Friday, 31 October 2025

దీపు.. నాతో మాట్లాడుతూనే ఉండు ప్లీజ్‌: జెమీమా రోడ్రిగ్స్‌






 మహిళల వన్డే ప్రపంచ కప్ సెమీస్‌లో ఆసీస్‌పై భారత ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్‌ సంచలన ఇన్నింగ్స్ ఆడింది. భారీ లక్ష్య ఛేదనలో జెమీమా కీలక పాత్ర పోషించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ (89) ఔటైనా సరే.. చివరివరకూ క్రీజ్‌లో ఉండి మ్యాచ్‌ను గెలిపించింది. దీంతో మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకున్న జెమీమా వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక డ్రెస్సింగ్‌ రూమ్‌లోనూ జెమీమా చేసిన వ్యాఖ్యలు ఆకట్టుకున్నాయి. ఒక దశలో తాను బ్యాటింగ్‌ చేయడం కూడా కష్టంగా మారిందని.. ఆ సమయంలో సహచర బ్యాటర్‌ దీప్తి శర్మను మాట్లాడిస్తూనే ఉండమని చెప్పినట్లు జెమీమా గుర్తు చేసుకుంది.‘‘నేను 85 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ఉన్నప్పుడు అప్పటికే చాలా అలసిపోయా. దీంతో దీప్తిశర్మకు ఒకటే చెప్పా. ‘ప్లీజ్‌ దీపు.. నాతో మాట్లాడుతూనే ఉండు. లేకపోతే నేను స్కోర్‌ చేయలేను’ అని అడిగా. అక్కడినుంచి ప్రతి బంతికి దీప్తి వచ్చి నాతో మాట్లాడేది. నన్ను ఉత్సాహపరిచేది. నా పరుగు కోసం తన వికెట్‌ను కూడా త్యాగం చేసింది. పెవిలియన్‌కు వెళ్తూ కూడా ‘ఏం కంగారు వద్దు. నువ్వు మ్యాచ్‌ను ఫినిష్ చేయాలి’ అని చెప్పింది. ఇలాంటి పార్టనర్‌షిప్‌లు లేకపోతే భారీ లక్ష్యాన్ని ఛేదించడం చాలా కష్టం. దీప్తి, రిచా, అమన్‌ ఆఖర్లో ఆడిన ఇన్నింగ్స్‌ కూడా చాలా కీలకం. హర్మన్‌తో కలిసి గొప్ప భాగస్వామ్యం నిర్మించడం బాగుంది. గతంలో వికెట్లు పడిపోయే కొద్దీ మ్యాచ్‌ను చేజార్చుకొనేవాళ్లం. ఇప్పుడు టీమ్‌ఇండియా మారిపోయిందని నిరూపించాం’’ అని జెమీమా వ్యాఖ్యానించింది.


మన బాధ్యత పూర్తి కాలేదు..

‘‘ఆస్ట్రేలియాపై సెమీస్‌లో విజయం సాధించాం. అయితే, ఇక్కడితో మన పని పూర్తి కాలేదు. మరో మ్యాచ్‌లో విజృంభించాలి. అప్పుడే సగర్వంగా టైటిల్‌ను అందుకోగలం. అప్పటివరకు మనం విశ్రమించకూడదు’’ అని జెమీమా వెల్లడించింది. ఆదివారం జరిగే మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో టీమ్‌ఇండియా తలపడనుంది.

అద్భుతానికి అడుగు దూరంలో.. టీమిండియా!



సెమీస్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆసీస్‌ నుమట్టికరిపించిన టీమిండియా..  ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనల్‌లో కొండంత లక్ష్యాన్ని (339) ఛేదించి.., సౌతాఫ్రికాతో తుదిపోరుకు సిద్ధమైంది. టోర్నీలో ప్రారంభంలో తడబాటుకు గురైనా.. తర్వాత తేరుకొని.. ఆఖరుకు ఫైనల్‌కు చేరుకున్న టీమిండియా ప్రస్థానం థ్రిల్లర్‌ సినిమాను తలపించేలా ఉన్నది. ఇక క్లైమాక్స్‌లో కప్‌ కొట్టి.. శుభం కార్డు వేయడమే తరువాయి.


ఉత్సాహంతో ఒకరు.. ఆనందంతో మరొకరు!

మహిళల ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆదివారం (నవంబరు 2) నవీముంబయి వేదికగా జరగనుంది. తుదిపోరులో  టీమిండియా.. సౌతాఫ్రికాతో తలపడనుంది. సెమీఫైనల్‌లో ఆసీస్‌ను ఓడించిన  ఉత్సాహంతో  టీమిండియా.. ఇంగ్లాండ్‌పై 125 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన ఆనందంలో సౌతాఫ్రికా ఫైనల్‌లోకి అడుగుపెట్టాయి. అయితే ఈ రెండు జట్లలో ఏది గెలిచినా.. ఆ టీమ్‌ తొలిసారి వన్డే వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకున్నట్లవుతుంది. 


టీమిండియాదే పై చేయి!


టీమిండియా, సౌతాఫ్రికా జట్లు వన్డేల్లో ఇప్పటివరకు 34 సార్లు తలపడ్డాయి. టీమిండియా 20 సార్లు విజయం సాధిస్తే, సౌతాఫ్రికా 13 సార్లు గెలిచింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. అయితే.. ప్రస్తుత వరల్డ్‌ కప్‌లో (2025) అక్టోబర్‌ 9న విశాఖపట్నం వేదికగా ఇరుజట్లకు జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ పోరులో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 49.5 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది.  సౌతాఫ్రికా జట్టు 48.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. 

అలాంటి ఘటనతో ఇండస్ట్రీకి చెడ్డపేరు... ‘కరూర్ తొక్కిసలాట’పై అజిత్

Thursday, 30 October 2025

‘రీల్స్‌ కాదు.. రన్స్‌ చెయ్‌’.. బ్యాట్‌తోనే ట్రోలర్లపై రోడ్రిగ్స్‌ రోరింగ్‌!

 


‘‘ఎప్పుడూ చూసినా మైదానంలో తిరుగుతూ ఉంటావు. రీల్స్‌ చేసుకుంటూ ఉంటావు. ఆడేదెప్పుడు? అనవసరంగా జట్టులో ఉంచారు’’.. ఇవీ జెమీమా రోడ్రిగ్స్‌ గురించి సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్‌. ఎప్పుడూ నవ్వుతూ ఉండే రోడ్రిగ్స్‌ ఈ విజయం అనంతరం కన్నీళ్లు పెట్టుకుంది. తన సత్తా ఏంటో క్రికెట్ ప్రపంచానికి చాటి చెప్పింది.వన్డే ప్రపంచకప్ సెమీస్‌లో ఆసీస్‌పై భారత్‌ అద్వితీయమైన విజయం సాధించింది. అసాధ్యమనుకున్న టార్గెట్‌ను ఛేదించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇదంతా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌తోపాటు జెమీమా రోడ్రిగ్స్‌ చలవే. మరీ ముఖ్యంగా ఆఖరివరకూ క్రీజ్‌లో ఉండి జట్టును గెలిపించిన రోడ్రిగ్స్‌ ఇన్నింగ్స్‌ ఎప్పటికీ మరిచిపోలేం. ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోకుండా సెమీస్‌కు చేరిన ఆసీస్‌పై 127 పరుగులతో జెమీమా అజేయంగా నిలిచింది. రోడ్రిగ్స్‌ రోరింగ్‌ అంటూ అభిమానులు పిలుచుకోవడం వెనక చాలా శ్రమ ఉంది. ఈ గెలుపుతో అప్పటివరకూ ఆమెలో దాగి ఉన్న కన్నీళ్లన్నీ జలజలా బయటకు వచ్చేశాయి. వద్దన్నవారే జట్టులో ఉండాల్సిందే అనే స్థాయికి రోడ్రిగ్స్‌ చేరుకుంది.

