- సైబర్ నేరాల గుట్టు విప్పిన ఆనంద్ ఆర్‌కే, సుపర్ణ శర్మలకు ప్రతిష్టాత్మక పులిట్జర్ అవార్డు
అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ ప్రకటించిన 2026 పులిట్జర్ పురస్కారాల్లో భారత్‌కు చెందిన ఇలస్ట్రేటర్ ఆనంద్ ఆర్‌కే , ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సుపర్ణ శర్మ విజేతలుగా నిలిచారు. బ్లూమ్‌బెర్గ్ వార్తా సంస్థ కోసం వీరు రూపొందించిన 'trAPPed' అనే వినూత్న ప్రాజెక్టుకు 'ఇలస్ట్రేటెడ్ రిపోర్టింగ్ అండ్ కామెంటరీ' విభాగంలో ఈ అవార్డు దక్కింది. భారత్‌లో ఒక న్యూరాలజిస్ట్‌ను సైబర్ నేరగాళ్లు ఫోన్ ద్వారా 'డిజిటల్ అరెస్ట్' చేసి ఎలా మానసిక చిత్రహింసలకు గురిచేశారనే అంశాన్ని వీరు కళ్లకు కట్టినట్లు వివరించారు. ఈ ప్రాజెక్టులో సుపర్ణ శర్మ తన లోతైన పరిశోధనతో వాస్తవాలను వెలికితీయగా, ఆనంద్ ఆర్‌కే తన అద్భుతమైన చిత్రకళతో (Visual Storytelling) ఆ భయానక పరిస్థితులను పాఠకులకు అర్థమయ్యేలా చిత్రించారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న సైబర్ మోసాలు, డిజిటల్ నిఘా , సామాన్యులను ట్రాప్ చేసే స్కామ్ ఫ్యాక్టరీల గుట్టును రట్టు చేయడంలో ఈ కథనం కీలకపాత్ర పోషించిందని పులిట్జర్ బోర్డు ప్రశంసించింది. ఈ అవార్డును వీరు బ్లూమ్‌బెర్గ్ ప్రతినిధి నటాలీ ఒబికో పియర్సన్‌తో కలిసి పంచుకోనున్నారు. అలాగే ఇంటర్నేషనల్ రిపోర్టింగ్ విభాగంలో అనిరుద్ధ ఘోషల్ కూడా విజేతగా నిలవడం విశేషం. జర్నలిజం, సాహిత్యం , సంగీత రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఇచ్చే ఈ పురస్కారం, భారతీయ జర్నలిస్టుల ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో మరోసారి చాటిచెప్పింది. సాంకేతికతను వాడుకుని సాగుతున్న ఆధునిక నేరాల పట్ల ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో ఈ 'ఆర్ట్ రిపోర్టింగ్' ప్రాజెక్టు ఒక దిక్సూచిగా నిలిచింది.
No comments:
Post a Comment