వంలోనో, జాతీయ గీతంలోనో వినిపించే పదబంధం మాత్రమే కాదు. అది గంగా మైదానాలు, బెంగాల్ డెల్టా, బంగాళాఖాత తీరాలను అనుసంధానించిన ఒక గొప్ప నాగరికతకు, సంస్కృతికి నిదర్శనం. ప్రస్తుత భౌగోళిక పరిస్థితులలో చూస్తే ఇది బిహార్, పశ్చిమ బెంగాల్ , ఒడిశా రాష్ట్రాల కలయిక. భారతదేశ చరిత్రలో ఈ మూడు ప్రాంతాలు ఎప్పుడూ వెనుకబడి లేవు, ఒకప్పుడు ఇవి సంపదకు, జ్ఞానానికి, ఆధ్యాత్మికతకు , అంతర్జాతీయ వాణిజ్యానికి ప్రధాన కేంద్రాలుగా వర్ధిల్లాయి. తూర్పు బిహార్‌లోని 'అంగ' ప్రాంతం గంగా మైదానాల అంతర్గత వాణిజ్యానికి కేంద్రంగా నిలిస్తే, బెంగాల్ (బంగ) తన నదీ జలాల ద్వారా సముద్ర మార్గాలకు ద్వారంగా మారింది. నాటి తామ్రలిప్త ఓడరేవు ద్వారా బెంగాల్ ఆగ్నేయాసియా, చైనా , రోమన్ సామ్రాజ్యంతో సంబంధాలు కలిగి ఉండేది. ఇక ప్రాచీన ఒడిశా అయిన 'కళింగ' సముద్రయానంలో అగ్రగామిగా నిలిచి సిలోన్, బర్మా, జావా, సుమత్రా, బాలి వంటి దేశాలతో సాంస్కృతిక, వాణిజ్య బంధాన్ని ఏర్పరచుకుంది. ఈ మూడు ప్రాంతాలు కలిసి భారతదేశాన్ని ప్రపంచంతో అనుసంధానించే ఒక అద్భుతమైన తూర్పు వ్యవస్థగా విరాసిల్లాయి.
ఇటీవలి కాలంలో ఈ చారిత్రక స్మృతికి ఒక సరికొత్త రాజకీయ అర్థం లభించింది. బిహార్, పశ్చిమ బెంగాల్ , ఒడిశా రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ (BJP) సాధిస్తున్న రాజకీయ పురోగతిని కేవలం ఎన్నికల విజయాలుగా మాత్రమే కాకుండా, ఒక సరికొత్త 'ఈస్టర్న్ పొలిటికల్ కారిడార్' (తూర్పు రాజకీయ కారిడార్) ఏర్పాటుగా విశ్లేషించవచ్చు. భారతదేశపు తూర్పు భాగాన్ని ఒకే వ్యూహాత్మక, సాంస్కృతిక , ఆర్థిక వలయంగా మార్చేందుకు బీజేపీకి ఇదొక గొప్ప అవకాశంగా మారింది. ఈ మూడు రాష్ట్రాలు వేర్వేరు రాజకీయ విభాగాలు కాదని, ఇవన్నీ ఒకే ప్రాచీన నాగరికతలో భాగాలని చెప్తూ.. మౌలిక సదుపాయాల అభివృద్ధిని, సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని ఒకేతాటిపైకి తీసుకురావడమే ఈ వ్యూహం ముఖ్య ఉద్దేశం. తూర్పు భారతదేశాన్ని ఇకపై నిర్లక్ష్యానికి గురైన ప్రాంతంగా కాకుండా.. సంపదకు, ఆధ్యాత్మికతకు, సముద్రయాన శక్తికి మళ్లీ కేంద్రంగా మార్చాలనే బలమైన సందేశాన్ని ఇది ఇస్తోంది.
