Tuesday, 30 December 2025

బెంగాల్‌కు 'దుశ్శాసనుడు' వచ్చాడు

 



  • అమిత్ షా విమర్శలకు మమతా బెనర్జీ ఘాటు కౌంటర్!

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మాటల యుద్ధం ముదిరింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన విమర్శలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ బెంగాల్‌లో 'దుశ్శాసనులు, దుర్యోధనులు' కనిపిస్తారని ఆమె ఎద్దేవా చేశారు. కోల్‌కతా పర్యటనలో ఉన్న అమిత్ షా, మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. సరిహద్దుల్లో కంచె వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం భూమిని ఇవ్వడం లేదని, చొరబాటుదారులను తన ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికే మమత ఇలా చేస్తున్నారని ఆయన విమర్శించారు. అంతేకాకుండా, బెంగాల్‌లో గత 14 ఏళ్లుగా 'భయం, అవినీతి' రాజ్యమేలుతున్నాయని మండిపడ్డారు.

ఈ వ్యాఖ్యలపై స్పందించిన దీదీ, అమిత్ షాను మహాభారతంలోని 'దుశ్శాసనుడి'తో పోల్చారు. "బెంగాల్‌కు ఒక దుశ్శాసనుడు వచ్చాడు. ఆయన శకుని శిష్యుడు, కేవలం సమాచారం సేకరించడానికే ఇక్కడికి వస్తారు. మేము భూమి ఇవ్వలేదని వారు చెబుతున్నారు.. మరి పెట్రాపోల్, అండాల్‌లలో కంచె వేయడానికి భూమి ఇచ్చింది ఎవరు?" అని ఆమె ప్రశ్నించారు. చొరబాటుదారులు కేవలం బెంగాల్ నుంచే వస్తున్నారా? అలాగైతే పహల్గామ్‌లో దాడి ఎలా జరిగింది? ఢిల్లీలో జరిగిన పేలుళ్ల వెనుక ఎవరున్నారు? అని ఆమె నిలదీశారు.

ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) పేరుతో ప్రజలను వేధిస్తున్నారని, ఒకవేళ అర్హులైన ఓటరు పేరు తొలగిస్తే తాను ధర్నాకు దిగుతానని హెచ్చరించారు. కేవలం మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి మాత్రమే సంపాదించే హక్కు ఉందని అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ, "మీరు, మీ కుమారుడు (జై షా) మాత్రమే తింటారు, మాకు మాత్రం నీతులు చెబుతారా?" అని ఘాటుగా బదులిచ్చారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ, టీఎంసీ మధ్య జరుగుతున్న ఈ ఆరోపణలు బెంగాల్ రాజకీయాలను వేడెక్కించాయి.
























No comments:

Post a Comment

Featured post

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...