- విజయ్ నిర్ణయంపై కనిమొళి సంచలన వ్యాఖ్యలు
- డీఎంకే కోటలో చీలిక?
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్న వేళ, డీఎంకే ఎంపీ కనిమొళి చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కళగం (TVK) ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న తరుణంలో, తమ మిత్రపక్షాల నిర్ణయాలపై ఆమె స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా తమకు సరైనది అనిపించే నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుందని, మిత్రపక్షాల ఎంపికను తాము గౌరవిస్తామని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా డీఎంకే చిరకాల మిత్రపక్షమైన కాంగ్రెస్, విజయ్ పార్టీకి మద్దతు ప్రకటించడంపై కనిమొళి స్పందిస్తూ.. భావజాల ప్రాతిపదికన తాము కలిసి పోరాడామని, గెలుపోటములు సహజమని వ్యాఖ్యానించారు. రాజ్యాంగంపై గౌరవం లేని మతతత్వ శక్తులు లేని కూటమికి మద్దతు ఇస్తామని కాంగ్రెస్ స్పష్టం చేయడం, టీవీకే వైపు మొగ్గు చూపడం గమనార్హం.
మరోవైపు, దశాబ్దాలుగా డీఎంకేకు ఉన్న 'సెక్యులర్' బ్రాండ్‌ను విజయ్ పార్టీ సొంతం చేసుకుంటుందా అన్న ప్రశ్నకు కనిమొళి ఆసక్తికర సమాధానం ఇచ్చారు. తమిళనాడు రాజకీయాల్లోకి మరిన్ని లౌకిక పార్టీలు రావడం సంతోషకరమని, దీనిపై తమకు ఎటువంటి భయం లేదని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో డీఎంకే కేవలం 59 స్థానాలకే పరిమితం కావడం, సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన సొంత నియోజకవర్గంలో ఓడిపోవడం వంటి పరిణామాలపై పార్టీ అంతర్గతంగా సమీక్షించుకుంటుందని తెలిపారు. ప్రజలు మార్పును కోరుకున్నారని, విజయ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని ఆశిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
No comments:
Post a Comment