ఆ కన్నీళ్లలో..
 సాధారణంగా ప్రపంచ కప్‌ గెలిస్తేనో లేకపోతే ఏదైనా భారీ టోర్నీలో విజయం సాధిస్తేనో భావోద్వేగానికి గురికావడం సహజం. కానీ, టీమ్‌ఇండియా సెమీస్‌లో ఆసీస్‌పై గెలవడంతోనే సంబరాలు అంబరాన్నంటాయి. శతకంతో జట్టును గెలిపించిన జెమీమా రోడ్రిగ్స్‌ అయితే మైదానమంతా కలయతిరుగుతూ కన్నీళ్లు పెట్టుకుంది. సెంచరీ చేసిన తర్వాత కూడా సంబరాలు చేసుకోని ఆమె.. మ్యాచ్ విజయం అనంతరం అభిమానులకు అభివాదం చేస్తూ సందడి చేసింది. నవీ ముంబయి తన హోం గ్రౌండ్‌ కావడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇలా చేయడానికి మరో కారణం ఆమెపై వచ్చిన ట్రోలింగ్‌కు తన బ్యాటింగే సమాధానం చెప్పిందనే ఆత్మవిశ్వాసమని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం.
రీల్స్‌ చేస్తుంది.. గిటార్‌ అంటే ప్రాణం 
క్రికెట్‌లోనే కాకుండా జెమీమాకు ఇతర ఆటల్లోనూ ప్రావీణ్యం ఉంది. హాకీ, ఫుట్‌బాల్, బాస్కెట్‌ బాల్ కూడా ఆడుతుంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే క్రికెటర్. రీల్స్‌ చేస్తూ సందడిగా ఉంటుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌కు దాదాపు 1.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక గిటార్‌ వాయిస్తూ పాటలు పాడటం ఆమెకెంతో ఇష్టం. ఇన్‌స్టా వీడియోలు చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. అయితే, ఇవన్నీ ఆమెపై ఓ రకంగా ప్రతికూలంగా మారడానికి కారణం. ఏదైనా మ్యాచ్‌లో విఫలమైతే వెంటనే జెమీమాను టార్గెట్‌ చేసేవారికి ఈ రీల్స్‌ ఆయుధంగా మారేది. ఎప్పుడు చూసినా రీల్స్, వీడియోలు చేసుకోవడం కాదు ఆటపై దృష్టి పెట్టాలంటూ ఉచిత సలహాలు ఇచ్చేవారు.

అత్యుత్తమ ఫీల్డర్‌ కూడానూ.. 
జెమీమా రోడ్రిగ్స్‌ 2018లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. సన్నగా రివటాలా ఉండే జెమీమా మైదానంలో చాలా చురుగ్గా ఉంటుంది. అత్యుత్తమ ఫీల్డింగ్‌ నైపుణ్యాలతో జెమీమా రోడ్రిగ్స్‌ ‘జాంటీ రోడ్స్‌’ను గుర్తుకుతెచ్చేలా ప్రదర్శన ఇస్తుంటుంది. అందుకు తాజా ఉదాహరణ ఆసీస్‌తో సెమీస్‌. తాలియా మెక్‌గ్రాత్‌ను ఔట్‌ చేసిన తీరు అద్భుతం. ఇక బంతిని ఆపడంలో ఆసీస్‌కు దీటుగా స్పందించింది. అసలు జట్టులో స్థానం ఉంటుందో, లేదో అనే పరిస్థితి నుంచి తన ప్లేస్‌ను సుస్థిరం చేసుకొనే స్థాయికి చేరుకుందనడంలో సందేహం లేదు.

కోటి ప్రభుత్వ ఉద్యోగాలు.. కోటి మంది లఖ్‌పతి దీదీలు: బిహార్‌లో ఎన్డీయే మ్యానిఫెస్టో

 


పట్నా: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ మరికొన్ని రోజుల్లో జరగనుంది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచార జోరు పెంచాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా బిహార్‌ అధికార ఎన్డీయే కూటమి శుక్రవారం ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. వలస కార్మికులను ఆకట్టుకునేలా రాష్ట్రంలో కోటి ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టిస్తామని హామీ ఇచ్చింది.పట్నాలో ఈ ఉదయం జరిగిన కార్యక్రమంలో ‘సంకల్ప పత్ర’ పేరుతో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ ఈ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఎల్జేపీ (రాంవిలాస్‌) పార్టీ చీఫ్‌ చిరాగ్‌ పాసవాన్‌ కూడా పాల్గొన్నారు.
మ్యానిఫెస్టోలోని ముఖ్యాంశాలివే.. రాష్ట్రంలోని యువతకు కోటి ప్రభుత్వ ఉద్యోగాలు. ప్రతి జిల్లాలో మెగా నైపుణ్య కేంద్రాల ఏర్పాటు కేజీ టు పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్య ఏడాదికి రూ.లక్ష వరకు సంపాదించేలా కోటి మంది మహిళలను ‘లఖ్‌పతి దీదీ’లుగా మార్చడమే లక్ష్యం. మహిళలు వ్యాపారాలు ప్రారంభించేందుకు రూ.2 లక్షల వరకు ఆర్థిక సాయం. ఈబీసీలకు రూ.10 లక్షల వరకు ఆర్థిక ప్రోత్సాహకాలు. రాష్ట్రంలో సామాజిక-ఆర్థిక పరిస్థితులను అంచనా వేసేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు కర్పూరీ ఠాకూర్‌ కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ.9వేలు పెట్టుబడి సాయం. మూడు విడతల్లో ఈ మొత్తం చెల్లింపు బిహార్‌లో ఏడు ఎక్స్‌ప్రెస్‌వేలు, నాలుగు నగరాల్లో మెట్రో రైలు సేవల ఏర్పాటు. 5 ఏళ్లలో రూ.50 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా ఇండస్ట్రియల్‌ పార్కుల ఏర్పాటు ప్రతి జిల్లాలో తయారీ యూనిట్లు, మెడికల్‌ కాలేజీల ఏర్పాటు గిగ్‌ వర్కర్లు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం

సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ 150వ జయంతి.. నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని

