ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దీపావళికి ముందు వాయు కాలుష్యం రోజురోజుకు తీవ్రమవుతోంది. స్థానికంగా వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) దారుణంగా పడిపోవడంతో అనేక ప్రాంతాల్లో ఇది 400 మార్కును దాటింది. ఇది అత్యంత తీవ్రమైన కాలుష్య కేటగిరీ కిందకు వస్తుంది. పండుగ సందర్భంగా రాజధానిలో వాయు నాణ్యత భారీగా తగ్గడంపై కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) ఆందోళన వ్యక్తం చేసింది. అక్షరధామ్ ప్రాంతంలో వాయు నాణ్యత 426గా నమోదైంది. ఈ సీజన్‌లో నగరంలో ఇదే అత్యధిక కాలుష్య స్థాయి అని సీపీసీబీ ప్రకటించింది. ఆనంద్ విహార్ ప్రాంతం 418 ఏక్యూఐతో తర్వాతి స్థానంలో ఉంది.
పెరుగుతున్న కాలుష్య స్థాయులను అదుపు చేయడానికి ఇండియా గేట్ వద్ద వాటర్ స్ప్రింక్లర్లను ఏర్పాటు చేసినట్లు కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం ఈ ప్రాంతంలో వాయు నాణ్యత 269గా నమోదైనట్లు పేర్కొన్నారు. రాజధానిలోని 38 వాయు పర్యవేక్షణ కేంద్రాలలో తొమ్మిది ఇప్పటికే అత్యంత పేలవమైన కేటగిరీలోకి చేరినట్లు వివరించారు. ఆనంద్ విహార్ (389), వజీర్‌పూర్ (351), జహంగీర్‌పురి (310), ద్వారక (310) ఏక్యూఐలతో అత్యంత ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి.
శీతాకాలం దగ్గర పడుతుండటం, నగరంలో వాహన ఉద్గారాలు పెరగడం వల్ల కాలుష్యం తీవ్రమవుతున్నట్లు కాలుష్య నియంత్రణ అధికారులు పేర్కొన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో కాలుష్య స్థాయులు తీవ్రమైన జోన్‌లోకి వెళ్తున్నందున నియంత్రణ చర్యలను ముమ్మరం చేస్తున్నామన్నారు. మరోవైపు, దీపావళి పండుగ సందర్భంగా పెద్ద మొత్తంలో టపాసులు కాల్చడం, పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్ల దేశ రాజధానిలో వాయు నాణ్యత మరింత క్షీణించే అవకాశం ఉందని ఎయిర్ క్వాలిటీ ముందస్తు హెచ్చరిక వ్యవస్థ అంచనా వేసింది. ఇది మరింత దిగజారకుండా నిరోధించేందుకు జీఆర్‌ఏపీ-1 నిబంధనలను తక్షణమే అమలు చేయాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించింది.

No comments:
Post a Comment