Tuesday, 14 October 2025

హర్యానాలో పోలీసు అధికారుల వరుస ఆత్మహత్యలు - తీవ్ర కలకలం!

 

                  



జనవాక్కు: హర్యానాలో వరుసగా పోలీసు అధికారులు ఆత్మహత్యలు చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటన మరవకముందే, రోహ్తక్ ఏఎస్పీ సందీప్ కుమార్ బలవన్‌మరణానికి పాల్పడటం సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సందీప్ మరణానికి సంబంధించి పూరన్ కుమార్ భార్య, సీనియర్ ఐఏఎస్ అధికారిణి అమ్నీత్ కుమార్‌ను అరెస్టు చేయాలంటూ సందీప్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.సందీప్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు ఇచ్చేందుకు ఆయన కుటుంబం నిరాకరించింది. ఈ క్రమంలో దాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అమ్నీత్‌ను జైలులో పెట్టిన తర్వాతే సందీప్ మృతదేహాన్ని దహనం చేస్తామని కుటుంబం తేల్చి చెప్పింది. లంచం తీసుకున్న ఆరోపణలపై ఐపీఎస్ అధికారి గన్‌మెన్ ఇటీవల అరెస్టయ్యాడు. ఈ అరెస్టుకు సంబంధించి సందీప్‌ను హింసించారని ఆయన కుటుంబం ఆరోపణలు చేసింది. ఈ వేధింపుల గురించి రెండు రోజుల ముందు తమతో చెప్పినట్లు వెల్లడించారు. తమ డిమాండ్లు నెరవేరేవరకు అంత్యక్రియలు నిర్వహించమని కుటుంబం స్పష్టం చేసింది. పోలీసు వ్యవస్థలోని అవినీతి, కుల రాజకీయాలు సందీప్‌ను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాయని ఆరోపించారు.

పూరన్ పోస్ట్‌మార్టమ్‌కు అంగీకారం!

పూరన్ కుమార్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం! ఆయన మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు పూరన్ కుటుంబ సభ్యులు అంగీకరించారు. సీనియర్ పోలీసు అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే దీన్ని నిర్వహిస్తామని ఆయన తెలిపారు.పూరన్ కుమార్ ఇటీవల చండీగఢ్‌లోని తన నివాసంలో రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కుల వివక్ష, వేధింపులు, అవమానాలతోనే బలవన్‌మరణానికి పాల్పడుతున్నట్లు ఆయన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. ఇందులో ఎనిమిది మంది అధికారుల పేర్లను చేర్చారు. ఇది జరిగిన కొన్ని రోజులకు పూరన్‌కు సంబంధించిన అవినీతి కేసును దర్యాప్తు చేస్తున్న ఏఎస్పీ సందీప్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో తన సూసైడ్ నోట్‌లో పూరన్‌పై ఆయన పలు ఆరోపణలు చేశారు. నిజాలు వెలుగులోకి రావడం కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తున్నట్లు తెలిపారు.




No comments:

Post a Comment

Featured post

దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి కన్నుమూత

  న్యూఢిల్లీ: దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి (71) కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో దూరదర్శన్‌ వార్తా ప్రసారాల్లో పరిచయమైన ...