- కాంగ్రెస్, ఆర్జేడీపై కుట్ర ఆరోపణలు
పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించిన మరుసటి రోజే ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని వెల్లడించింది. కాంగ్రెస్, ఆర్జేడీల రాజకీయ కుట్ర కారణంగానే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
'మహాఘట్బంధన్' కూటమిలో భాగంగా తమకు సీట్లు దక్కకుండా ఆర్జేడీ, కాంగ్రెస్ కుట్ర చేశాయని జేఎంఎం ఆరోపించింది. ఈ నేపథ్యంలో, ఝార్ఖండ్‌లో కాంగ్రెస్, ఆర్జేడీలతో ఉన్న పొత్తును తమ పార్టీ సమీక్షిస్తుందని జేఎంఎం సీనియర్ నేత సుదివ్య కుమార్ తెలిపారు. "రాజకీయ కుట్రలో భాగంగా బీహార్ ఎన్నికల్లో జేఎంఎం పోటీ చేయకుండా ఆర్జేడీ, కాంగ్రెస్ అడ్డుకున్నాయి. ఆ పార్టీలే దీనికి బాధ్యత వహించాలి. వారికి మా పార్టీ తగిన సమాధానం ఇస్తుంది. ఆ పార్టీలతో ఉన్న పొత్తును సమీక్షిస్తుంది" అని సుదివ్య కుమార్ పేర్కొన్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు జేఎంఎం ఇటీవల ప్రకటించి, ఆరు స్థానాల్లో అభ్యర్థులను నిలబెడుతున్నామని పేర్కొంది. తమకు మిత్రపక్షం ఏమీ లేదని, శత్రువు శత్రువేనని కూడా స్పష్టం చేసింది. అయితే, ఊహించని విధంగా అంతలోనే పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు అనూహ్య నిర్ణయం తీసుకుంది.

No comments:
Post a Comment