బిహార్‌లో ఎన్నికల వేడి హీటెక్కింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం (అక్టోబర్ 29, 2025) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరుసగా ఎన్డీఏ, ఇండియా బ్లాక్ అభ్యర్థుల తరపున బహిరంగసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. నేషనల్ మీడియాలో కథనాల ప్రకారం... అమిత్ షా దర్భంగా, సమస్తిపూర్, బేగుసరాయ్‌లో ఎన్డీఏ అభ్యర్థుల మద్దతుగా సమావేశాలను నిర్వహించనున్నారు. అదే సమయంలో రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌తో పాటు ఇండియా బ్లాక్ నాయకులతో కలిసి ముజఫర్‌పూర్, దర్భంగా ప్రాంతాల్లో రెండు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇకపోతే, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా బిహార్‌లో ఎన్డీఏ అభ్యర్థుల మద్దతుగా ప్రచారసభలను నిర్వహించనున్నారు.
తేజస్వీ యాదవ్‌పై నిత్యానంద్ రాయ్ విమర్శలు
కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ మహాగఠ్‌బంధన్ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయనను “అవినీతిపరుడు”గా అభివర్ణించారు.
“నేడు ‘ఘమండియా’ కూటమి తమ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ‘మేము బిహార్‌ను అవినీతి నుంచి విముక్తం చేస్తాము’ తేజస్వీ యాదవ్ అంటున్నారు. తానే అవినీతి కేసుల్లో నిందితుడు, అనేక స్కాంలలో పాల్గొన్న వ్యక్తి బిహార్‌ను అవినీతి నుంచి ఎలా విముక్తి చేస్తాడని ప్రజలు ప్రశ్నించాలి,” అని రాయ్ వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ బిహార్ పర్యటన
కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బిహార్ పర్యటనలో భాగంగా తేజస్వీ యాదవ్‌తో ఉమ్మడి ప్రజాసభను ఉద్దేశించి మాట్లాడనున్నారు. అలాగే ఆయన దర్భంగా ప్రాంతంలో కూడా ఓ బహిరంగ సభను నిర్వహించనున్నారు.
No comments:
Post a Comment