 


భారత మాజీ ఉప ప్రధాని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ 150వ జయంతి నేడు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నివాళులర్పించారు. గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహం వద్ద ప్రధాని మోడీ పటేల్‌ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పటేల్‌ విగ్రహంపై హెలికాప్టర్‌ నుంచి పూలవర్షం కురిసింది. అనంతరం ఏక్తా దివస్‌ను పురస్కరించుకొని ప్రత్యేక పరేడ్‌ ఏర్పాటు చేశారు. ఇందులో సైనిక దళాల కవాతు ఆకట్టుకుంది.సైనిక దళాల నుంచి గౌరవవందనం స్వీకరించిన మోదీ.. అనంతరం వారికి సెల్యూట్‌ చేశారు. సాయుధ దళాలు, స్థానికులతో కలిపి ప్రధాని ఐక్యతా ప్రమాణం చేశారు. సైనిక బలగాల విన్యాసాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే గుజరాత్‌, జమ్మూకశ్మీర్‌, అండమాన్‌ నికోబార్‌, మణిపుర్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరాఖండ్‌, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఆసీస్‌పై శతకాల మోత.. చరిత్రలో నిలిచే ఇన్నింగ్స్‌లు!



బలవంతుడిని బలంతోనే కాదు.. బుద్ధితోనూ కొడితేనే విజయం వరిస్తుంది. మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భారత్‌ సరిగ్గా అదే చేసింది. ఒక్కో పరుగు జోడిస్తూ గెలుపు రుచి చూసింది. ఆస్ట్రేలియాను సెమీస్‌లో ఓడించి ఫైనల్‌కు చేరడం ఇది రెండోసారి. అప్పుడు హర్మన్‌ ప్రీత్‌ కౌర్ ఆ బాధ్యత తీసుకోగా.. ఈసారి జెమీమా రోడ్రిగ్స్‌ చివరివరకూ ఉండి జట్టును విజయతీరాలకు చేర్చింది. ఈ రెండు ఇన్నింగ్స్‌లు చరిత్రను సృష్టించినవే.అప్పుడు అలా.. అది 2017 వన్డే ప్రపంచ కప్‌. భారత జట్టుకు సీనియర్‌ హైదరాబాదీ క్రికెటర్ మిథాలీ రాజ్‌. ఆమె సారథి. ప్రస్తుత కెప్టెన్ హర్మన్‌ ప్రీత్‌ కౌర్ కూడా ఎనిమిదేళ్ల అనుభవం కలిగిన క్రికెటర్. ఇక స్మృతి మంధాన, దీప్తి శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చి నాలుగేళ్లు కూడా కాలేదు. కానీ, ఆ టోర్నీలో భారత్‌ టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. మూడో స్థానంతో సెమీస్‌కు చేరుకుంది. అక్కడ ఆస్ట్రేలియా ఎదురైంది. ఓపెనర్లు స్మృతి మంధాన, పూనమ్ రౌత్ త్వరగానే పెవిలియన్‌కు చేరారు. సారథి మిథాలీ భారీ ఇన్నింగ్స్‌ ఆడలేదు. అప్పుడు క్రీజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హర్మన్‌ (115 బంతుల్లో 171*) ప్రత్యర్థి బౌలర్లపై సునామీలా విరుచుకుపడింది. హరికేన్‌ కపిల్‌దేవ్‌లా విజృంభించింది. దీప్తి శర్మ, వేద కృష్ణమూర్తిలతో కలిసి మంచి భాగస్వామ్యాలను నమోదు చేసి భారత్‌కు అద్భుత స్కోరును అందించింది. తొలి 25 ఓవర్ల ఆటను చూసిన వారెవరూ భారత్ 281 పరుగులు చేస్తుందని ఊహించి ఉండరు. అయితే, మ్యాచ్‌ 50 ఓవర్లు కాదు సుమా.. 42 ఓవర్ల ఆటే. వర్షం కారణంగా మ్యాచ్‌ను కుదించారు. ఆమె ఇన్నింగ్స్‌లో ఏకంగా 20 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయంటే ఆ దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంటే, ఆఖరి 17 ఓవర్లలో భారత్ 180 పరుగులు చేసిందంటే దానికి కారణం హర్మన్‌. క్రికెట్ పుస్తకంలోని అన్ని షాట్లను ప్రయోగించింది. లాంగాఫ్‌ మీదుగా బౌండరీని దాటించడం ఆమెకెంతో ఇష్టం. మైదానం నలువైపులా షాట్లతో అలరించింది. ఇక బౌలింగ్‌లో అదరగొట్టిన భారత్ ఆసీస్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.ఇప్పుడు జెమీమాతో కలిసి.. 2025.. సేమ్‌ ప్రత్యర్థి. ఈసారి అజేయంగా సెమీస్‌కు చేరుకున్న ఆసీస్‌ను ఓడించడం కష్టమని చాలామంది అభిప్రాయపడ్డారు. ఆ జట్టు తొలుత బ్యాటింగ్‌ చేసినప్పుడు కూడా అదే అనుకొన్నారు. స్కోరు బోర్డుపై 339 పరుగుల లక్ష్యం ఉందనగానే.. కొంతమంది టీవీలు కట్టేసిన వారూ లేకపోలేదేమో. ఓపెనర్లు 60 పరుగుల్లోపే పెవిలియన్‌కు చేరారు. అప్పుడు కూడా ఇంకొందరు తమ సెటప్ బాక్స్‌లను ఆపేసి ఉంటారు. కానీ, జెమీమా రోడ్రిగ్స్‌ - హర్మన్‌ ప్రీత్ కౌర్ జోడీ ఒక్కో పరుగును జోడిస్తూ వెళ్లారు. దాదాపు 156 బంతుల్లో 167 పరుగులు జోడించి విజయానికి బాట వేశారు. జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) కాస్త డల్‌ అయినప్పుడు హర్మన్‌ దూకుడు ప్రదర్శించింది. ఈ క్రమంలోనే 89 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరింది. కానీ, చివరివరకూ పట్టుదల ప్రదర్శించిన జెమీమా (127*) మాత్రం వికెట్ ఇవ్వను.. విజయం వదలను అన్నట్లుగా ఆడింది. మధ్యలో మూడుసార్లు జీవదానం లభించడంతో సద్వినియోగం చేసుకుంది. ఆమె ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్స్‌ లేకపోవడం గమనార్హం. మొత్తం 14 ఫోర్లను బాదిన జెమీమా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది. మ్యాచ్‌ అనంతరం ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న తీరు ప్రతిఒక్కరినీ కదిలించింది.ఆస్ట్రేలియా బలమైన టీమ్‌ మాత్రమే కాదు.. నాకౌట్‌లో తమ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తుంది. దానికి ఉదాహరణ ప్రస్తుతం వన్డే వరల్డ్‌ కప్‌. బంతిని ఏమాత్రం వదలకూడదనే పట్టుదల చూసి మిగతా టీమ్‌లు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే, కీలక సమయాల్లో క్యాచ్‌లు డ్రాప్‌ చేయడంతో ఓటమి తప్పలేదు. దానిని సద్వినియోగం చేసుకున్న భారత్‌ అద్భుత విజయంతో ఫైనల్‌కు దూసుకెళ్లింది.

