Wednesday, 15 October 2025

ఉపపోరు.. ప్రత్యారోపణల హోరు

 


హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు. వచ్చే నెల 11న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో నియోజకవర్గంలో ప్రచారంలో ఎవరికి వారు ప్రత్యారోపణలతో హోరెత్తిస్తున్నారు. ప్రచారంలో బీఆర్‌ఎస్ ముందడుగు వేసింది. కాంగ్రెస్ తరఫున మంత్రులు కదనరంగంలోకి దూకారు. బుధవారం నాటికి 33 మంది నామపత్రాలు దాఖలు చేశారు. బీఆర్‌ఎస్ నుంచి మాగంటి సునీత పార్టీ నేతలతో కలిసి వచ్చి బుధవారం 2 సెట్ల నామినేషన్లు వేశారు. మరోసారి భారీ ఊరేగింపుతో నామినేషన్ వేయనున్నారు.కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ ఈ నెల 17న నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి 2023 సాధారణ ఎన్నికల్లో నవీన్ యాదవ్ ఎంఐఎం తరఫున పోటీ చేశారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గ కాంగ్రెస్ బాధ్యుడు. బీజేపీ తమ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డిని ప్రకటించింది. గత ఎన్నికల్లోనే ఆయనే బీజేపీ నుంచి పోటీ చేశారు. ఆయన కూడా 17న నామినేషన్ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.జోరుగా నామినేషన్లు.. మూడు రోజుల్లోనే 33 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇంకా పలు పార్టీల తరఫున దాఖలు కావాల్సి ఉంది. మరోవైపు రీజనల్ రింగు రోడ్ నిర్వాసితులు భారీగా నామినేషన్లు వేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగానే దాఖలు కానున్నాయి. నిరుద్యోగుల తరఫున కొన్ని నామినేషన్లు దాఖలు చేయాలని నిర్ణయించారు. బీసీ రిజర్వేషన్ల పోరాటం తరఫున కొంతమంది సన్నద్ధమవుతున్నారు.మహామహులతో.. నియోజకవర్గంలో నకిలీ ఓట్లకు అధికార పార్టీ తెరతీసిందని భారాస ఆరోపణలతో హోరెత్తిస్తోంది. డూప్లికేట్, ట్రిపుల్‌కేట్ ఓట్లు, ఒకే ఇంటి నంబరుతో ఓట్లపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కేటీఆర్, హరీష్ రావు, తలసాని తదితరులు ప్రచార పర్వంలో భాగస్వాములయ్యారు. ఆరోపణలను కాంగ్రెస్ కొట్టిపారేస్తోంది. గత ప్రభుత్వంలో 2023కు ముందు ఈ ఓట్లు చేర్పించారని, ఆ పాపం బీఆర్‌ఎస్‌దేనని ప్రత్యారోపణలు చేస్తోంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ ఇటీవల సమావేశాల్లో పాల్గొన్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, తుమ్మల నాగేశ్వరరావు ప్రచారంలో పాల్గొంటున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై సానుభూతి సంపాదించాలని బీఆర్‌ఎస్ ప్రయత్నాలు చేస్తోందంటూ విమర్శిస్తోంది. మరోవైపు బీజేపీ.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తోంది.

No comments:

Post a Comment

Featured post

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...