హైదరాబాద్:మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని ఆయన దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. హైదరాబాద్ నగరం మరింత అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
పోలీసులకే రక్షణ లేని పరిస్థితి:
రాష్ట్రంలో పోలీసులకే రక్షణ లేని పరిస్థితి నెలకొందని ఆయన విమర్శించారు. ఒక రౌడీషీటర్ పోలీసు కానిస్టేబుల్‌ను చంపడం చాలా దురదృష్టకర సంఘటన అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా హోంమంత్రి అయ్యుండి కూడా రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని ఆయన ధ్వజమెత్తారు.
ప్రభుత్వంపై విమర్శలు:
"ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడటంలో విఫలమయ్యాయి. చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం" అని హరీశ్‌రావు అన్నారు."కేబినెట్ సమావేశంలో ఏం జరిగిందో నేను చెప్పాల్సిన పనిలేదు. స్వయానా మంత్రి కుమార్తెనే చెప్పింది. తప్పులు చేయకపోతే పోలీసులు మంత్రి ఇంటికి ఎందుకు వెళ్లారు? హైదరాబాద్‌ను గూండా రాజ్యంగా మార్చారు. ఒకప్పుడు బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పెట్టుబడిదారులకు స్వర్గధామంగా (సేఫ్ హెవెన్) మారిస్తే, ఇప్పుడు మీరు తుపాకులతో పెట్టుబడిదారులను భయపెడుతున్నారు" అని ప్రస్తుత ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

No comments:
Post a Comment