వాడని సిమ్ కార్డులను తొలగించుకున్నారా?

Tuesday, 28 October 2025

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు: బహిరంగ సభలతో రంగంలోకి అమిత్ షా, రాహుల్ గాంధీ

 



బిహార్‌లో ఎన్నికల వేడి హీటెక్కింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం (అక్టోబర్ 29, 2025) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరుసగా ఎన్డీఏ, ఇండియా బ్లాక్ అభ్యర్థుల తరపున బహిరంగసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. నేషనల్‌ మీడియాలో కథనాల ప్రకారం... అమిత్ షా దర్భంగా, సమస్తిపూర్, బేగుసరాయ్‌లో ఎన్డీఏ అభ్యర్థుల మద్దతుగా సమావేశాలను నిర్వహించనున్నారు. అదే సమయంలో రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌తో పాటు ఇండియా బ్లాక్ నాయకులతో కలిసి ముజఫర్‌పూర్‌, దర్భంగా ప్రాంతాల్లో రెండు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇకపోతే, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా బిహార్‌లో ఎన్డీఏ అభ్యర్థుల మద్దతుగా ప్రచారసభలను నిర్వహించనున్నారు.


తేజస్వీ యాదవ్‌పై నిత్యానంద్ రాయ్ విమర్శలు

కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ మహాగఠ్‌బంధన్ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్‌ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయనను “అవినీతిపరుడు”గా అభివర్ణించారు.

“నేడు ‘ఘమండియా’ కూటమి తమ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ‘మేము బిహార్‌ను అవినీతి నుంచి విముక్తం చేస్తాము’  తేజస్వీ యాదవ్ అంటున్నారు. తానే అవినీతి కేసుల్లో నిందితుడు, అనేక స్కాంలలో పాల్గొన్న వ్యక్తి బిహార్‌ను అవినీతి నుంచి ఎలా విముక్తి చేస్తాడని ప్రజలు ప్రశ్నించాలి,” అని రాయ్ వ్యాఖ్యానించారు.


రాహుల్ గాంధీ బిహార్ పర్యటన

కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బిహార్ పర్యటనలో భాగంగా తేజస్వీ యాదవ్‌తో ఉమ్మడి ప్రజాసభను ఉద్దేశించి మాట్లాడనున్నారు. అలాగే ఆయన దర్భంగా ప్రాంతంలో కూడా ఓ బహిరంగ సభను నిర్వహించనున్నారు.

ఇకపై ట్రూకాలర్ అవసరం లేకపోవచ్చా?



  •  కాల్ చేసిన వ్యక్తి అసలు పేరు డిఫాల్ట్‌గా చూపించేందుకు సిఫార్సు


టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్‌) మంగళవారం ప్రకటించిన ప్రకారం.. టెలికాం శాఖ (డీఓటీ)తో కలిసి కాల్ చేసిన వ్యక్తి అసలు పేరు. కనెక్షన్ కోసం ఉపయోగించిన గుర్తింపు ప్రకారం కాల్ అందుకునే వ్యక్తికి ఆటోమేటిక్‌గా (డిఫాల్ట్‌గా) చూపించేందుకు అంగీకరించింది. 2024 ఫిబ్రవరిలో జారీ చేసిన ‘టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్స్‌లో కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ ( సీఎన్‌ఏపీ) పరిచయం’పై ట్రాయ్‌ సిఫార్సుల్లో, ఈ సేవను కేవలం కాల్ అందుకునే సబ్ స్క్రైబర్‌ అభ్యర్థన మేరకే ప్రారంభించాలని సూచించింది. అయితే, డీఓటీ ట్రాయ్‌కి తిరిగి పంపిన సూచనలో మార్పు కోరుతూ, సీఎన్‌ఏపీ సేవను డిఫాల్ట్‌గా అందుబాటులో ఉంచి, అవసరం లేని వారు దానిని డిసేబుల్ చేసుకునే అవకాశం ఇవ్వాలని పేర్కొంది.


ప్రపంచవ్యాప్తంగా సీఎన్‌ఏపీ సేవను ప్రారంభించే ప్రయత్నం మోసపూరిత కాల్స్‌ను నివారించడం, “డిజిటల్ అరెస్ట్”, ఆర్థిక మోసాలు వంటి సైబర్ నేరాలను అరికట్టడమే లక్ష్యంగా ప్రారంభించబడింది.


డీఓటీ, ట్రాయ్‌,సిఫార్సులను అంగీకరించే అవకాశం ఉంది, అందులో కాలింగ్ లైన్ ఐడెంటిఫికేషన్ రిస్ట్రిక్షన్ (సీఎల్‌ఐఆర్‌) సదుపాయం పొందిన సబ్స్క్రైబర్ల పేరు కాల్ అందుకునే వ్యక్తికి చూపించకూడదని పేర్కొంది. సీఎల్‌ఐఆర్‌ సదుపాయం సాధారణ సబ్స్క్రైబర్లు, కేంద్ర గూఢచారి సంస్థల అధికారులు మరియు ప్రముఖులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.


సాధారణ సబ్స్క్రైబర్ల విషయంలో టెలికాం ఆపరేటర్లు పూర్తి ధృవీకరణ చేసి, చట్ట అమలు సంస్థలకు అవసరమైనప్పుడు సమాచారం అందించేలా ఉండాలి. ఈ సదుపాయం బల్క్ కనెక్షన్లు, కాల్ సెంటర్లు, టెలిమార్కెటర్లకు అందుబాటులో ఉండదు.


ట్రాయ్‌, డీఓటీ రెండూ ఈ సేవను 4G మరియు దాని కంటే అధిక సాంకేతికతలు ఉపయోగించే వినియోగదారులకు డిఫాల్ట్‌గా అందించాలని నిర్ణయించాయి, ఎందుకంటే 2జీ,3జీ వినియోగదారుల కోసం ఈ ప్రక్రియను అమలు చేయడం బ్యాండ్‌విడ్త్ పరిమితుల కారణంగా సాంకేతికంగా కష్టతరమని పేర్కొన్నాయి.

తీరం దాటిన ‘మొంథా’ తుపాను




  • గంటకు 100 కి.మీ. వేగంతో గాలులు


బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర ‘మొంథా’ తుపాను ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ సమీపంలో తీరం దాటే ప్రక్రియను ప్రారంభించిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం రాత్రి తెలిపింది. థాయ్ భాషలో‘మొంథా’ అంటే సువాసన గల పువ్వు అని అర్థం.ఈ తుపాను ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ.. తరువాతి 3-4 గంటల్లో మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ చుట్టుపక్కల ప్రాంతంలో గంటకు 90-100 కి.మీ. గరిష్ట స్థిరమైన గాలుల వేగంతో (110 కి.మీ.కు పెరిగే అవకాశం) తీవ్ర తుపానుగా ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటిందని ఐఎండీ తన తాజా ప్రకటనలో తెలిపింది.


