Thursday, 21 May 2026

తమిళనాడులో మంత్రివర్గ విస్తరణ


హోం శాఖను తన వద్దే ఉంచుకుని, ఆర్థిక శాఖను మార్చిన సీఎం విజయ్

కాంగ్రెస్‌కు చోటు, 32 మందితో పూర్తి స్థాయి క్యాబినెట్ 


తమిళనాడు నూతన ముఖ్యమంత్రి విజయ్ గురువారం నాడు తన మంత్రిమండలిని భారీగా విస్తరించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలతో సహా మొత్తం 23 మంది కొత్త మంత్రులు ఈ విడతలో ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో ముఖ్యమంత్రిగా విజయ్ తన తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీకి చెందిన 9 మంది మంత్రులతో కలిసి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. తాజా విస్తరణతో విజయ్ క్యాబినెట్ లోని మొత్తం మంత్రుల సంఖ్య 32కు చేరింది. 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీ నిబంధనల ప్రకారం గరిష్టంగా 15 శాతం అంటే 35 మంది వరకు మంత్రులు ఉండొచ్చు. అయితే ప్రభుత్వంలో చేరడంపై ఇంకా స్పష్టత ఇవ్వని మిత్రపక్షాలు వీసీకే (VCK), ఐయూఎంఎల్ (IUML) కోసం సీఎం విజయ్ మరో మూడు మంత్రి పదవులను ఖాళీగా ఉంచారు. మంత్రివర్గ విస్తరణ అనంతరం ముఖ్యమంత్రి కొత్త మంత్రులకు శాఖలను కేటాయించడంతో పాటు గతంలో కేటాయించిన కొన్ని కీలక పోర్ట్‌ఫోలియోలలో మార్పులు చేశారు.



రాష్ట్రంలో అత్యంత కీలకమైన హోం (పోలీస్) శాఖను ముఖ్యమంత్రి విజయ్ తన వద్దే ఉంచుకున్నారు. దీనితో పాటు సాధారణ పరిపాలన, నీటి సరఫరా శాఖలను కూడా ఆయనే పర్యవేక్షించనున్నారు. ఎన్నికల ప్రచారంలో తాను ప్రజలకు ఇచ్చిన ప్రధాన వాగ్దానాలైన శాంతిభద్రతల పరిరక్షణ, మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడానికే విజయ్ హోం శాఖను తన వద్ద ఉంచుకున్నట్లు తెలుస్తోంది. అలాగే టీవీకే (TVK) చరిత్రాత్మక విజయానికి వెన్నుముకగా నిలిచిన యువ ఓటర్లకు పెద్ద పీట వేస్తూ 'యువజన సంక్షేమ' శాఖను కూడా సీఎం తన వద్దే ఉంచుకోవడం గమనార్హం. కాగా, గతంలో సీనియర్ నేత కేఏ సెంగోట్టయన్ కు కేటాయించిన ఆర్థిక శాఖలో ముఖ్యమంత్రి మార్పులు చేశారు. సెంగోట్టయన్ కు ఇప్పుడు రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖను అప్పగించగా.. మేరీ విల్సన్ ను తమిళనాడు నూతన ఆర్థిక మంత్రిగా నియమించారు. కాంగ్రెస్ పార్టీ నుండి మంత్రివర్గంలో చేరిన రాజేష్ కుమార్‌కు పర్యాటక శాఖను, పి. విశ్వనాథన్‌కు ఉన్నత విద్యా శాఖను కేటాయించారు.


తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పూర్తి స్థాయి మంత్రిమండలి మరియు వారి శాఖల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:


ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలో సాధారణ పరిపాలన, పోలీస్ & హోం, ప్రత్యేక కార్యక్రమాల అమలు, పేదరిక నిర్మూలన, యువజన సంక్షేమం,  పట్టణాభివృద్ధి-నీటి సరఫరా శాఖలు ఉంటాయి. అత్యంత కీలకమైన ఆర్థిక, ప్రణాళిక , అభివృద్ధి శాఖను ఎన్. మేరీ విల్సన్ పర్యవేక్షించనున్నారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, సాగునీటి శాఖలను ఎన్. ఆనంద్ చూసుకోనుండగా, విద్యుత్ వనరులు మరియు న్యాయ శాఖను ఆర్. నిర్మల్‌కుమార్ సంభాలించనున్నారు. సీనియర్ నేత కేఏ సెంగోట్టయన్ కు రెవెన్యూ , విపత్తు నిర్వహణ శాఖ లభించగా, శ్రీనాథ్ కు మత్స్య శాఖ, కమలి ఎస్ కు పశుసంవర్ధక శాఖ, సి. విజయలక్ష్మికి పాల ఉత్పత్తి , డైరీ అభివృద్ధి శాఖలను కేటాయించారు. అడవుల శాఖను ఆర్‌వి రంజిత్‌కుమార్, వ్యవసాయ శాఖను వినోత్, పర్యావరణం & వాతావరణ మార్పుల శాఖను రాజీవ్, గృహనిర్మాణ , పట్టణాభివృద్ధి శాఖను బి. రాజ్‌కుమార్ చూసుకోనున్నారు.


సహకార శాఖను వి. గాంధీరాజ్, చిన్న సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల (MSMEs) శాఖను మథన్ రాజా పి, సామాజిక సంక్షేమం & మహిళా సాధికారత శాఖను జెగదేశ్వరి కె పర్యవేక్షించనున్నారు. కాంగ్రెస్ కోటాలో చేరిన రాజేష్ కుమార్ ఎస్ కు పర్యాటక శాఖ దక్కగా, చేనేత, జౌళి మరియు ఖాదీ శాఖను ఎం. విజయ్ బాలాజీ, వాణిజ్య పన్నులు మరియు రిజిస్ట్రేషన్ శాఖను లోగేష్ తమిళసెల్వన్ డి, రవాణా శాఖను విజయ్ తమిళన్ పార్థిబన్ ఎ చేజిక్కించుకున్నారు. హిందూ మతపరమైన , ధర్మాదాయ శాఖ బాధ్యతలను రమేష్, కాంగ్రెస్ నేత పి. విశ్వనాథన్ కు ఉన్నత విద్యా శాఖ,  నేటి తరం సాంకేతికతకు ప్రాధాన్యత ఇస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఐటీ & డిజిటల్ సర్వీసెస్ శాఖను కుమార్ ఆర్ కు కేటాయించారు. ప్రవాస తమిళుల సంక్షేమ శాఖను తెన్నరసు కె, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖను వి. సంపత్ కుమార్, కార్మిక సంక్షేమం , నైపుణ్యాభివృద్ధి శాఖను మహ్మద్ ఫర్వాస్ జె, మానవ వనరుల నిర్వహణ శాఖను డి. శరత్‌కుమార్ మరియు ఎక్సైజ్-మద్యపాన నిషేధ శాఖను విఘ్నేష్ కె లకు ముఖ్యమంత్రి విజయ్ అప్పగించారు.

No comments:

Post a Comment

Featured post

అమెరికా శత్రువుల ఆట కట్టించిన ప్రెసిడెంట్ ట్రంప్

   వైట్ హౌస్ సంచలన ప్రకటన..  ఖమేనీ, మదురో, కాస్ట్రోలను టార్గెట్ చేస్తూ 'న్యాయం జరిగి తీరుతుంది' అని హెచ్చరిక! అమెరికా , ఇరాన్ మధ్య ద...