- నేడు విజయ్ దివస్
ప్రతి సంవత్సరం డిసెంబర్ 16న జరుపుకునే విజయ్ దివస్ సందర్భంగా, 1971 యుద్ధంలో భారత సైన్యం సాధించిన చారిత్రక విజయాన్ని గుర్తుచేసుకుంటూ.. ప్రధాని నరేంద్ర మోడీ వీర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. ఈ రోజున 1971 ఇండో-పాక్ యుద్ధంలో తమ విధిని నిర్వర్తిస్తూ దేశం కోసం ప్రాణాలర్పించిన వీర సైనికులందరి త్యాగాలను ఆయన స్మరించుకున్నారు.
"నేడు విజయ్ దివస్. నాడు, 1971 యుద్ధంలో భారతదేశానికి నిర్ణయాత్మక విజయాన్ని అందించడంలో తమ కర్తవ్య నిబద్ధతను చాటుకున్న ధైర్యవంతులైన వీరులందరికీ హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాము. వారి పరాక్రమం, అంకితభావం దేశానికి అపార గర్వకారణం. వారి త్యాగాలు, అకుంఠిత దీక్ష ప్రజల హృదయాల్లో, దేశ చరిత్రలో ఎల్లప్పుడూ సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటాయి. ఆ వీరుల ధైర్యసాహసాలకు భారతదేశం శిరసాభివందనం చేస్తుంది" అని ప్రధాని మోడీ సందేశం పంపారు.
1971లో పాకిస్థాన్‌పై భారత్ సాధించిన ఈ విజయం బంగ్లాదేశ్ విముక్తికి దారితీసింది. ఆ యుద్ధంలో భారత సైనికులు కనబరిచిన అసాధారణ ధైర్యం, పరాక్రమాన్ని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ప్రధాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి, రక్షణ శాఖ మంత్రి సహా పలువురు ప్రముఖులు కూడా అమరవీరులకు నివాళులు అర్పించారు.
No comments:
Post a Comment