Friday, 17 October 2025

రిజర్వేషన్లు ఇవ్వాల్సిన పార్టీలే బంద్‌కు మద్దతు ప్రకటించడమేంటి?: కవిత

 




హైదరాబాద్: బీసీ బిడ్డలు తమకు రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. బీసీల బంద్‌కు మద్దతుగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తాలో మానవ హారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రిజర్వేషన్లు ఇవ్వాల్సిన పార్టీలే బంద్‌కు మద్దతు ప్రకటించటం నవ్వులాటగా ఉందని ఎద్దేవా చేశారు. దొంగ జీవోలు ఇచ్చిన కాంగ్రెస్, బీసీ బిల్లును పాస్ చేయించాల్సిన బీజేపీ బంద్‌కు మద్దతు పేరుతో డ్రామాలు చేస్తున్నాయని విమర్శించారు. హంతకులే వచ్చి నివాళి అర్పించినట్లు వ్యవహరిస్తున్నారని చెప్పారు.“బీసీ బిడ్డలను పదేపదే మోసం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం మాదిరిగా మరో బీసీ ఉద్యమాన్ని చేపడతాం. బంద్‌ను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నా. రిజర్వేషన్లు అమలు చేసేలా టెక్నికల్‌గా ప్రభుత్వాలు సరైన వాదనలు వినిపించడం లేదు. ఈ కారణంగానే సుప్రీం కోర్టులో తీర్పులు వ్యతిరేకంగా వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నిబంధనల ప్రకారం జనగణన నిర్వహించలేదు. జీవో 9 విషయంలో కూడా ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదు. అందుకే న్యాయస్థానం జీవోను కొట్టేసింది.ఇప్పటికిప్పుడే ఎన్నికలు జరగాల్సినంత తొందర ఏముంది? మహారాష్ట్ర, తమిళనాడులో ఐదేళ్ల వరకు ఎన్నికలు జరగలేదు. బీసీలకు రిజర్వేషన్ల అంశం తేలిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలి. సర్పంచులకు బిల్లులు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ వారిని ఇబ్బంది పెడుతోంది. రిజర్వేషన్లను అమలు చేయాల్సిన పార్టీలు చిత్తశుద్ధిగా పనిచేయాలని డిమాండ్ చేస్తున్నా” అని కవిత తెలిపారు. ఖైరతాబాద్ కూడలిలో నిర్వహించిన నిరసనలో కవిత కుమారుడు కూడా పాల్గొన్నారు.



ప్రజలను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి: ఈటల

బీసీ రిజర్వేషన్ల అంశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. జూబ్లీ బస్ స్టేషన్ వద్ద నిర్వహించిన బీసీ బంద్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. తమిళనాడు ఒక్కటే నిజాయితీగా రిజర్వేషన్లు అమలు చేసిందన్నారు. తెలంగాణలో కేసీఆర్ ఒకసారి సర్వే చేశారని.. బీసీ కమిషన్ కూడా వేశారని తెలిపారు. కానీ నిజాయితీ లేక అమలు కాలేదని పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పేరుకు కమిషన్లు వేసింది తప్ప నిజాయితీ లేదన్నారు.“బీసీలు 52 శాతం ఉంటే 42 శాతం అని కాకి లెక్కలు చెబుతున్నారు. నేను చెప్పేది అబద్ధం అయితే రాజకీయాల నుంచి తప్పుకొంటా. బీసీలం మేమెంతో మాకంత కావాలి. యాచించే స్థాయిలో కాదు.. శాసించే స్థాయిలో ఉన్నాం. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నంత కాలం ఆ కుటుంబం వారికే అధికారం దక్కుతుంది. కుటుంబమే ఏలుతుంది. కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినా.. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక్క బీసీ, ఒక ట్రైబల్ ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఈ రాష్ట్రంలో బీసీలు 8 మంది మంత్రులుండాలి.. కానీ ముగ్గురున్నారు. ఉన్న వారికి ఇచ్చిన శాఖలు చిన్నవి.నామినేటెడ్ పోస్టుల్లో ఎందుకు బీసీలకు స్థానం కల్పించలేదు. 




తెలంగాణలో బీసీని సీఎం చేస్తా అని ప్రధాని మోడీ ప్రకటించారు. మోడీ క్యాబినెట్‌లో 27 మంది ఓబీసీ మంత్రులు ఉన్నారు. బీజేపీ నిజాయితీని ఎవరు శంకించలేరు. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు. 42 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో మాత్రమే కాదు.. చట్టసభల్లో కూడా వచ్చే వరకు ఆగదు. మాది యాచన కాదు.. పాలించే శక్తి మాకు ఉంది. తెలంగాణ రాష్ట్రం ఎలా సాధ్యం అయిందో.. బీసీ రాజ్యాధికారం కూడా సాధ్యం అవుతుంది. ఆశయాన్ని ముద్దాడే వరకు ఐక్య ఉద్యమాలు చేద్దాం” అని ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు.


కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఏ పార్టీకి లేదు: మహేశ్‌కుమార్‌ గౌడ్‌



బీసీ బంద్‌లో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ అంబర్‌పేట్ చౌరస్తా దగ్గర నిర్వహించిన ర్యాలీలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంద్‌ విజయవంతమైందని పేర్కొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారని తెలిపారు. ‘‘బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌కు ఉన్న చిత్తశుద్ధి ఏ పార్టీకి లేదు. కుల సర్వే చేశాం. జీవో ఇచ్చాం. బీసీ బిల్లుకు ఆమోదం తెలపాలని త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ప్రధాని మోడీని కలుస్తాం. ప్రభుత్వ పరంగా 42 శాతంతో ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నాం. సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాత స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటాం’’ అని పేర్కొన్నారు.

 బీసీ బంద్‌ నేపథ్యంలో హైదరాబాద్‌ అంబర్‌పేట్‌లో కాంగ్రెస్‌ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ర్యాలీలో ఫ్లెక్సీ పట్టుకుని నడుస్తుండగా సీనియర్‌ నేత వి.హనుమంతరావు ఒక్కసారిగా కిందపడిపోయారు. వెంటనే ఆయన్ను నాయకులు పైకి లేపి సపర్యలు చేశారు.


రాష్ట్రంలో మద్దతిచ్చి కేంద్రంలో వెనుకడుగు: పొన్నం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన బీసీ బంద్ సందర్భంగా, హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ వద్ద ఉన్న డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, సీతక్కతో పాటు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. రాజ్యాంగంలో జనాభా ప్రాతిపదికన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు చట్టబద్ధత కల్పించాలని కాంగ్రెస్ నేతలు కేంద్రంలో ఉన్న బీజేపీని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... బీసీ బంద్‌లో తెలంగాణవ్యాప్తంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధితో పని చేస్తోందని, అందుకే రాష్ట్రంలో కుల సర్వే నిర్వహించినట్లు వివరించారు. బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ... రాష్ట్రంలో బీసీ బిల్లుకు మద్దతు ఇచ్చి, కేంద్రంలో మాత్రం దాని అమలు విషయంలో వెనకడుగు వేస్తోందని మంత్రి పొన్నం తీవ్రంగా విమర్శించారు.

ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు

సికింద్రాబాద్: బీసీ బంద్ నేపథ్యంలో జూబ్లీ బస్‌స్టాండ్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జూబ్లీ బస్ స్టేషన్‌లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మరోవైపు దీపావళి పండుగతో పాటు వారాంత సెలవులు ఉండటంతో వివిధ జిల్లాలకు వెళ్లాల్సిన ప్రయాణికులతో జేబీఎస్‌లో రద్దీ పెరిగింది. ముందస్తు సమాచారం లేకపోవడంతో బస్ స్టేషన్‌లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీలైనంత త్వరగా బస్సులను ప్రారంభించాలని కోరారు. కుటుంబ సభ్యులు, చిన్నారులు, వృద్ధులతో గంటల తరబడి బస్ స్టేషన్‌లో వేచి ఉన్నట్లు ప్రయాణికులు చెప్పారు. మరోవైపు ప్రధాన బస్‌స్టాండ్ ఎంజీబీఎస్‌లోనూ ప్రయాణికులు బస్సులు లేక పడిగాపులు కాశారు.కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, విజయవాడ, ఖమ్మం, సిద్దిపేట, సూర్యాపేట, నల్గొండ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సినవారు బస్సులు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ఇదే అదనుగా క్యాబ్ డ్రైవర్లు అధిక మొత్తంలో వసూలు చేశారు. దీంతో ఆర్‌టీసీ బస్సుల కోసమే పలువురు ప్రయాణికులు బస్‌స్టాండ్లలో గంటలకొద్దీ నిరీక్షించారు.


 క్యాబ్‌ల్లో డబుల్‌ ఛార్జీలు!

42 శాతం రిజర్వేషన్ల కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు బంద్ చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద ప్రైవేట్ క్యాబ్ లదందా సాగింది. వీరు ప్రయాణికుల నుంచి అధికంగా చార్జీలు వసూలు చేశారు. దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు లబోదిబోమన్నారు. ఉప్పల్ నుంచి హనుమకొండకు డబుల్ చార్జీలు వసూలు చేశారు. సాధారణ రోజుల్లో రూ.300 తీసుకుంటుండగా.. నేడు రూ.700 వసూలు చేశారు. ఉప్పల్ బస్‌స్టాండ్‌లో బస్సులు లేకపోవడంతో అన్నీ క్యాబ్‌లే కనిపించాయి.


No comments:

Post a Comment

Featured post

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...