Tuesday, 14 October 2025

లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల

 




గడ్చిరోలి: మావోయిస్టు పార్టీ అగ్రనేత, దాదాపు రెండో స్థానంలో చలామణి అవుతున్న మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలోకి కలిశారు. 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి బుధవారం ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సమక్షంలో లొంగిపోయారు. సీఎం ముందు వీరంతా తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. మల్లోజుల, ఆయన బృందాన్ని సీఎం ఫడణవీస్ జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించారు.


మావోయిస్టు పార్టీ వైఖరి సరిగా లేదంటూ కొన్ని రోజులుగా మల్లోజుల బహిరంగ లేఖలు రాస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పార్టీలో దశాబ్దాలుగా జరుగుతున్న తప్పిదాలకు తానే కారణమని పేర్కొంటూ అత్యున్నత నిర్ణాయక కమిటీ పొలిట్‌బ్యూరో నుంచి వైదొలిగారు. తాజాగా ఉద్యమాన్ని పూర్తిగా వదిలిపెట్టి అజ్ఞాతం వీడారు. మల్లోజులపై వందకు పైగా కేసులు ఉన్నాయి.


మల్లోజుల సొంత రాష్ట్రం తెలంగాణ. పెద్దపల్లికి చెందిన మల్లోజుల వెంకటయ్య, మధురమ్మ దంపతులకు వేణుగోపాల్ రావు మూడో సంతానం. తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసిన తండ్రి నుంచే వేణుగోపాల్, ఆయన రెండో అన్న కోటేశ్వరరావు స్ఫూర్తి పొందారు. చదువు పూర్తయిన అనంతరం తన అన్న పిలుపు మేరకు ఉద్యమంలో ప్రవేశించారు. పార్టీలో ఆయనను అభయ్, సోను, భూపతి, వివేక్ పేర్లతో పిలిచేవారు. మల్లోజులపై రూ.6 కోట్ల రివార్డు ఉన్నట్లు గడ్చిరోలి పోలీసులు ప్రకటించారు.


No comments:

Post a Comment

Featured post

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...