ఈ రాజకీయ నినాదంలో 'పూర్వోదయ' (తూర్పు ప్రాంత అభివృద్ధి) అనే భావన అత్యంత కీలకమైనది. బిహార్ జనాభా , భూగర్భ వనరులను, బెంగాల్ తన పారిశ్రామిక, నదీ తీర అవకాశాలను, ఒడిశా తన అపారమైన ఖనిజ సంపదను , సుదీర్ఘ సముద్ర తీరాన్ని అందిస్తున్నాయి. ఈ మూడింటినీ హైవేలు, రైల్వేలు, ఓడరేవులు , అంతర్గత జలమార్గాల ద్వారా అనుసంధానిస్తే, ఈ ప్రాంతం భారతదేశ వృద్ధికి ప్రధాన ఇంజిన్‌గా మారుతుంది. ముఖ్యంగా కోల్‌కతా-హల్దియా, పారాదీప్, ధామ్రా, గోపాల్‌పూర్ వంటి ఆధునిక ఓడరేవుల ద్వారా బంగ్లాదేశ్, మ్యాన్మార్, ఆగ్నేయాసియా , ఇండో-పసిఫిక్ ప్రాంతాలతో వాణిజ్యాన్ని, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయవచ్చు. ఇదొక కేవలం సాంకేతిక ప్రాజెక్ట్ మాత్రమే కాదు, ఒకప్పుడు వర్తకులు, బౌద్ధ భిక్షువులు, నావికులు ప్రయాణించిన చారిత్రక మార్గాలను పునరుద్ధరించడమే.
దీనికితోడు సాంస్కృతిక పునరుజ్జీవనం ఈ కారిడార్‌కు మరో బలమైన స్తంభంగా నిలుస్తోంది. బోధ్‌గయ, రాజ్‌గిర్, నలంద, పూరీ జగన్నాథ్ ఆలయం, కోణార్క్, భువనేశ్వర్, తారాపీఠ్, మాయాపూర్, గంగాసాగర్ వంటి బౌద్ధ, హిందూ, శైవ, శాక్త, తాంత్రిక ఆధ్యాత్మిక కేంద్రాలు ఈ అంగ-బంగ-కళింగ బెల్ట్‌లో విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతం కేవలం దేవాలయాల భూమి మాత్రమే కాదు, శతాబ్దాలుగా విభిన్న తాత్విక చింతనలు, జానపద, గిరిజన సంస్కృతులు మిళితమైన అద్భుతమైన వైవిధ్యభరిత ప్రాంతం. ఈ గొప్ప వారసత్వాన్ని ప్రాంతీయ అస్తిత్వానికి, గర్వకారణానికి చిహ్నంగా చూపడం ద్వారా తూర్పు భారతదేశం చారిత్రకంగా వెనుకబడిన ప్రాంతం కాదనే భావనను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చు. నాగరికత, అనుసంధానత, వాణిజ్యం (Civilisation, Connectivity, Commerce) అనే మూడు అంశాలను కలిపి ఈ తూర్పు కారిడార్‌ను ఎన్నికల మ్యాప్ నుంచి ఒక శాశ్వత అభివృద్ధి ప్రణాళికగా మార్చవచ్చు.
అయితే, ఈ గొప్ప భావన కేవలం ప్రతీకలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో విజయవంతం కావాలంటే ఎన్నో సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. బిహార్, బెంగాల్, ఒడిశాలకు విభిన్న భాషా గుర్తింపులు, కుల సమీకరణాలు, ప్రాంతీయ ఆకాంక్షలు , సరిహద్దు ఆందోళనలు ఉన్నాయి. బెంగాల్ డెల్టా ప్రాంతం, బిహార్ వరద మైదానాలు, ఒడిశా తీరప్రాంతాలు వాతావరణ మార్పుల వల్ల తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. కాబట్టి పర్యావరణ అనుకూల ప్రణాళికలు అవసరం. ఓడరేవుల అభివృద్ధి స్థానిక తీరప్రాంత ప్రజల జీవనోపాధిని దెబ్బతీయకూడదు, సాంస్కృతిక పునరుద్ధరణ కేవలం పైపైన కనిపించే నామమాత్రపు చర్యగా మిగిలిపోకూడదు, పారిశ్రామిక కారిడార్లు కేవలం వనరులను తరలించడానికి కాకుండా స్థానికంగా ఉపాధిని కల్పించేలా ఉండాలి. కాబట్టి, ఎన్నికల్లో గెలవడమే కాకుండా, ఈ కారిడార్ భావనను అందరినీ కలుపుకునే సుపరిపాలనగా మార్చడమే బీజేపీ ముందున్న అసలైన సవాలు. సమాఖ్య విలువులను గౌరవిస్తూ, స్థానిక సంప్రదాయాలను రక్షిస్తూ, చారిత్రక వైభవాన్ని ప్రాక్టికల్ డెవలప్‌మెంట్‌తో ముడిపెట్టినప్పుడే ఈ 'అంగ-బంగ-కళింగ' కారిడార్ భారతదేశ గతానికి, భవిష్యత్తుకు మధ్య ఒక అద్భుతమైన ప్రగతి వారధిగా మారుతుంది.
No comments:
Post a Comment