- ప్రతిపక్ష పార్టీలపై మండిపడిన కేంద్రమంత్రి కిరెన్ రిజిజు
ఎన్నికల ప్రక్రియలకు సంబంధించి ప్రతిపక్షం 'తప్పుడు కథనాన్ని' ప్రచారం చేస్తోందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు విమర్శించారు. మంగళవారం ప్రతిపక్ష పార్టీలపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
ఎన్నికల సంస్కరణలపై చర్చ
ఇవాళ లోక్‌సభలో ఎన్నికల సంస్కరణలపై జరగనున్న చర్చలో ప్రతిపక్షం సృష్టిస్తున్న 'భ్రమ'ను తొలగించడానికి ప్రభుత్వానికి అవకాశం లభిస్తుందని రిజిజు తెలిపారు. ప్రజల విశ్వాసం, ఎన్నికల ప్రక్రియల్లో వారి భాగస్వామ్యానికి సంబంధించి ప్రతిపక్షం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రభుత్వం తిప్పికొడుతుందని చెప్పారు.ఎన్నికల సంఘం వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన ' సర్' ప్రక్రియపై చర్చ ప్రధానంగా జరుగుతుంది. ఓటర్ల జాబితాలో లోపాలు ఉన్నాయని, నిజమైన ఓటర్లను తొలగించడానికి ప్రభుత్వం ఈ ప్రక్రియను దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు ఈ చర్చను ప్రారంభించే అవకాశం ఉంది. లోక్‌సభ, రాజ్యసభల్లో ఎన్నికల సంస్కరణలపై చర్చకు మొత్తం 10 గంటల సమయం కేటాయించబడింది. రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ చర్చను ప్రారంభించే అవకాశం ఉంది.
'వందేమాతరం' చర్చపై స్పష్టత
ఆరోపణను ఖండించిన రిజిజు: రాబోయే పశ్చిమ బెంగాల్ ఎన్నికల కారణంగానే 'వందేమాతరం'పై పార్లమెంట్‌లో చర్చ జరుపుతున్నారనే ప్రతిపక్షాల ఆరోపణను రిజిజు కొట్టిపారేశారు. జాతీయ గీతం 'వందేమాతరం' నవంబర్ 7 నాటికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున మాత్రమే ఈ చర్చ జరుగుతోందని, చారిత్రక సంఘటనల తేదీలను ప్రభుత్వం నిర్ణయించదని ఆయన స్పష్టం చేశారు.
ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోడీ మార్గనిర్దేశం
ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంపీలకు మార్గనిర్దేశం చేస్తూ, ప్రజల మెరుగుదలకు, వారి జీవితాలను సులభతరం చేయడానికి అన్నిరంగాల్లో సంస్కరణలపై దృష్టి పెట్టాలని కోరారు. అలాగే ఇటీవల ఇండిగో విమానాల్లో జరిగిన గందరగోళాన్ని ప్రస్తావిస్తూ, భారతీయ పౌరులకు ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని ప్రధాని ఆదేశించారు. నియమ నిబంధనలు వ్యవస్థను సరిదిద్దడానికి ఉండాలి తప్ప, ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కాదని చెప్పారు. ఎంపీలందరూ యువతతో మమేకమై వారి కోసం కృషి చేయాలని కూడా ప్రధాని కోరారు.
No comments:
Post a Comment