Wednesday, 17 December 2025

ఓటరుపై చేయిచేసుకున్న సర్పంచ్‌ అభ్యర్థి.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ

 




టేకులపల్లి: తెలంగాణ పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్‌ నేపథ్యంలో పలు చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం బద్దుతండాలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఓ వ్యక్తి తొలుత గుర్తింపు కార్డు లేకుండా పోలింగ్‌ కేంద్రానికి వెళ్లాడు. ఓటేసేందుకు అధికారులు నిరాకరించడంతో వెనుదిరిగాడు. ఆ తర్వాత గుర్తింపు కార్డుతో మరోసారి అక్కడికి వచ్చాడు. ఈ క్రమంలో గమనించిన కాంగ్రెస్‌ అభ్యర్థి భూక్యా గంగారావు.. సదరు వ్యక్తి దొంగ ఓటు వేస్తున్నాడని ఆరోపిస్తూ ఆగ్రహానికి గురై అతడిపై చేయిచేసుకున్నాడు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. టేకులపల్లి సీఐ బత్తుల సత్యనారాయణ, ఎస్సై రాజేందర్‌ ఆధ్వర్యంలో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. 


నల్గొండ జిల్లా డిండి మండలం శాంతిగూడెంలోనూ రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తలు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. అతడిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం విలాసాగర్‌లో సర్పంచ్‌ అభ్యర్థి వద్ద పోలీసులు నగదు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలింగ్‌ కేంద్రం సమీపంలో జనం గుమిగూడి ఉండటంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. సర్పంచ్‌ అభ్యర్థి వద్ద రూ.28,500 నగదు పట్టుబడింది.

No comments:

Post a Comment

Featured post

దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి కన్నుమూత

  న్యూఢిల్లీ: దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి (71) కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో దూరదర్శన్‌ వార్తా ప్రసారాల్లో పరిచయమైన ...