ఛత్తీస్‌గఢ్: మావోయిస్టు అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేష్ లొంగిపోయారు. ఆశన్నతో సహా మొత్తం 208 మంది మావోయిస్టులు లొంగిపోయిన వారిలో ఉన్నారు. మరి కొద్దిసేపట్లో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి సమక్షంలో ఆశన్నను మీడియా ముందు ప్రవేశపెట్టారు.
మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ ఆయుధాలను విడిచిపెట్టి, తన 60 మంది సహచరులతో కలిసి జనజీవన స్రవంతిలో కలిసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆశన్న లొంగుబాటు ప్రకటన వెలువడింది. ఈ ఇద్దరు అగ్రనేతలు పోరాటాన్ని విడిచిపెట్టడంతో మావోయిస్టు పార్టీకి ఇది గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ఆశన్న స్వస్థలం ములుగు జిల్లా, వెంకటాపూర్ (రామప్ప) మండలంలోని నర్సింగాపూర్ గ్రామం. సుమారు నాలుగు దశాబ్దాల క్రితం ఆయన పీపుల్స్‌వార్ ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. వాసుదేవరావు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు మండలంలోని లక్ష్మీదేవిపేట ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. ఆ తర్వాత అప్పటి హనుమకొండ మండలం, కాజీపేటలోని ఫాతిమా స్కూల్‌లో సెకండరీ విద్యను పూర్తి చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదువుతున్న సమయంలో రాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్‌ఎస్‌యూ)కు నాయకత్వం వహించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో, ఆయన తన 25 ఏళ్ల వయసులోనే అజ్ఞాతంలోకి వెళ్లారు. ప్రస్తుతం వాసుదేవరావు వయసు 60 ఏళ్లు పైబడి ఉంటుందని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి.
కీలక దాడులకు ఆశన్న వ్యూహకర్త. దండకారణ్య సబ్‌జోనల్ బ్యూరో కార్యదర్శిగా రూపేశ్ పేరుతో వ్యవహరించిన ఆశన్న.. ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ సీఎం నేదురుమల్లి జనార్దనరెడ్డిలపై బాంబులు పేల్చి హత్యాయత్నం, 1999లో ఐపీఎస్ అధికారి ఉమేశ్‌చంద్ర హత్య, 2000లో నాటి హోంమంత్రి మాధవరెడ్డి హత్య లాంటి ఘటనలకు నేతృత్వం వహించినట్లు చెబుతారు.
No comments:
Post a Comment