- ఇరాన్‌పై ఏకపక్ష యుద్ధం ప్రకటించకుండా అధ్యక్షుడి అధికారాలకు కత్తెర
- డెమొక్రాట్లతో చేతులు కలిపిన నలుగురు రిపబ్లికన్ ఎంపీలు
అమెరికా ఇరాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో యూఎస్ కాంగ్రెస్‌లో (US Congress) అనూహ్య రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌పై సైనిక చర్యలు చేపట్టే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఒంటెద్దు పోకడలకు వెళ్లకుండా, ఆయనకున్న విశేష సైనిక అధికారాలకు బ్రేక్ వేస్తూ యూఎస్ సెనేట్ (US Senate) కీలక తీర్మానాన్ని ఆమోదించింది. అధ్యక్షుడికి ఉండే యుద్ధ అధికారాలను నియంత్రించే 'వార్ పవర్స్ యాక్ట్ రిజల్యూషన్' (War Powers Act Resolution) కు సెనేట్ ఆమోదం తెలపడం ట్రంప్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఈ ఓటింగ్ ప్రక్రియలో అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన నలుగురు సెనేటర్లు తమ సొంత పార్టీ లైన్‌ను దాటి ప్రతిపక్ష డెమొక్రాట్లతో చేతులు కలపడం అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసింది.
అమెరికా రాజ్యాంగం ప్రకారం యుద్ధాన్ని ప్రకటించే , దానికి నిధులు కేటాయించే తుది అధికారం కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఉంటుందని, అధ్యక్షుడికి కాదని ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన డెమొక్రాట్ సెనేటర్ టిమ్ కైన్ స్పష్టం చేశారు. ఒకవేళ ఇరాన్‌పై ఎలాంటి సైనిక దాడి చేయాలన్నా, లేదా శత్రుత్వ దేశంలోకి అమెరికా దళాలను పంపాలన్నా అంతకంటే ముందే కాంగ్రెస్ నుంచి కచ్చితమైన అనుమతి తీసుకోవడం ఇకపై అనివార్యం కానున్నది. అయితే కేవలం అమెరికాపై లేదా దాని దళాలపై తక్షణ శత్రు దాడి జరిగినప్పుడు ఆత్మరక్షణ కోసం మాత్రమే అధ్యక్షుడు ముందస్తు అనుమతి లేకుండా తక్షణ నిర్ణయం తీసుకునే మినహాయింపు ఈ చట్టంలో ఉంది. అంతకుమించి ఏకపక్షంగా యుద్ధ వాతావరణాన్ని సృష్టించడాన్ని సెనేట్ తీవ్రంగా వ్యతిరేకించింది.
రిపబ్లికన్ పార్టీలో స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ, నలుగురు కీలక రిపబ్లికన్ ఎంపీలు దేశ భద్రతను , రాజ్యాంగ విలువలను దృష్టిలో ఉంచుకొని డెమొక్రాట్లకు అనుకూలంగా ఓటు వేయడంతో ఈ తీర్మానం 55-45 ఓట్ల తేడాతో సులభంగా నెగ్గింది. ఈ పరిణామంపై వైట్ హౌస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే ఈ తీర్మానం చట్టంగా మారకుండా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకున్న ప్రత్యేక 'వీటో' (Veto) అధికారంతో దీనిని తిరస్కరించే అవకాశం ఉంది. అయినప్పటికీ, సొంత పార్టీ నేతలే ట్రంప్ యుద్ధ విదేశాంగ విధానాన్ని తప్పుబడుతూ ప్రతిపక్షంతో కలిసి రావడం, ఇరాన్ సంక్షోభం నేపథ్యంలో ట్రంప్ వ్యూహాలకు నైతికంగా , రాజకీయంగా పెద్ద బ్రేక్ పడినట్లయిందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
No comments:
Post a Comment