తుపాను ప్రభావం, హెచ్చరికలు


‘మొంథా’ తుపాను ప్రభావంతో కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, తెలంగాణ, దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, కృష్ణా, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్‌ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలలో, అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు, రంపచోడవరం డివిజన్లలో తుపాను ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఈ తుపాను రాష్ట్రంలోని 22 జిల్లాల్లోని 403 మండలాలపై ప్రభావం చూపవచ్చు. ఐఎండీ హెచ్చరికల ప్రకారం.. ఈ తుఫాను వలన లోతట్టు, నీట మునిగిన ప్రాంతాలలో ఉన్న వరి,  కూరగాయల పంటలకు నష్టం కలిగే అవకాశం ఉంది. రైతులు తమ పొలాల నుంచి అదనపు నీటిని వీలైనంత వరకు బయటకు పంపాలని సూచించారు.


ప్రభుత్వ చర్యలు, సంసిద్ధతలు


తుపాను తీవ్రత దృష్ట్యా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన పేర్కొన్న ఏడు జిల్లాలలో మంగళవారం రాత్రి 8.30 నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించింది. ప్రజల భద్రత కోసం వాతావరణ బులెటిన్‌లను తెలుసుకోవాలని, ప్రభుత్వం జారీ చేసే సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసర సమాచార వ్యవస్థ నిరంతరాయంగా కొనసాగించడానికి, 81 వైర్‌లెస్ టవర్లు, 21 పెద్ద దీపాలను (లాంప్‌లను) ఏర్పాటు చేశారు. విరిగిపడిన చెట్లను తొలగించడానికి 1,447 ఎర్త్‌మూవర్‌లు, 321 డ్రోన్‌లు,  1,040 చైన్‌సాలు సిద్ధంగా ఉంచారు. ముందుజాగ్రత్త చర్యలలో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా 3.6 కోట్ల మందికి హెచ్చరిక మెస్సేజ్‌లు పంపించారు.


వర్షపాత వివరాలు

ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య, నెల్లూరు జిల్లాలోని ఉలవపాడులో అత్యధికంగా 12.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత కావలి (12.2 సెం.మీ.), దగ్గదర్తి (12 సెం.మీ.), సింగరాయకొండ (10.5 సెం.మీ.), బి. కోడూరు (6 సెం.మీ.), విశాఖపట్నం, తునిలో (2 సెం.మీ. చొప్పున) వర్షపాతం నమోదైంది. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమీక్షా సమావేశంలో, ఇప్పటివరకు నెల్లూరు జిల్లాలోనే అత్యధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు  తెలియజేశారు.

తీరాన్ని తాకిన ‘మొంథా’ తుపాను




అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను తీరాన్ని తాకింది. కాకినాడ-మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తీరాన్ని తాకింది. పూర్తిగా తీరం దాటేందుకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో తీర ప్రాంత జిల్లాల్లో భారీగా గాలులు వీస్తున్నాయి.బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ పత్తుల నిర్వహణ సంస్థ ఎండీ వి. ప్రఖర్ జైన్ తెలిపారు. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

బిహార్ ఎన్నికలు - ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన మహాగఠ్‌బంధన్



బిహార్‌లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో విపక్ష కూటమి మహాగఠ్‌బంధన్ మానిఫెస్టోను విడుదల చేసింది. ‘తేజస్వీ ప్రతిజ్ఞా ప్రాణ్’ పేరుతో ఈ మానిఫెస్టోను ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, కాంగ్రెస్ నేత పవన్ ఖేడా తదితరుల సమక్షంలో విడుదల చేశారు.కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్, కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో సహా మహాగఠ్‌బంధన్ కూటమిలోని ప్రముఖ నేతలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీఐపీ నుంచి ముకేశ్ సాహ్ని, కాంగ్రెస్ నుంచి మదన్‌మోహన్ ఝా, ఆర్‌ఎల్‌ఎస్‌పీ నుంచి ఉపేంద్ర కుశ్వాహా, సీపీఐ(ఎంఎల్) నుంచి దీపాంకర్ భట్టాచార్య, సీపీఐ నుంచి రామ్‌నరేష్ పాండే మొదలైనవారు ఉన్నారు.  వరాల జల్లు
మహాగఠ్‌బంధన్ కూటమి తమ మేనిఫెస్టోలో వరాల జల్లు కురిపించింది. బిహార్‌లోని ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగాలు, భూమి లేని కుటుంబాలకు 5 డెసిమల్ భూమి, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి కీలక వాగ్దానాలు ఇచ్చారు.
తాము అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ తదితర హామీలు ఇందులో పేర్కొన్నారు. బిహార్‌ను అభివృద్ధి పథంలో నడిపించడంతోపాటు దేశంలో నంబర్ వన్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఈ సందర్భంగా తేజస్వీ యాదవ్ వెల్లడించారు.


అంతకుముందు పార్సా, సారణ్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తేజస్వీ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం స్వేచ్ఛగా లభిస్తోందని, ఇంటికే నేరుగా మద్యం సరఫరా అవుతోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే నిషేధం నుంచి కల్లుకు మినహాయింపు ఇస్తామన్నారు. విద్య, ఆరోగ్య సదుపాయాలు, ఉపాధి, సాగునీటిని అందించే ప్రభుత్వాన్ని బిహార్ ప్రజలు కోరుకుంటున్నారని.. గత ఇరవై ఏళ్లలో ఎన్డీయే కూటమి వీటిని చేపట్టలేకపోయిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే వీటిని పూర్తి చేసి చూపిస్తామన్నారు.
నిత్యం దోపిడీలు..
‘‘సారణ్‌లో హత్యలు, దోపిడీ, అపహరణలు నిత్యకృత్యమయ్యాయి. అయినప్పటికీ సీఎం నీతీశ్ కుమార్  పట్టించుకోవడం లేదు. ఒక్కసారి కూడా బాధితులను పరామర్శించలేదు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. విపక్ష కూటమి అధికారంలోకి వస్తే శాంతిభద్రతలను కాపాడటంతోపాటు ఉద్యోగాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం’’ అని తేజస్వీ యాదవ్ పేర్కొన్నారు.

బిహార్‌లో 2016 నుంచి సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు అవుతోంది. మద్యం తయారీ, అమ్మకం, వినియోగంపై నిషేధం ఉన్నప్పటికీ ఉల్లంఘనలు జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ కూడా తాము అధికారంలోకి వస్తే మద్యం నిషేధాన్ని ఎత్తివేస్తామని ఇదివరకే ప్రకటించింది. 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్‌లో నవంబర్ 6 తొలిదశ, నవంబర్ 11న రెండోదశలో పోలింగ్ జరగనుంది.

