Wednesday, 20 May 2026

మోదీ, అమిత్ షా దేశద్రోహులు

హిందుస్థాన్‌ను అమ్మేస్తూ, రాజ్యాంగంపై దాడి చేస్తున్నారంటూ రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు.. 

భగ్గుమన్న బీజేపీ, క్షమాపణలు చెప్పేదే లేదని పీకే స్పష్టీకరణ!

రాయ్‌బరేలి, అమేథీ నియోజకవర్గాల పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై సరికొత్త, అత్యంత తీవ్రమైన రాజకీయ విమర్శలతో విరుచుకుపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మరియు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) లు ప్రతిరోజూ దేశ రాజ్యాంగాన్ని బలహీనపరుస్తూ, దేశ ప్రయోజనాలను కొద్దిమంది పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతున్న "దేశద్రోహులు" (Traitors) అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు రాయ్‌బరేలిలో స్థానిక విప్లవ వీరుడు వీర పాసి స్మారకార్థం నిర్వహించిన 'బహుజన్ స్వాభిమాన్ సభ'లో , ఆ తర్వాత అమేథీలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ ఈ ఘాటు ఆరోపణలు చేశారు. దీనిపై భారతీయ జనతా పార్టీ (BJP) తీవ్రంగా స్పందిస్తూ.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఆయనకున్న 'అరాచక మానసిక స్థితిని , వ్యక్తిత్వాన్ని' ప్రతిబింబిస్తున్నాయని మండిపడింది.




రాయ్‌బరేలి సభలో రాహుల్ గాంధీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. "మీరు మేల్కొని పోరాడాల్సిన సమయం వచ్చింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మీ ఇళ్లకు వచ్చి నరేంద్ర మోదీ, అమిత్ షాల గురించి మాట్లాడితే.. వారి ప్రధాని, హోం మంత్రి,  వారి సంస్థ దేశద్రోహులని వారికి ముఖం మీదే చెప్పండి. వారు మన హిందుస్థాన్‌ను అమ్మేసి బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీలు రూపొందించిన రాజ్యాంగంపై 24 గంటలూ దాడి చేస్తున్నారు" అని పిలుపునిచ్చారు. అమేథీ సభలో కూడా తన వ్యాఖ్యలను సమర్థిస్తూ.. దేశ రాజ్యాంగాన్ని నాశనం చేసేవారిని దేశద్రోహులు అనక మరేమంటారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్ క్షమాపణలు డిమాండ్ చేస్తోందని, కానీ తాను ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని, క్షమాపణలు చెప్పేదే లేదని రాహుల్ స్పష్టం చేశారు. ఉపాధి హామీ (MNREGA) నిధులు తగ్గించడం, కుల గణనను తిరస్కరించడం, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించడం , ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నవారినే విశ్వవిద్యాలయాల వైస్-ఛాన్సలర్లుగా నియమించడం ద్వారా రాజ్యాంగ వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేశారని ఆరోపించారు.

దేశంలో ముంచుకొస్తున్న ఆర్థిక సంక్షోభంపై కూడా రాహుల్ గాంధీ హెచ్చరికలు జారీ చేశారు. పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల అంతర్జాతీయ చమురు సరఫరాకు తీవ్ర విఘాతం కలిగి.. రాబోయే రెండు మూడు నెలల్లో దేశంలో మునుపెన్నడూ చూడని రీతిలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ , నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగబోతున్నాయని అంచనా వేశారు. దేశ ప్రజలను విదేశీ ప్రయాణాలు, బంగారం కొనుగోళ్లు తగ్గించుకోవాలని కోరిన ప్రధాని మోదీ, ఆ ప్రసంగం ముగిసిన వెంటనే తానే స్వయంగా ఐదు దేశాల పర్యటనకు విమానమెక్కి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ధరలు పెరగవని నమ్మించిన మోదీ.. ఇప్పుడు అంబానీ రష్యా నుండి చౌకగా చమురు కొని విదేశాలకు ఎగుమతి చేస్తూ లాభాలు గడిస్తుంటే చూస్తూ ఊరుకుంటున్నారని, ఆ డబ్బుే నరేంద్ర మోదీ ఎన్నికల ఫండింగ్‌కు ఉపయోగపడుతోందని సంచలన ఆరోపణ చేశారు. దేశంలో ఎరువులు, కిరోసిన్ కొరత ఏర్పడి సాధారణ ప్రజలు నరకం చూస్తారని, అంబానీ, అదానీలకు ఎలాంటి నష్టం జరగదని అన్నారు.

గతంలో పెద్ద నోట్ల రద్దు (Demonetisation) మరియు కోవిడ్ లాక్‌డౌన్ సమయాల్లో దేశాన్ని నట్టేట ముంచి, ఆ తర్వాత టెలివిజన్ ముందుకు వచ్చి ప్రధాని మోదీ కన్నీళ్లు పెట్టుకున్నారని.. రాబోయే ఆర్థిక సంక్షోభం తర్వాత కూడా ఆయన అలాగే టీవీలో ఏడుస్తూ తన తప్పేమీ లేదంటారని రాహుల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కానీ దేశాన్ని ఈ దుస్థితికి తెచ్చింది మోదీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ లేనని ప్రజలు గ్రహించాలన్నారు. రాజ్యాంగం కల్పించిన ఒకే వ్యక్తి-ఒకే ఓటు హక్కును కాలరాస్తూ, తమకు ఓటు వేయని కోట్ల మంది పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగిస్తున్నారని ఆరోపించారు. కేవలం విగ్రహాలకు చేతులు జోడించి దండాలు పెడితే సరిపోదని, అంబేద్కర్, గాంధీల ఆశయాలను కాపాడటానికి గట్టిగా నిలబడి పోరాడాలని రాహుల్ గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment

Featured post

అమెరికా శత్రువుల ఆట కట్టించిన ప్రెసిడెంట్ ట్రంప్

   వైట్ హౌస్ సంచలన ప్రకటన..  ఖమేనీ, మదురో, కాస్ట్రోలను టార్గెట్ చేస్తూ 'న్యాయం జరిగి తీరుతుంది' అని హెచ్చరిక! అమెరికా , ఇరాన్ మధ్య ద...