- ఎన్నికల సంఘం తీరుపై కునాల్ ఘోష్ ఘాటు విమర్శలు!
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ముగింపు దశలో ఉండగా, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఓట్ల లెక్కింపు వ్యవస్థను తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకుడు కునాల్ ఘోష్ శనివారం తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోబోతోందని, అందుకే చివరి నిమిషంలో అక్రమాలకు పాల్పడి ఫలితాలను మార్చేందుకు కుట్రలు పన్నుతోందని ఆయన మండిపడ్డారు. ఓట్ల లెక్కింపు సమయంలో కేవలం కేంద్ర ప్రభుత్వ ,కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (PSU) ఉద్యోగులను మాత్రమే సూపర్వైజర్లుగా, సహాయకులుగా నియమించాలని ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని ఆయన ధ్వజమెత్తారు.
ఈ నేపథ్యంలో టీఎంసీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందిస్తూ, లెక్కింపు ప్రక్రియలో కేంద్ర ఉద్యోగులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను కూడా భాగస్వామ్యం చేయాలని స్పష్టం చేయడం ఎన్నికల సంఘానికి పెద్ద ఎదురుదెబ్బ అని ఘోష్ పేర్కొన్నారు. మే 4న జరగనున్న ఓట్ల లెక్కింపులో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ భారీ విజయాన్ని నమోదు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఓటమిని గ్రహించే ఇటువంటి అక్రమ మార్గాలను వెతుకుతోందని, అయితే ప్రజలు ఇచ్చిన తీర్పును మార్చడం ఎవరివల్లా సాధ్యం కాదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. టీఎంసీ శ్రేణులు అప్రమత్తంగా ఉండి కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవకతవకలు జరగకుండా చూడాలని ఆయన పిలుపునిచ్చారు.
No comments:
Post a Comment