Tuesday, 14 October 2025

పని గంటల వివాదంపై స్మృతి ఇరానీ కీలక వ్యాఖ్యలు

 


జనవాక్కు: దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తిరిగి నటిగా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చిన కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ.. ‘క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ 2’ సీరియల్‌తో అందరినీ అలరిస్తున్నారు. ఇండస్ట్రీలో చర్చనీయాంశమైన పని గంటల వివాదంపై తాజా ఇంటర్వ్యూలో ఆమె స్పందించారు. నిర్మాతల కోణంలో ఎప్పుడూ ఆలోచించాలని సూచించారు. బాలీవుడ్ నటి దీపికా పదుకొణె పని గంటల కారణంగా రెండు భారీ ప్రాజెక్టుల నుంచి వైదొలిగారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి కదా! ఈ విషయంపై స్మృతి ఇరానీ స్పష్టంగా చెప్పారు – ‘అది పూర్తిగా దీపికా వ్యక్తిగత సమస్య అన్నారు. 


తాను ఎప్పుడూ నిర్మాతలకు లాభాలు రావాలని అంకితభావంతో పనిచేస్తానని స్మృతి తెలిపారు. ‘‘పని గంటల గురించి గత కొన్ని రోజులుగా చాలా వార్తలు వినిపిస్తున్నాను. కొందరు దీన్ని వివాదాస్పద అంశంగా మార్చడానికి మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ, నేను దీన్ని పెద్ద అంశంగా చేసి వివాదాల్లో చిక్కుకునే అంత అమాయకురాలిని కాదు! సీరియల్‌లో నటిస్తున్న సమయంలోనే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాను. ఆ సమయంలో కూడా నిర్మాతల కోణంలో ఆలోచించి, వారికి న్యాయం చేయడానికి కష్టపడి పనిచేశాను. నిర్మాతలకు లాభాలు రావాలని కోరడం – ఒక నటిగా నా బాధ్యత!’’ అని ఆమె స్పష్టం చేశారు.‘120 కుటుంబాలకు అన్యాయం కాకుండా ఆలోచిస్తాను’

‘‘నటిగా మారడం, రాజకీయాల్లోకి రావడం, తల్లిగా పిల్లల సంరక్షణ చూసుకోవడం – ఇవన్నీ నా స్వంత ఎంపికలు! అందుకే వీటన్నిటికీ సమాన బాధ్యతతో వ్యవహరిస్తాను. నిర్మాతల వైపు నుంచి ఆలోచించలేకపోతే.. వాళ్లు భారీ నష్టాలు చూస్తారు. నేను ‘ఈరోజు షూటింగ్‌కు రాలేను’ అని చెప్పితే.. ఆ రోజు 120 మందికి జీతం చెక్కు అందదు! నా మూలంగా 120 కుటుంబాలకు అన్యాయం జరుగుతుంది. అందుకే నేనెప్పుడూ భిన్నంగా ఆలోచిస్తాను!’’ అని స్మృతి ఇరానీ వివరించారు.

తులసి పాత్రలో సూపర్‌స్టార్‌గా మారిన స్మృతి!

25 ఏళ్ల క్రితం స్మృతి ఇరానీ నటించిన హిందీ సీరియల్ ‘క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ’.. 2000 జులైలో ప్రారంభమై, 2008 నవంబరు వరకు విజయవంతంగా ప్రసారమైంది. గృహిణి తులసి పాత్రలో నటించి ప్రేక్షకుల ఆదరణతో పలు అవార్డులు సాధించారు. దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ 2’ జులై 29 నుంచి ప్రసారమవుతోంది. రెండు దశాబ్దాల తర్వాత తిరిగి తులసి పాత్రలోకి రాగా.. స్మృతి మళ్లీ ట్రెండింగ్‌లో ఉన్నారు!


No comments:

Post a Comment

Featured post

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...