రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి భారత్ ఇక చమురు కొనుగోలు చేయదని తాను భావిస్తున్నట్లు ఆయన మళ్లీ ప్రకటించారు.ట్రంప్ చేసిన ఈ ప్రకటన నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించింది. ట్రంప్ వ్యాఖ్యలపై మోడీ మౌనం వహించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది.
కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఈ అంశంపై ఎక్స్ (గతంలో ట్విటర్) వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. రష్యా ఇంధన కొనుగోళ్లను భారత్ తగ్గిస్తుందని తన మంచి స్నేహితుడు (మోడీని ఉద్దేశిస్తూ) తనకు హామీ ఇచ్చాడంటూ ట్రంప్ పేర్కొన్న విషయాన్ని రమేశ్ ప్రస్తావించారు.
"‘ఆపరేషన్ సిందూర్‌ను ఆపేశానంటూ, రష్యా ఇంధన కొనుగోళ్లను భారత్ తగ్గిస్తుందంటూ ట్రంప్ చెప్పినప్పుడల్లా... ఆయన మంచి స్నేహితుడు అకస్మాత్తుగా మౌనీ బాబా అయిపోతారు’ అంటూ రమేశ్ తీవ్రంగా విమర్శించారు.
ట్రంప్ ప్రకటన నేపథ్యం
ఉక్రెయిన్‌లో యుద్ధం ముగించే అంశంపై చర్చల నిమిత్తం ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీతో ట్రంప్ వైట్‌హౌస్‌లో భేటీ అయ్యారు. ఈ సమావేశం సందర్భంగానే, ట్రంప్ రష్యా నుంచి భారత్ ఇక చమురు కొనుగోలు చేయదని, ఇప్పటికే వాటిని తగ్గించుకుందని పేర్కొన్నారు.
గతంలో కూడా ట్రంప్ ఇదే తరహా ప్రకటనలు చేస్తూ వచ్చారు. రష్యా చమురు కొనుగోళ్లు ఆపేయడంపై తనకు మోడీ నుంచి హామీ వచ్చిందంటూ ట్రంప్ అంతకుముందు కూడా చెప్పారు. అయితే, ఆ సమయంలో భారత్ ఈ వ్యాఖ్యలను ఖండించింది. ఇద్దరు నేతల మధ్య అలాంటి సంభాషణ జరగలేదని స్పష్టం చేసింది. భారత వినియోగదారుల ప్రయోజనాల మేరకే ఇంధన కొనుగోలు ఎంపికల్లో తమ ప్రాధాన్యం ఉంటుందని ఆ సందర్భంగా తేల్చిచెప్పింది.

No comments:
Post a Comment