Monday, 18 May 2026

నీట్ పేపర్ లీక్ వివాదంపై విశాల్ దద్లానీ తీవ్ర ఆగ్రహం


  •  'చదువు రాని వాళ్లకు అధికారం ఇవ్వకండి' అంటూ సంచలన వ్యాఖ్యలు
  • పాక్ జర్నలిస్ట్‌తో భేటీపై ట్రోలింగ్.. ఇండియన్ ఐడల్ నుండి తొలగించాలంటూ నెటిజన్ల డిమాండ్!



దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతున్న నీట్ (NEET-UG) పేపర్ లీక్ వివాదంపై ప్రముఖ బాలీవుడ్ సింగర్, మ్యూజిక్ కంపోజర్ విశాల్ దద్లానీ అత్యంత ఘాటుగా స్పందించారు. నష్టపోయిన విద్యార్థులకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఆయన.. దేశంలో పదే పదే జరుగుతున్న పరీక్షల అక్రమాలపై విద్యా వ్యవస్థను తీవ్రస్థాయిలో తప్పుపట్టారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో విపరీతంగా వైరల్ అవుతున్న ఒక వీడియోలో విశాల్ దద్లానీ మాట్లాడుతూ.. ఇంత పెద్ద కుంభకోణం జరిగినా అధికారులలో జవాబుదారీతనం లేకపోవడాన్ని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. ఈ దేశంలో చదువుకు ఇస్తున్న ప్రాధాన్యం ఎంతలా దిగజారిపోతుందో అనడానికి ఈ ఘటనే నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు.


ప్రతి సంవత్సరం ఇలాంటి పరీక్షల అక్రమాలు జరుగుతున్నా ఎవరూ బాధ్యత తీసుకోవడం లేదని మండిపడిన విశాల్.. భవిష్యత్తులో ఓటు వేసేటప్పుడు "చదువుకున్న, మెరుగైన నాయకులను" ఎన్నుకోవాలని దేశ పౌరులను కోరారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడిన "చదువు రాని అనాగరికులను (జాహిల్ గవారో కో) అధికారంలో కూర్చోబెట్టకండి" అనే వివాదాస్పద వ్యాఖ్యలు ఇంటర్నెట్‌లో పెను తుఫాను సృష్టించాయి. ఆయన వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల పక్షాన నిలిచినందుకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నప్పటికీ.. కొందరు మాత్రం ఆయన విద్యా సమస్యను రాజకీయీకరణ చేస్తున్నారని తీవ్రంగా ఆరోపిస్తున్నారు.


ఈ నీట్ వివాదం ఇలా నడుస్తుండగానే.. లండన్‌ లో పాకిస్థానీ జర్నలిస్ట్ సఫీనా ఖాన్‌ తో విశాల్ దద్లానీ ముచ్చటించిన మరో పాత వీడియో క్లిప్ హఠాత్తుగా తెరపైకి రావడంతో సోషల్ మీడియాలో ఆయనపై మరింత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భారత్-పాక్ మధ్య ఉన్న సున్నితమైన సంబంధాల నేపథ్యంలో ఈ భేటీని తప్పుపడుతున్న కొందరు నెటిజన్లు.. ప్రముఖ రియాలిటీ షో 'ఇండియన్ ఐడల్' న్యాయనిర్ణేత (జడ్జ్) స్థానం నుంచి విశాల్ దద్లానీని తక్షణమే తొలగించాలంటూ హ్యాష్‌ట్యాగ్‌లతో డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై షో నిర్వాహకులు గానీ, సోనీ టీవీ యాజమాన్యం గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అటు తనపై వస్తున్న విమర్శలపై విశాల్ దద్లానీ కూడా ఇంకా బహిరంగంగా స్పందించలేదు. ఒకవైపు నీట్ లీక్ సంక్షోభం, మరోవైపు పాక్ జర్నలిస్ట్‌ తో భేటీ.. ఈ రెండు వివాదాలు ఒకేసారి చుట్టుముట్టడంతో విశాల్ దద్లానీ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

No comments:

Post a Comment

Featured post

ఓస్లోలో భారత్ వర్సెస్ నార్వే మీడియా

పత్రికా స్వేచ్ఛపై ప్రశ్నించిన విదేశీ జర్నలిస్ట్‌కు భారత విదేశాంగ శాఖ గట్టి కౌంటర్ "అజ్ఞాన ఎన్జీవోల నివేదికలు చదివి మాట్లాడకండి" అం...