- సీనియర్ మంత్రి హెచ్చరించినా లెక్కచేయలేదు
- ఓఎస్డీ వ్యవహారాలు శ్రుతి మించడంతోనే తొలిగింపు
హైదరాబాద్: అటవీ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ పేషీలో ఓఎస్డీగా పనిచేసిన సుమంత్ వ్యవహారాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సిమెంటు కంపెనీల యాజమాన్యాలను ఆయన బెదిరించినట్లు ప్రభుత్వం దృష్టికి రావడంతో గట్టిగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు సమాచారం. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లో ఓఎస్డీగా నియమితులై.. డిప్యుటేషన్ మీద అటవీ, దేవాదాయ మంత్రి కార్యాలయంలో ఓఎస్డీగా పనిచేసిన సుమంత్‌ను తొలిగిస్తూ మంగళవారం పీసీబీ కార్యదర్శి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. చాలాకాలంగా ఈయనపై ఆరోపణలున్నా, ఇటీవల సిమెంట్ కంపెనీల యాజమాన్యాలపై ఒత్తిడి తెచ్చినట్లు ప్రభుత్వం దృష్టికి రావడంతో వేటు వేసినట్లు సమాచారం. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సిమెంటు ఫ్యాక్టరీ యాజమాన్యాల్లో కొందరికి ఆయన ఫోన్ చేసి భారీగా డిమాండ్ చేయడంతోపాటు, చెప్పినట్లు చేయకపోతే పీసీబీ తరఫున చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలిసింది.ఈ విషయాన్ని కంపెనీల యాజమాన్యాలు నల్గొండ జిల్లాకు చెందిన, కేంద్ర కాంగ్రెస్ వ్యవహారాల్లో కీలకంగా ఉండే ఓ సీనియర్ మంత్రి దృష్టికి తీసుకెళ్లగా ఆయన జోక్యం చేసుకుని మాట్లాడినట్లు తెలిసింది. అయితే సీనియర్ మంత్రిని కూడా లెక్కచేయకుండా ఓఎస్డీ మళ్లీ కంపెనీల యాజమాన్యాలతో గట్టిగా మాట్లాడడంతో, ఈ విషయాన్ని మంత్రి.. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌కు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పినట్లు సమాచారం. దీంతో సీఎం సీరియస్‌గా తీసుకున్నారు. సిమెంటు కంపెనీలను బెదిరించడంపై అవసరమైతే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఇలాంటి సంఘటనలు ఎక్కడా పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోమని సూచించినట్లు సమాచారం. ఇతర శాఖల్లో కూడా ఇలాంటి వారుంటే కఠినంగా వ్యవహరించాలని, ప్రభుత్వానికి నష్టం కలిగించే ఎలాంటి చర్యలను ఉపేక్షించరాదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, పోలీసు ఉన్నతాధికారులకు సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది.
మాజీ ఓఎస్డీ సుమంత్ విషయం నాకేమీ తెలియదు
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ విషయం తనకేమీ తెలియదని ఆమె భర్త, కాంగ్రెస్ నేత కొండా మురళి అన్నారు. స్మార్ట్ ఫోన్ చూడటం తనకు రాదని.. ఏమైందో తెలియదని చెప్పారు. మంత్రి ఛాంబర్‌కు ఇప్పటివరకు తాను వెళ్లలేదన్నారు. సిమెంట్ కంపెనీ యాజమాన్యాలను సుమంత్ బెదిరించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను ఓఎస్డీ బాధ్యతల నుంచి ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో బుధవారం రాత్రి హైదరాబాద్‌లో మంత్రి కొండా సురేఖ ఇంటి వద్దకు సుమంత్ కోసం పోలీసులు రావడం.. మంత్రి కుమార్తె సుస్మిత అడ్డుకోవడం తదితర పరిణామాల నేపథ్యంలో హనుమకొండలో కొండా మురళి మీడియాతో మాట్లాడారు.‘‘నా కుమార్తె, అల్లుడు లండన్‌లో ఉన్నారు.. అక్కడ వ్యాపారం చేస్తున్నారు. నా బిడ్డకు పదవి ఏమీ లేదు.. ఏ పార్టీలోనూ లేదు. భద్రతా కారణాల వల్ల వేర్వేరు కార్లలో నేను, సురేఖ వెళ్తాం. సీఎం రేవంత్ రెడ్డి నాకు ఎమ్మెల్సీ ఇస్తామన్నారు.. ఇస్తారు. సీఎం, మంత్రి పొంగులేటి మా ఇంటికి వచ్చారు.. నన్నెందుకు టార్గెట్ చేస్తారు?’’ అని కొండా మురళి వ్యాఖ్యానించారు.

No comments:
Post a Comment