- ఆంక్షలు, పొదుపు మంత్రాలు సామాన్యులకేనా?
"పొదుపు పాటించండి.. ఖర్చులు తగ్గించుకోండి.. బంగారం కొనకండి.." అంటూ దేశ ప్రజలకు, ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలకు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన తాజా పిలుపు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు, ఆందోళనకు దారితీసింది. సామాజిక మాధ్యమాలలో సామాన్యులు అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ నిజంగానే ప్రమాదంలో ఉన్నదా? పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ మండిపోనున్నాయా? మరో ఆర్థిక కుదిపు ముంచుకొస్తోన్నదా? అనే ప్రశ్నలు ప్రజలలో ఈ అయోమయం నెలకొనడం సహజమే. ఎందుకంటే, కేవలం కొన్ని వారాల కిందట ముగిసిన ఎన్నికల ప్రచారంలో మన రాజకీయ నాయకులు చెప్పిన మాటలు వేరు. "అంతా బాగుంది.. దేశం దూసుకుపోతోంది.. వికసిత భారత్ మార్గంలో పయనిస్తున్నాం" అంటూ అజేయమైన ఆర్థికశక్తిగా దేశాన్ని ప్రొజెక్ట్ చేశారు. మరి ఎన్నికలు ముగియగానే రాత్రికి రాత్రే ఈ పొదుపు మంత్రాలు, హెచ్చరికలు ఎందుకు మొదలయ్యాయి? పెట్రోల్, డీజీల్, సీఎన్‌జీ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
పశ్చిమాసియా సంక్షోభం గరిష్ట స్థాయికి చేరి, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ.. గత నెల ఎన్నికల ప్రచారంలో ఏ ఒక్క నాయకుడూ పొదుపు గురించి మాట్లాడలేదు. హెలికాప్టర్లలో చక్కర్లు కొట్టడం, భారీ రోడ్‌షోలతో నగరాలను స్తంభింపజేయడం, ఓటర్లను ఆకట్టుకోవడానికి ఉచితాల వర్షం కురిపించడంలో అన్నిపార్టీలూ పోటీ పడ్డాయి. కానీ ఇప్పుడు హఠాత్తుగా సామాన్యుడిని మాత్రం 'బంగారం కొనకండి' అని శాసిస్తున్నారు. సరే, విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి బంగారం దిగుమతులు తగ్గించడం మంచిదే కావచ్చు. కానీ, ప్రతి కొన్ని నెలలకూ దేశంలోని రాజకీయ, వ్యాపార ప్రముఖుల ఇళ్లలో వందల కోట్ల ఖర్చుతో, వజ్రాలు, బంగారు ఆభరణాల తళతళల మధ్య జరిగే విలాసవంతమైన వివాహ వేడుకల సంగతేంటి? స్టాక్ మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇటీవల కొందరు సీనియర్ రాజకీయ నాయకులే భారీగా బంగారు ఆస్తులలో పెట్టుబడులు పెట్టారు. అంటే, సామాన్యుడికి గోల్డ్ కంట్రోల్.. ఉన్నత వర్గాలకు మాత్రం అపరిమిత వైభోగమా? ఈ ద్వంద్వ నీతిని చూసే ప్రజలు అడుగుతున్నారు—"పొదుపు మంత్రం కేవలం సామాన్యులకేనా?"
