- కారుణ్య మరణం ప్రసాదించాలంటూ సూరత్ వ్యక్తి వేడుకోలు
సూరత్:గుజరాత్‌లోని సూరత్ నగరంలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. తన భార్య పెడుతున్న మానసిక, చట్టపరమైన వేధింపులను తట్టుకోలేక, అధికారులు తన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కిరీట్ పటేల్ అనే వ్యక్తి తనకు కారుణ్య మరణం ప్రసాదించాలంటూ సూరత్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు.
మహిళా చట్టాల దుర్వినియోగం
కిరీట్ పటేల్ తన దరఖాస్తులో తన భార్యపై సంచలన ఆరోపణలు చేశాడు. చిన్నపాటి గృహ వివాదాల తర్వాత కూడా ఆమె కావాలనే గొడవలను పెద్దవి చేసి, మహిళల రక్షణ కోసం ఉన్న చట్టాలను దుర్వినియోగం చేస్తూ తనపై తప్పుడు కేసులు పెడుతోందని ఆరోపణలు గుప్పించాడు. భార్య, అత్తమామలు, ఆమె బంధువులు తనను నిరంతరం డబ్బుల కోసం వేధిస్తున్నారని, గృహ హింస , భరణం కేసుల ద్వారా తనపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువస్తున్నారని పేర్కొన్నాడు. అంతేకాకుండా, తమ ఇద్దరికీ ఇది మూడో వివాహమని చెబుతూ.. తన భార్య ఒక దోపిడీ పెళ్లికూతురు అని ఆరోపించాడు. గతంలో కూడా ఆమె తన మాజీ భర్తల నుంచి చట్టపరమైన చర్యలు , ఆర్థిక డిమాండ్ల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసిందని, వివాహ బంధాన్ని కేవలం డబ్బు సంపాదించే మార్గంగా వాడుకుంటోందని తెలిపాడు.
బిడ్డకు ప్రాణాపాయం ఉన్నా స్పందించని పోలీసులు
తన మునుపటి వివాహం ద్వారా కలిగిన కుమారుడికి తన ప్రస్తుత భార్య వల్ల ప్రాణాపాయం ఉందని, ఆమె ఆ బాబుకు హాని చేయడానికి ప్రయత్నించిందని పటేల్ ఆరోపించాడు. ఈ విషయంపై పోలీసులను ఆశ్రయించినప్పటికీ వారు ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై తగిన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అధికారులను ఎన్నిసార్లు కోరినా ఫలితం లేకుండా పోయిందని తెలిపాడు.
పురుషులకు చట్టపరమైన రక్షణ ఏది?
కుటుంబ వివాదాల్లో పురుషులకు లభించే చట్టపరమైన రక్షణలపై పటేల్ తన దరఖాస్తులో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కేవలం హామీలే తప్ప క్షేత్రస్థాయిలో ఎలాంటి న్యాయం జరగడం లేదని వాపోయాడు. ఈ నిరంతర వేధింపులు, చట్టపరమైన వివాదాల నుంచి బయటపడటానికి తనకు చావు ఒక్కటే మార్గంగా కనిపిస్తోందని, అందుకే జిల్లా కలెక్టర్‌కు కారుణ్య మరణానికి అనుమతి కోరుతూ దరఖాస్తు సమర్పించానని స్పష్టం చేశాడు. అంతేకాదు, నిర్దేశిత సమయంలోగా తన సమస్యలను పరిష్కరించి న్యాయం చేయకపోతే తానే ఏదైనా తీవ్రమైన నిర్ణయం తీసుకుంటానని హెచ్చరించాడు.ప్రస్తుతానికి ఈ ఆరోపణలపై అధికారుల నుండి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.
No comments:
Post a Comment