Monday, 20 October 2025

కానిస్టేబుల్ ను హతమార్చిన రియాజ్ పోలీసు కాల్పుల్లో మృతి

 



నిజామాబాద్‌లో కానిస్టేబుల్‌ను కత్తితో హతమార్చిన వాహనాల దొంగ రియాజ్ (24) పోలీసు కాల్పుల్లో మృతిచెందాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్, కానిస్టేబుల్ వద్దున్న తుపాకీని లాక్కోబోయాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు అతనిపై కాల్పులు జరిపారని  తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు.

ఈ నెల 17న నిజామాబాద్ వినాయక్‌నగర్‌లోని సీఐఐఎస్ ఠాణాకు తరలిస్తున్న కానిస్టేబుల్ ప్రమోద్‌ను రియాజ్ కత్తితో పొడిచి హత్య చేశాడు. ఘటనా స్థలం నుంచి స్నేహితుడి బైక్‌పై పరారైన రియాజ్, మహ్మదీయకాలనీలోని తన ఇంటికి చేరి దుస్తులు మార్చుకుని మళ్లీ బయటకు వచ్చాడు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో తప్పించుకుని తిరిగాడు. రియాజ్ నగర పరిధిని దాటలేదనే సమాచారంతో పోలీసులు శనివారం రాత్రి అనుమానిత ప్రాంతాలను డ్రోన్ కెమెరాలతో జల్లెడపట్టారు.ఈ క్రమంలో ఐదో ఠాణా పరిధిలో రియాజ్ కనిపించగా, పట్టుకోబోతుంటే కెనాల్‌లోకి దూకి తప్పించుకున్నాడు. అక్కడ అతని బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం సారంగాపూర్ శివారులో రియాజ్ ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. పాడుబడిన లారీ క్యాబిన్‌లో దాగి ఉన్న రియాజ్, పోలీసులను చూసి పారిపోబోతుంటే స్థానికుడు సయ్యద్ ఆసిఫ్ అతన్ని పట్టుకోడానికి ప్రయత్నించాడు. ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. ఈ సందర్భంలో రియాజ్ తన వద్దున్న కత్తితో ఆసిఫ్ ఎడమ చేతిని తీవ్రంగా గాయపరిచాడు. ఈ లోపల పోలీసు బృందం రియాజ్‌ను చుట్టుముట్టి తాళ్లతో బంధించారు .గాయపడిన ఆసిఫ్‌ను నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. పెనుగులాటలో రియాజ్ సైతం తీవ్రంగా గాయపడటంతో నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. సోమవారం ఆసుపత్రిలో ఉండగా, కానిస్టేబుల్ వద్దున్న తుపాకీని లాక్కునేందుకు రియాజ్ ప్రయత్నించాడు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు అతనిపై కాల్పులు జరిపారు.


ఆయుధాన్ని లాక్కుని కాల్పులకు యత్నం: డీజీపీ శివధర్‌రెడ్డి

నిజామాబాద్‌లో పోలీసు కాల్పుల్లో రియాజ్ మృతిచెందిన ఘటనపై తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి స్పందించారు. రియాజ్ తప్పించుకుని పారిపోతూ పోలీసులపై మరోసారి దాడికి పాల్పడ్డాడని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు బాత్‌రూంకు వెళ్లి తిరిగి వస్తూ దాడికి తెగబడ్డాడని చెప్పారు.‘‘రియాజ్‌ను పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. వారి దగ్గర ఉన్న ఆయుధాన్ని లాక్కుని కాల్పులకు యత్నించాడు. అప్రమత్తమైన పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రియాజ్ మృతిచెందాడు. ఆదివారం అతన్ని పట్టుకునే క్రమంలో కానిస్టేబుల్ ఆసిఫ్‌పై దాడి చేశాడు. ఇవాళ మరో కానిస్టేబుల్‌ను గాయపరిచి పారిపోవడానికి యత్నించాడు’’ అని డీజీపీ వివరించారు.


No comments:

Post a Comment

Featured post

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...