స్కై జోరు పెంచాల్సిందే



  •  సూర్య నెత్తిన వేలాడుతున్న గిల్ కత్తి


ఆసియా కప్‌లోనూ, అంతకుముందూ బ్యాట్‌తో రాణించని టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నెత్తిన.. శుభ్‌మన్ గిల్ రూపంలో కత్తి వేలాడుతోంది! ఇకనైనా మునుపటి జోరు చూపించకపోతే.. డిప్యూటీకి నాయకత్వం అప్పగించాల్సి వస్తుందని విశ్లేషకులు అంటున్నారు.వన్డేల్లో రోహిత్ శర్మ స్థానంలో గిల్‌ను కెప్టెన్‌గా నియమించారు. టీ20ల్లో వైస్ కెప్టెన్సీ కూడా ఇచ్చారు. ఈ వేగంతోనే టీ20 నాయకత్వం కూడా గిల్‌దే అవుతుందని క్రికెట్ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కారణం.. సూర్య బ్యాటింగ్‌లో వరుస వైఫల్యాలు.


తగ్గిన సూర్య ప్రకాశం!

ఆసియా కప్‌లో సూర్య చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. పాకిస్థాన్‌పై 47*, యూఏఈపై 7*, బంగ్లాదేశ్‌పై 5, శ్రీలంకపై 12, ఫైనల్‌లో పాక్‌పై 1 రన్.. మొత్తం 72 పరుగులతో నిరాశపరిచాడు. సూపర్-4లో పాక్‌పై డకౌట్.2025లో కెప్టెన్‌గా 11 ఇన్నింగ్స్‌ల్లో 100 పరుగులే. ఓవరాల్‌గా 20 ఇన్నింగ్స్‌ల్లో 330 పరుగులు. అర్ధశతకం చేసి ఏడాది దాటింది. అక్టోబర్ 12, 2024లో బంగ్లాదేశ్‌పై 75 రన్స్ చేశాడు. ఆ తర్వాత ఆసియా కప్‌లో పాక్‌పై 47*నే టాప్ స్కోర్.


మేలుకోకపోతే..

2026 టీ20 వరల్డ్ కప్ ముందు ఆస్ట్రేలియాతో 5, దక్షిణాఫ్రికాతో 5, న్యూజిలాండ్‌తో 5 మ్యాచ్‌లు ఆడనుంది టీమిండియా. సఫారీ, కివీస్ సిరీస్‌లు స్వదేశంలో. ఇందులో సూర్య మెరవాల్సిందే. కెప్టెన్‌గా విజయాలు ఇస్తున్నా.. పరుగులు లేకుండా ఎక్కువ కాలం జట్టులో ఉండడం కష్టం. ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చే సూర్యకు ఇది కీలకం.కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్టర్ అజిత్ అగార్కర్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సూర్య ఇబ్బంది ఎదుర్కోకూడదంటే.. మునుపటి లాగే పరుగులతో మెరవాల్సిందే!అభిషేక్ శర్మ ప్రపంచంలోనే టాప్ టీ20 బ్యాటర్. 23 ఇన్నింగ్స్‌ల్లో 36.91 యావరేజ్‌తో 849 రన్స్. 2 శతకాలు, 5 అర్ధశతకాలు. ఇండియా-ఆసీస్ మధ్య 32 టీ20ల్లో భారత్ 20, ఆసీస్ 11 గెలిచాయి. ఒకటి ఫలితం లేకుండా. గత మూడు సిరీస్‌ల్లోనూ భారత్ ఆసీస్‌ను ఓడించింది.


అభిషేక్ శర్మను ఎదుర్కొనేందుకు సిద్ధం: మిచెల్ మార్ష్




జనవాక్కు: టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మను ఎదుర్కోవడానికి తమ జట్టు పూర్తిగా సిద్ధంగా ఉందని ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ చెప్పాడు. భారత్-ఆస్ట్రేలియా మధ్య అయిదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ రేపు (అక్టోబర్ 29) కాన్బెర్రాలో జరగనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మార్ష్ మాట్లాడుతూ.. ‘అభిషేక్ శర్మ అద్భుత నైపుణ్యం ఉన్న ఆటగాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ధనాధన్ ఆడాడు. అతడు మాకు నిజమైన ఛాలెంజ్. అయినా మేం అతణ్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రపంచంలోని టాప్ ప్లేయర్లతో తలపడి మనల్ని మనం పరీక్షించుకోవాలి’ అని అన్నాడు.జోష్ ఇంగ్లిస్ ఫిట్‌గా ఉన్నాడని, సిరీస్‌కు అందుబాటులో ఉన్నాడని మార్ష్ తెలిపాడు. న్యూజిలాండ్ సిరీస్‌లో గాయం కారణంగా దూరమైన ఇంగ్లిస్.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతాడని, జట్టుకు కీలకమని వివరించాడు.

కాకినాడకు 150 కి.మీ దూరంలో మొంథా తీవ్ర తుపాను


  •  రాత్రికి తీరం దాటనుంది



పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తీవ్ర తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఈ తుపాను విశాఖపట్నం నుంచి దక్షిణాన 250 కి.మీ, కాకినాడ నుంచి ఆగ్నేయంగా 150 కి.మీ, మచిలీపట్నం నుంచి దక్షిణ ఆగ్నేయంగా 70 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. గత 6 గంటల్లో గంటకు 15 కి.మీ వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. తీరం దాటే సమయంలో గంటకు 90–110 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉభయ గోదావరి జిల్లాల్లో గాలుల తీవ్రత పెరిగింది. కాకినాడ, యానం తీరాల్లో సముద్ర కెరటాలు ఎగసిపడుతున్నాయి. ఈ ప్రాంతాలకు ఉప్పెన ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యానంలో కనకలపేట, గెస్ట్‌హౌస్, పాత కోర్టు భవనం, ఎస్‌ఆర్‌కే కళాశాల వద్ద చెట్లు నేలకూలాయి. సహాయ సిబ్బంది వాటిని తొలగిస్తున్నారు. అగ్నిమాపక, విద్యుత్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి.


పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు

మొంథా తుపాను కాకినాడ తీరం వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆకస్మిక వరద (ఫ్లాష్ ఫ్లడ్) హెచ్చరికలు జారీ చేసింది. రేపు ఉదయం వరకు గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలతోపాటు తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం; ఒడిశాలో గజపతి, గంజాం జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవించే అవకాశం ఉంది.తాజా సమాచారం ప్రకారం, తుపాను విశాఖకు దక్షిణంగా 280 కి.మీ, కాకినాడకు ఆగ్నేయంగా 190 కి.మీ, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 110 కి.మీ దూరంలో ఉంది. గత 6 గంటల్లో 15 కి.మీ వేగంతో కదులుతూ కాకినాడ సమీపంలో తీరం దాటనుంది.


