- బెంగాల్ గడ్డపై కాషాయ కేతనం
పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. కోల్‌కతాలోని చరిత్రాత్మక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో జనసంద్రం మధ్య సువేందు అధికారి రాష్ట్ర తొమ్మిదవ ముఖ్యమంత్రిగా, భారతీయ జనతా పార్టీ తరపున తొలి సీఎంగా శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వంటి అగ్రనేతలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 20 మంది బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో ఈ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. గవర్నర్ ఆర్.ఎన్. రవి ఆయనతో పదవీ ప్రమాణం చేయించగా, సువేందుతో పాటు పలువురు మంత్రులు కూడా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో దశాబ్దాల తరబడి సాగిన ఇతర పార్టీల పాలనకు చరమగీతం పాడుతూ, 'సోనార్ బంగ్లా' (బంగారు బెంగాల్) నిర్మాణమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా సువేందు అధికారి ఉద్ఘాటించారు.
ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించేందుకు బెంగాల్ నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలు , కార్యకర్తలు తరలిరావడంతో కోల్‌కతా నగరం కాషాయమయమైంది. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. బెంగాల్ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని, కేంద్ర ప్రభుత్వం కొత్త ముఖ్యమంత్రికి పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. సువేందు అధికారి కేవలం ఒక నేతగా కాకుండా, క్షేత్రస్థాయి కార్యకర్తగా ఎదిగి నేడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం విశేషం. గ్రామీణ నేపథ్యం ఉన్న నేత ఐదు దశాబ్దాల తర్వాత ముఖ్యమంత్రి కావడం బెంగాల్ రాజకీయాల్లో ఒక పెద్ద మార్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకారంతో బెంగాల్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్ పాలన ప్రారంభమైందని, ఇకపై రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తామని నూతన ప్రభుత్వం స్పష్టం చేసింది.
No comments:
Post a Comment