విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేద్దాంహైదరాబాద్ వేదికగా భారతీయులకు ప్రధాని మోడీ పిలుపు
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కోవడానికి భారతీయులందరూ నడుం బిగించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, యుద్ధం వల్ల ముడిచమురు, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ, దేశ ప్రజలపై ఆ భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. సప్లై చైన్ లో అంతరాయాల వల్ల ఏర్పడే ఇబ్బందులను అధిగమించడానికి ప్రభుత్వం మాత్రమే కాకుండా, ప్రతి పౌరుడు ఒక 'సంకల్పం' తీసుకోవాలని ఆయన కోరారు. ముఖ్యంగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు పెట్రోల్, డీజిల్‌ను పొదుపుగా వాడటం ఇప్పుడు దేశహితం దృష్ట్యా అత్యంత ఆవశ్యకమని ప్రధాని గట్టిగా చెప్పారు.
ముడిచమురు దిగుమతుల కోసం దేశం వెచ్చిస్తున్న భారీ విదేశీ కరెన్సీని ఆదా చేసేందుకు ప్రజలు తమ వంతుగా కొన్ని చర్యలు చేపట్టాలని ప్రధాని సూచించారు. వీలైనంత వరకు మెట్రో రైళ్లు, ప్రజా రవాణా వ్యవస్థలను ఉపయోగించాలని, కార్లను వాడేవారు 'కార్‌పూలింగ్' పద్ధతిని అనుసరించాలని కోరారు. ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నవారు వాటికే ప్రాధాన్యం ఇవ్వాలని, కరోనా సమయంలో మనం అలవాటు చేసుకున్న 'వర్క్ ఫ్రమ్ హోమ్', ఆన్‌లైన్ సమావేశాలను మళ్ళీ ప్రోత్సహించడం వల్ల ఇంధన వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే విదేశీ పర్యటనలు, వివాహాల కోసం విదేశాలకు వెళ్లే సంస్కృతిని తగ్గించుకుని, స్వదేశీ పర్యాటకానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు.
తెలంగాణ రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ, పశ్చిమ బెంగాల్‌లో నియంతృత్వ ధోరణులను ఓడించి బీజేపీకి అక్కడి ప్రజలు ఏ విధంగా పట్టం కట్టారో, అదే ఉత్సాహం తెలంగాణలోనూ కనిపిస్తోందని మోడీ అన్నారు. తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, గతంలో బీజేపీకి కేవలం ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడే అందులో ఒకరిని తెలంగాణ ఇచ్చిందని గుర్తుచేశారు. దేశాన్ని వికసిత భారత్‌గా మార్చే లక్ష్యంలో తెలంగాణ కూడా భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సుమారు రూ. 9,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని, కేంద్రం ఎల్లప్పుడూ తెలంగాణ అభివృద్ధికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

No comments:
Post a Comment