ప్రధాని మోడీ పొదుపు గురించి మాట్లాడిన రోజే జామ్‌నగర్, వడోదరలలో భారీ రోడ్‌షోలు నిర్వహించారు. అక్కడ ఇంధన పొదుపు అనే మాటే రాలేదు. అంటే, రాజకీయం ఎప్పటిలాగే విలాసవంతమైన ప్రదర్శనలతో సాగిపోవచ్చు.. కానీ త్యాగాలు మాత్రం పౌరుడే చేయాలా? ప్రధాని తన కాన్వాయ్ సైజును తగ్గించారని, కొందరు మంత్రులు దాన్ని అనుసరిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. వీఐపీ సంస్కృతిని తగ్గించే ఏ ప్రయత్నమైనా అభినందనీయమే. కానీ, ఇది నిజమైన సంస్కరణా లేక కేవలం టీవీ కెమెరాల కోసం, ప్రజల దృష్టి కోసం చేస్తున్న తాత్కాలిక ప్రదర్శనలా? ఎందుకంటే పాత అలవాట్లు అంత త్వరగా పోవు. ఇదే వారంలో బిహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఏకంగా 22 కార్ల కాన్వాయ్‌తో ప్రయాణించడం కనిపించింది. మధ్యప్రదేశ్‌లో ఒక బీజేపీ నాయకుడు తనకు టెక్స్ట్‌బుక్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పదవి వస్తే.. ప్రజా సేవకుడిగా భావించాల్సింది పోయి, ఏదో రాజుగారి పట్టాభిషేకం తరహాలో భోపాల్ నుండి ఇండోర్ వరకు భారీ వాహన శ్రేణితో హల్చల్ చేశారు.
మరోవైపు, దేశ అగ్రశ్రేణి అథ్లెట్ల క్రీడా సౌకర్యాల కోసం కేటాయించిన నిధులను, ఉన్నతాధికారులు తమ విలాసవంతమైన నివాస కాలనీల కోసం మళ్లించారనే పచ్చి నిజం రీసెంట్‌గా వెలుగులోకి వచ్చింది. క్రీడాకారులకు వనరులు లేవంటారు, ప్రజలను త్యాగాలు చేయమంటారు.. కానీ వ్యవస్థ లోపల ఉన్న అధికార వర్గాల విలాసాలకు మాత్రం ఎలాంటి కొరతా ఉండదు. పార్లమెంట్‌లో ఉంచిన గణాంకాల ప్రకారం.. 2015 నుండి 2025 మధ్య ప్రధాని విదేశీ పర్యటనలకే ప్రభుత్వ ఖజానా నుండి రూ. 760 కోట్లు ఖర్చయ్యాయి. దౌత్యం కోసం ప్రధాని ప్రయాణించాల్సిందే, అందులో తప్పులేదు. కానీ సమస్య ఒక్క ప్రధానితోనే ముగిసిపోదు. అన్ని పార్టీల రాజకీయ నాయకులు, సీనియర్ బ్యూరోక్రాట్లు నిరంతరం బిజినెస్ క్లాస్ ప్రయాణాలు, లగ్జరీ హోటళ్లు, అధికారిక పర్యటనల పేరిట విహారయాత్రలు చేస్తూ సామాన్యుడు కలగనలేని జీవితాన్ని ట్యాక్స్ పేయర్స్ డబ్బుతో ఎంజాయ్ చేస్తున్నారు.
దశాబ్ద కాలంగా సామాన్యుడు ఒక విధేయ సమాజంలా ప్రభుత్వం చెప్పిన ప్రతిదానికీ త్యాగం చేస్తూనే ఉన్నాడు. నోట్ల రద్దు సమయంలో నల్లధనం అంతమైపోతుందని గంటల తరబడి ఏటీఎంల క్యూలలో నిలబడ్డాడు. కానీ పదేళ్ల తర్వాత చూస్తే, మార్కెట్లో మునుపటికంటే ఎక్కువ నగదు చలామణిలో ఉంది. నష్టపోయింది మాత్రం చిన్న వ్యాపారులు, అసంఘటిత రంగ కార్మికులు. ఆ తర్వాత 2020లో కొన్ని గంటల ముందస్తు నోటీసుతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. లక్షలాది మంది చిన్న వ్యాపారాలు మూతపడ్డాయి, వలస కూలీల జీవితాలు రోడ్డున పడ్డాయి. కానీ మహమ్మారి తర్వాత కార్పొరేట్ దిగ్గజాల లాభాలు, బిలియనీర్ల సంపద మాత్రం రాకెట్ వేగంతో పెరిగాయి. ఈ పరిణామాలన్నీ చూశాక సామాన్యుడికి ఒకటే అనిపిస్తోంది—వ్యవస్థ కేవలం ఒకే ఒక సూత్రంపై నడుస్తోంది: "లాభాలను ప్రైవేటీకరించు.. నష్టాలను సామాజికీకరించు" .
ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడి చాలీ ధరలు పెరుగుతున్నాయని మళ్లీ మనల్ని బెల్టులు బిగించుకోమంటున్నారు. మరి గతంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పతనమైనప్పుడు ఆ లాభాన్ని భారతీయ వినియోగదారుడికి ఎందుకు బదిలీ చేయలేదు? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్ డ్యూటీలు, పన్నులు పెంచి లక్షల కోట్లు వసూలు చేశాయి తప్ప రిటైల్ ధరలు తగ్గించలేదు. అంటే, అంతర్జాతీయంగా ధరలు తగ్గితే లాభం ప్రభుత్వాలది.. ధరలు పెరిగితే భారం సామాన్యుడిది! ఇక్కడే ప్రభుత్వాలు ప్రజలకు నీతులు చెప్పే నైతిక హక్కును కోల్పోతున్నాయి. ఎన్నికల కోసం ప్రభుత్వ ఖజానాను ఉచితాలు, రుణమాఫీలు, సబ్సిడీల రూపంలో ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తూ, ఓట్ల కోసం బిడ్డింగ్ వార్ నడుపుతారు. ప్రచారం ముగియగానే పాలకులకు పొదుపు మంత్రం గుర్తొస్తుంది. దీనినే హిందీలో ఒక సామెతగా చెప్తారు: "నేతా మస్త్.. జనతా త్రస్త్" (పాలకులు ఉల్లాసంగా.. ప్రజలు విచారంగా!).
ప్రజా జీవితంలో ప్రతీకలు ముఖ్యం. ప్రధాని గనుక వీఐపీ సంస్కృతిని తగ్గించి నిజాయితీగా పొదుపును పాటించాలనుకుంటే అది మంచి సంకేతమే. కానీ నిజమైన పరీక్ష ఎక్కడంటే.. ఇది కేవలం వార్తల్లో హెడ్‌లైన్స్ కోసం చేసే ప్రదర్శనగా మిగిలిపోతుందా లేక ప్రభుత్వాల సంస్థాగత ప్రవర్తనగా మారుతుందా? మంత్రులు తమ ప్రత్యేక అధికారాలను వదులుకుంటారా? బ్యూరోక్రాట్లు లగ్జరీ ప్రయాణాలు తగ్గిస్తారా? ప్రభుత్వాల పబ్లిసిటీ ఖర్చులు తగ్గుతాయా?
భారతదేశ ప్రజలు దేశం కోసం త్యాగాలు చేయడానికి ఎన్నడూ వెనకాడలేదు. 1960ల నాటి ఆహార సంక్షోభంలో మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి దేశ ప్రజలను వారానికి ఒక పూట ఉపవాసం ఉండమని కోరినప్పుడు దేశమంతా ఆయన మాట విన్నది. ఎందుకంటే, శాస్త్రి గారి వ్యక్తిగత జీవితం అంత నిరాడంబరంగా ఉండేది. ఆయనకు ఆ 'విశ్వసనీయత' (Credibility) ఉంది. ఆ నమ్మకం కేవలం స్లోగన్ల ద్వారా రాదు, మీ వ్యక్తిగత ప్రవర్తన ద్వారా వస్తుంది. "మినిమం గవర్నమెంట్.. మాగ్జిమం గవర్నెన్స్" వంటి ఆకర్షణీయమైన వన్‌లైనర్లు టీవీ స్క్రీన్లకు మాత్రమే పరిమితం కాకూడదు. ప్రభుత్వాలు పొదుపును బోధిస్తే, ముందుగా దాన్ని తాము ఆచరించి చూపాలి. ప్రజాస్వామ్యంలో శక్తిమంతులు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ, సామాన్యులను మాత్రం పొదుపుగా బతకమనడం సమంజసం కాదు. పొదుపు అనేది కేవలం పాలించబడే వారి కోసమే కాదు.. మనల్ని పాలించే వారి నుండి అది మొదలుకావాలి.
No comments:
Post a Comment