చీరాల వాడరేవు తీరం రాకాసి అలల దెబ్బకు కోత




 బాపట్ల జిల్లా చీరాల వాడరేవు తీరంలో తుపాను ప్రభావంతో రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. అలల ఉధృతికి తీరంలో కొంత భాగం కోతకు గురైంది. ముందు జాగ్రత్తగా బీచ్‌లను మూసివేశారు. పర్యాటకులను నిన్నటి నుంచే అనుమతించడం లేదు. వాడరేవు, రామాపురం, కటారివారిపాలెం, మోటుపల్లి, చినగంజం తీరాల్లో నిశ్శబ్దం అలుముకుంది.తీరం దాటినప్పుడు గంటన్నర పాటు తీవ్ర ప్రభావంవిశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథకుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కర్నూలు, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లోనూ వర్షాలు పడతాయని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మత్స్యకారులు మూడు రోజుల పాటు సముద్రంలోకి వెళ్లొద్దని సూచించారు.కాకినాడలో 10వ నంబరు, విశాఖ-గంగవరంలో 9వ నంబరు, మచిలీపట్నం-కృష్ణపట్నం-నిజాంపట్నంలో 8వ నంబరు ప్రమాద సంకేతాలు ఎగురవేశారు. ఈ సాయంత్రం నుంచి రాత్రి లోగా తుపాను తీరం తాకనుందని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాకినాడకు 190 కి.మీ దూరంలో ఉన్న తుపాను తీరం దాటినప్పుడు గంటన్నర పాటు తీవ్ర ప్రభావం ఉంటుందని, ఎప్పటికప్పుడు బులిటెన్లు జారీ చేస్తామని తెలిపారు.


Tuesday, 21 October 2025

జపాన్ తొలి మహిళా ప్రధానిగా సనై టకైచి ఎన్నిక

టోక్యో:జపాన్ తొలి మహిళా ప్రధానమంత్రిగా అతివాద నేతగా పేరున్న సనై టకైచి  ఎన్నికయ్యారు. జపాన్ పార్లమెంట్ మంగళవారం దేశ చరిత్రలోనే తొలి మహిళా ప్రధానిగా సనై టకైచిని ఎన్నుకుంది. పార్టీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో జపాన్ ప్రధానిగా ఉన్న షిగెరు ఇషిబా  ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్‌డీపీ) అధ్యక్షురాలిగా సనై టకైచి విజయం సాధించారు.



ఇటీవల దేశంలో జరిగిన ఎన్నికల్లో పార్లమెంటు ఎగువ సభలో అధికార పార్టీ మెజార్టీని సాధించలేకపోయింది. దీనికి ముందు దిగువ సభలో కూడా మెజార్టీ కోల్పోయింది. దీంతో ఇషిబాపై ఒత్తిడి పెరగడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో శనివారం పార్టీలో అధ్యక్ష ఎన్నికలు జరగ్గా.. మాజీ ప్రధాని కుమారుడు షింజిరో కొయిజుమితో పాటు మరో ముగ్గురు అభ్యర్థులను ఓడించి టకైచి విజయం సాధించారు.


నేడు పార్లమెంట్‌లో జరిగిన ఓటింగ్‌లో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ- జపాన్ ఇన్నోవేషన్ పార్టీ కూటమితో టకైచికి భారీ మద్దతు లభించింది. దీంతో జపాన్‌కు తొలి మహిళా ప్రధానిగా టకైచి అరుదైన ఘనత సాధించారు. 64 ఏళ్ల టకైచి 1993లో తన స్వస్థలమైన నారా నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఎల్‌డీపీలో ఆర్థిక భద్రత, అంతర్గత వ్యవహారాలు, లింగ సమానత్వ మంత్రితో సహా పలు కీలక పదవుల్లో పనిచేశారు.


శుభాకాంక్షలు తెలిపిన మోడీ


జపాన్ తొలి మహిళా ప్రధానిగా ఎన్నికైన సనై టకైచికి భారత ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. భారత్-జపాన్ దేశాల మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి టకైచితో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుల విషయంలో ఇరుదేశాల బంధాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు.

రష్యాను ఉక్రెయిన్ ఓడించడం 'సాధ్యం కాకపోవచ్చు




  •  పుతిన్‌తో భేటీకి సిద్ధమవుతున్న వేళ ట్రంప్ కీలక వ్యాఖ్యలు


వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఇంకా ఫలించలేదు. ఇప్పటికే పలుమార్లు ఇరు దేశాధినేతలతో ఆయన మాట్లాడినా కాల్పుల విరమణ ఒప్పందం కుదరలేదు. ఈ నేపథ్యంలో, తాజాగా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాను ఉక్రెయిన్ ఓడించగలదని తాను నమ్మినప్పటికీ, ప్రస్తుతం అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదని ఆయన అన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో త్వరలో భేటీ కానున్న సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్, "వారికి (ఉక్రెయిన్‌ను ఉద్దేశిస్తూ) గెలిచే అవకాశం ఉంది. కానీ, వారు గెలుస్తారని నేను అనుకోవడం లేదు" అని అన్నారు. యుద్ధం అనేది చాలా అనూహ్యమైన విషయమని, అందులో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని ఆయన పేర్కొన్నారు. యుద్ధాన్ని ముగించేలా ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఆ డీల్ జరిగితే చాలా మంచిదని, లేదంటే ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. రాబోయే కొద్ది వారాల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో బుడాపెస్ట్‌లో ముఖాముఖీ భేటీ అయ్యేందుకు ట్రంప్ ప్రణాళికలు రచిస్తున్నారు.


దొనెట్స్క్‌ అంశంపై స్పష్టత


ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. ట్రంప్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో దొనెట్స్క్ ప్రాంతం చర్చకు వచ్చినట్లు కొన్ని కథనాలు వచ్చాయి. పుతిన్ డిమాండ్ చేస్తున్నట్లు దొనెట్స్క్‌ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించాలని ట్రంప్, జెలెన్‌స్కీకి సూచించినట్లు ఆ కథనాల సారాంశం. అయితే, ట్రంప్ ఈ వార్తలను తాజాగా ఖండించారు. తమ భేటీలో దొనెట్స్క్ అంశం చర్చకు రాలేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా, అమెరికా అందిస్తున్న ఆయుధాలకు కీవ్ (ఉక్రెయిన్) చెల్లింపులు చేస్తోందని ఆయన వెల్లడించారు.

ట్రంప్ కలల ప్రాజెక్ట్ కోసం వైట్‌హౌస్ 'ఈస్ట్ వింగ్' కూల్చివేత!




వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన ప్రాజెక్ట్ - వైట్‌హౌస్‌లో కొత్త బాల్‌రూమ్ (నృత్యశాల) నిర్మాణం కోసం పనులు మొదలయ్యాయి. ఈ నిర్మాణానికి వీలు కల్పించేందుకు, వైట్‌హౌస్‌లోని చారిత్రక 'ఈస్ట్ వింగ్' విభాగంలో కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని స్వయంగా ట్రంపే 'ట్రూత్ సోషల్' వేదికగా వెల్లడించారు. సోమవారం ఈస్ట్ వింగ్‌లోని ప్రవేశ ద్వారం (ఎంట్రన్స్), కిటికీలను సిబ్బంది తొలగించారు.


