Monday, 20 October 2025

సమస్యపై కాకుండా విమర్శకులపై దాడి


  •  కిరణ్‌ మజుందార్‌ షాకు మద్దతుగా హర్ష్‌ గొయెంకా


జనవాక్కు: భారత సిలికాన్‌ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరులోని రోడ్ల దుస్థితిపై బయోకాన్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజుందార్‌ షా ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. దీనిపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ఆమెపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలో, ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్‌ గొయెంకా స్పందిస్తూ కిరణ్‌ మజుందార్‌ షాకు గట్టి మద్దతుగా నిలిచారు. సమస్యకు పరిష్కారం కనుగొనడం మానేసి, రాజకీయాలు చేస్తున్నారంటూ నాయకులను ఆయన తీవ్రంగా విమర్శించారు.


హర్ష్‌ గొయెంకా తన 'ఎక్స్‌' ఖాతాలో రాస్తూ.. "మన రాజకీయ నాయకులు విమర్శలను స్వీకరించకపోవడం చాలా దురదృష్టకరం. బెంగళూరులో క్షీణిస్తున్న మౌలిక సదుపాయాల గురించి కిరణ్‌ మజుందార్‌ షా మాట్లాడారు. అయితే, నేతలు ఆ సమస్యను పరిష్కరించడం మానేసి, దానిపై రాజకీయాలు చేస్తున్నారు. అంతేకాకుండా, ప్రభుత్వానికి అనుకూలంగా పోస్టులు పెట్టాలని ఆమెను బలవంతం చేస్తున్నారు. వీరు సమస్యపై దృష్టి పెట్టకుండా, విమర్శించిన వారిపై దాడి చేయడం సర్వసాధారణంగా మారిపోయింది" అని నేతల వైఖరిని దుయ్యబట్టారు.




నిజానికి, కొంతకాలంగా బెంగళూరు రోడ్ల దయనీయ పరిస్థితిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే, బయోకాన్‌ పార్క్‌కు వచ్చిన ఒక విదేశీ విజిటర్‌ నగరం రోడ్లు, చెత్త గురించి చేసిన వ్యాఖ్యలతో తాను ఇబ్బంది పడ్డానని కిరణ్‌ మజుందార్‌ షా ఒక పోస్టులో వెల్లడించారు. ఈ పోస్ట్‌ వైరల్‌గా మారడంతో, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ స్పందిస్తూ, ఆమె రోడ్లను అభివృద్ధి చేయాలనుకుంటే ఆ పని చేయవచ్చని, అందుకు నిధులు కూడా ఇస్తామని వ్యంగ్యంగా బదులిచ్చారు. అంతేకాకుండా, ఆమె వ్యక్తిగత ఎజెండాతోనే ఈ విమర్శలు చేస్తున్నారని ఆరోపించిన డీకే శివకుమార్, భాజపా ప్రభుత్వ హయాంలో ఆమె ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే హర్ష్‌ గొయెంకా తాజాగా స్పందించి కిరణ్‌ మజుందార్‌ షాకు మద్దతు తెలిపారు.

No comments:

Post a Comment

Featured post

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...