తెలంగాణ సీఎం ఇటీవల కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరంగా ఉంటున్నాయి. నిన్న వనపర్తి సభలో సీఎం మాట్లాడుతూ.. తెలంగాణకు ఏదో చేయాలనే ఆలోచనతో ప్రధాని మోడీ ఉన్నారని, కానీ ఆయన నిర్ణయాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైంధవుడిగా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దేశంలో ఇప్పటికీ మోడీని మంచిన బలమైన నాయకుడు లేడు. అందుకే 2014 ఎన్నికల్లో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కేంద్రంలో సంపూర్ణ మెజారిటీతో బీజేపీని అధికారంలోకి తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. 2019లోనూ అంతకంటే ఎక్కువ మెజారిటీ రావడానికి కారణం ఆయన నాయకత్వమే. అయితే పదేళ్ల పాలనలో వైఫల్యాలు అనేకం ఉన్నాయి. అయితే వాటిని తమకు ఓటు బ్యాంకుగా మలుచుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది. బీజేపీ గత ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే అడ్డుకున్నాయి. దీంతో 400 లకు పైగా (చార్ సౌ పార్ ) స్థానాల నినాదంతో ఎన్నికలకు వెళ్లిన నరేంద్రమోడీకి భారతీయ ఓటర్లు షాక్ ఇచ్చారు. బీజేపీని 230 స్థానాలకే పరిమితం చేశారు. 2014, 2019లో ఎన్డీఏ భాగస్వామ్యపక్షాల మద్దతు లేకుండానే సొంతంగా మెజారిటీ సాధించిన మోడీకి మొదటిసారి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అయినా కూడా హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల్లో విజయం తర్వాత ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లోనూ, విపక్షాల్లోనూ తనకు తిరుగులేదని నిరూపించారు. కేంద్రంలో చక్రం తిప్పాను అన్న చంద్రబాబు కూడా ఇప్పుడు మోడీనే ప్రశంసంల్లో ముంచెత్తుతున్నారు. మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత దాన్ని వ్యతిరేకించి ఎన్డీఏ నుంచి బైటికి వచ్చిన బీహార్ సీఎం నితీశ్ కుమార్.. మోడీ ముందు మోకరిల్లారు. అంతటి బలమైన నేత అయిన మోడీ నిర్ణయాలను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారనేది అసంబద్ధమైన వాదన.
రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు మధ్య గ్యాప్ పెరిగిందనే వాదనలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మార్పు జరిగింది. మీనాక్షి నటరాజన్ తొలిసారి రాష్ట్రానికి వచ్చిన సందర్భంలోనే సీఎం రేవంత్ రెడ్డి తన మాట నడుస్తలేదని, నేతలు తనకు సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరో వాదన ఏమిటంటే రేవంత్ కు రాహుల్ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదంటున్నారు. అందుకే రాష్ట్ర ప్రాజెక్టులు, నిధుల విషక్ష్ంలో ప్రధానితో భేటీ అయ్యారు. అయితే ఇది రాజకీయ పర్యటనే అంటున్నారు. తనకు మరో ఆప్షన్ ఉన్నదని చెప్పడమే రేవంత్ ఉద్దేశం రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి బలం చేకూర్చే విధంగానే డిసెంబర్ లో ముఖ్యమంత్రి మార్పు ఖాయమని బీజేపీ ఎల్పీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ టాస్క్ ను కంప్లీట్ చేయడానికే మీనాక్షి నటరాజన్ కు అప్పగించారని ఆరోపించారు. రాష్ట్ర కాంగ్రెస్ లో ఏదో జరుగుతున్నదనే బలమైన సంకేతాలు వెలువడుతున్నాయి. అందుకే రేవంత్ డైవర్సన్ పాలిటిక్స్ లో భాగంగా కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారని అంటున్నారు.