- ఇంధన ధరల విపరీతంగా పెరగడంతో నిర్ణయం
న్యూఢిల్లీ: విమాన ప్రయాణం చేయాలనుకునే వారికి నిరాశ కలిగించే వార్త. ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) తమ దేశీయ విమాన సర్వీసులను భారీగా తగ్గించుకోవాలని నిర్ణయించింది. అంతర్జాతీయ మార్కెట్లో విమాన ఇంధన (ATF) ధరలు విపరీతంగా పెరిగిపోవడం, నిర్వహణ వ్యయం భారంగా మారడంతో సుమారు 20 నుండి 22 శాతం వరకు దేశీయ విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు బుధవారం సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే నష్టాల్లో నడుస్తున్న ఈ ఎయిర్‌లైన్.. గతంలోనే తమ అంతర్జాతీయ సర్వీసులను కూడా దాదాపు 27 శాతం వరకు తగ్గించుకున్న సంగతి తెలిసిందే. తాజా నిర్ణయంతో దేశీయ రూట్లలో ప్రయాణించే వారికి టికెట్ల లభ్యత తగ్గడమే కాకుండా, విమాన ఛార్జీలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఎయిర్ ఇండియా ప్రస్తుతం వారానికి సగటున 4,400 విమాన సర్వీసులను నడుపుతోంది. ఇందులో దాదాపు 3,600 దేశీయ సర్వీసులు కాగా, మిగిలిన 800 అంతర్జాతీయ సేవలు. జూన్ నుండి ఆగస్టు 2026 మధ్య కాలానికి సంబంధించి కొన్ని ఎంపిక చేసిన అంతర్జాతీయ సర్వీసుల్లో గతంలో ప్రకటించిన మార్పుల కొనసాగింపుగానే, ఇప్పుడు కొన్ని నిర్దిష్ట దేశీయ రూట్లలో కూడా విమానాల ఫ్రీక్వెన్సీని (నడిచే సంఖ్యను) తాత్కాలికంగా క్రమబద్ధీకరిస్తున్నట్లు ఎయిర్ ఇండియా బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఇంధన ధరల నిరంతర పెరుగుదల కారణంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, మార్కెట్ పరిస్థితులు చక్కబడి, డిమాండ్ స్థిరపడిన తర్వాత తిరిగి యథావిధిగా అన్ని సర్వీసులను పునరుద్ధరిస్తామని సంస్థ పేర్కొంది.
ఈ హఠాత్ మార్పుల వల్ల ఇబ్బంది పడే ప్రయాణికులకు తాము అన్నివిధాలా అండగా ఉంటామని ఎయిర్ ఇండియా భరోసా ఇచ్చింది. రద్దయిన విమాన టికెట్లు కలిగిన ప్రయాణికులను ముందస్తుగానే సంప్రదించి, వారిని ఇతర ప్రత్యామ్నాయ విమానాల్లో సర్దుబాటు చేయడం (Re-accommodation) లేదా ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఉచితంగా ప్రయాణ తేదీలను మార్చుకునే అవకాశం కల్పిస్తామని తెలిపింది. ప్రయాణాన్ని పూర్తిగా రద్దు చేసుకోవాలనుకునే వారికి ఎలాంటి కోతలు లేకుండా పూర్తి రీఫండ్ (సొమ్ము వాపస్) అందిస్తామని ఎయిర్ ఇండియా యాజమాన్యం స్పష్టం చేసింది.
No comments:
Post a Comment