ట్రంప్ శ్వేతసౌధంలో సుమారు 25 కోట్ల అమెరికన్ డాలర్ల వ్యయంతో ఈ బాల్‌రూమ్‌ను నిర్మిస్తున్నారు. వైట్‌హౌస్ ప్రాంగణంలో ట్రంప్ చేపడుతున్న అతిపెద్ద నిర్మాణ కార్యక్రమం ఇదే. దీన్ని ఈస్ట్ వింగ్ ప్రాంతంలో నిర్మించనున్నారు. ఈ నృత్యశాలలో ఒకేసారి 999 మంది కూర్చునేలా ప్రణాళిక రూపొందించారు.


ఈ బాల్‌రూమ్ నిర్మాణం 150 ఏళ్లకు పైగా అమెరికా అధ్యక్షుల కలగా ఉందని ట్రంప్ తెలిపారు. ఈ ప్రాజెక్టులో తాను తన సొంత డబ్బును పెట్టుబడిగా పెడుతున్నట్లు స్పష్టం చేశారు. దీనివల్ల అమెరికన్ పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ఖర్చు ఉండదని ఆయన పేర్కొన్నారు.


ఈ నిర్మాణానికి అనేకమంది "ఉదార దేశభక్తులు, గొప్ప అమెరికన్ కంపెనీలు" స్వచ్ఛందంగా నిధులు సమకూరుస్తున్నాయని ట్రంప్ తెలిపారు. ఈ నిర్మాణం వైట్‌హౌస్‌కు అనుసంధానంగా ఉన్నప్పటికీ, దీనికి శ్వేతసౌధంతో సంబంధం లేదని పేర్కొన్నారు. వైట్‌హౌస్ రెండు శతాబ్దాలుగా అమెరికా అధ్యక్షుడి చారిత్రక నివాసంగా ఉంది. కాగా, ప్రస్తుతం కూల్చివేస్తున్న 'ఈస్ట్ వింగ్' విభాగాన్ని 1902లో నిర్మించారు.

Monday, 20 October 2025

బిహార్ ఎన్నికల నుంచి వైదొలిగిన జేఎంఎం



  • కాంగ్రెస్, ఆర్జేడీపై కుట్ర ఆరోపణలు


పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించిన మరుసటి రోజే ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని వెల్లడించింది. కాంగ్రెస్, ఆర్జేడీల రాజకీయ కుట్ర కారణంగానే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.


'మహాఘట్బంధన్' కూటమిలో భాగంగా తమకు సీట్లు దక్కకుండా ఆర్జేడీ, కాంగ్రెస్ కుట్ర చేశాయని జేఎంఎం ఆరోపించింది. ఈ నేపథ్యంలో, ఝార్ఖండ్‌లో కాంగ్రెస్, ఆర్జేడీలతో ఉన్న పొత్తును తమ పార్టీ సమీక్షిస్తుందని జేఎంఎం సీనియర్ నేత సుదివ్య కుమార్ తెలిపారు. "రాజకీయ కుట్రలో భాగంగా బీహార్ ఎన్నికల్లో జేఎంఎం పోటీ చేయకుండా ఆర్జేడీ, కాంగ్రెస్ అడ్డుకున్నాయి. ఆ పార్టీలే దీనికి బాధ్యత వహించాలి. వారికి మా పార్టీ తగిన సమాధానం ఇస్తుంది. ఆ పార్టీలతో ఉన్న పొత్తును సమీక్షిస్తుంది" అని సుదివ్య కుమార్ పేర్కొన్నారు.


బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు జేఎంఎం ఇటీవల ప్రకటించి, ఆరు స్థానాల్లో అభ్యర్థులను నిలబెడుతున్నామని పేర్కొంది. తమకు మిత్రపక్షం ఏమీ లేదని, శత్రువు శత్రువేనని కూడా స్పష్టం చేసింది. అయితే, ఊహించని విధంగా అంతలోనే పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు అనూహ్య నిర్ణయం తీసుకుంది.

పోలీసుల పేరుతో వచ్చే ఇలాంటి కాల్స్ తో జాగ్రత్త!

సమస్యపై కాకుండా విమర్శకులపై దాడి


  •  కిరణ్‌ మజుందార్‌ షాకు మద్దతుగా హర్ష్‌ గొయెంకా


జనవాక్కు: భారత సిలికాన్‌ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరులోని రోడ్ల దుస్థితిపై బయోకాన్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజుందార్‌ షా ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. దీనిపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ఆమెపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలో, ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్‌ గొయెంకా స్పందిస్తూ కిరణ్‌ మజుందార్‌ షాకు గట్టి మద్దతుగా నిలిచారు. సమస్యకు పరిష్కారం కనుగొనడం మానేసి, రాజకీయాలు చేస్తున్నారంటూ నాయకులను ఆయన తీవ్రంగా విమర్శించారు.


హర్ష్‌ గొయెంకా తన 'ఎక్స్‌' ఖాతాలో రాస్తూ.. "మన రాజకీయ నాయకులు విమర్శలను స్వీకరించకపోవడం చాలా దురదృష్టకరం. బెంగళూరులో క్షీణిస్తున్న మౌలిక సదుపాయాల గురించి కిరణ్‌ మజుందార్‌ షా మాట్లాడారు. అయితే, నేతలు ఆ సమస్యను పరిష్కరించడం మానేసి, దానిపై రాజకీయాలు చేస్తున్నారు. అంతేకాకుండా, ప్రభుత్వానికి అనుకూలంగా పోస్టులు పెట్టాలని ఆమెను బలవంతం చేస్తున్నారు. వీరు సమస్యపై దృష్టి పెట్టకుండా, విమర్శించిన వారిపై దాడి చేయడం సర్వసాధారణంగా మారిపోయింది" అని నేతల వైఖరిని దుయ్యబట్టారు.




నిజానికి, కొంతకాలంగా బెంగళూరు రోడ్ల దయనీయ పరిస్థితిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే, బయోకాన్‌ పార్క్‌కు వచ్చిన ఒక విదేశీ విజిటర్‌ నగరం రోడ్లు, చెత్త గురించి చేసిన వ్యాఖ్యలతో తాను ఇబ్బంది పడ్డానని కిరణ్‌ మజుందార్‌ షా ఒక పోస్టులో వెల్లడించారు. ఈ పోస్ట్‌ వైరల్‌గా మారడంతో, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ స్పందిస్తూ, ఆమె రోడ్లను అభివృద్ధి చేయాలనుకుంటే ఆ పని చేయవచ్చని, అందుకు నిధులు కూడా ఇస్తామని వ్యంగ్యంగా బదులిచ్చారు. అంతేకాకుండా, ఆమె వ్యక్తిగత ఎజెండాతోనే ఈ విమర్శలు చేస్తున్నారని ఆరోపించిన డీకే శివకుమార్, భాజపా ప్రభుత్వ హయాంలో ఆమె ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే హర్ష్‌ గొయెంకా తాజాగా స్పందించి కిరణ్‌ మజుందార్‌ షాకు మద్దతు తెలిపారు.

Featured post

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...